నేవీ డే వేడుకలకు వైజాగ్‌ దూరం ఎందుకు?
x
విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ ఏడాది జనవరిలో నేవీ డే విన్యాసాలు

నేవీ డే వేడుకలకు వైజాగ్‌ దూరం ఎందుకు?

ఏటా డిసెంబర్‌ వస్తోందంటే విశాఖ వాసులకు సందడే. తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని నేవీ డే వేడుకకు వేదిక విశాఖ కావడమే దీనికి కారణం!

ఏడాదికోసారి విశాఖలో జరిగే ప్రతిష్టాత్మక నేవీ డే వేడుక ఏటా ఏదొక చోటకు తరలి పోతోంది. కొన్నేళ్లుగా ఏదో ఒక కారణంతో ఇది విశాఖకు దూరమవుతోంది. ఈ ఏడాది కూడా అదే పరంపర కొనసాగుతోంది. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్‌ విజయం సాధించినందుకు గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ ఇందుకు వేదికవుతోంది. ఈ నేవీ డే వేడుక సందర్భంగా నిర్వహించే విన్యాసాల్లో యుద్ధం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.

వారం రోజుల ముందు నుంచే సందడి..
ఈ నేవీ డే వేడుకలను నగరంలోని ఆర్కే బీచ్‌ వేదికగా జరుపుతుంటారు. నేవీ డేకి వారం రోజుల ముందు నుంచే విశాఖలో నావికాదళ సందడి మొదలవుతుంది. రిహార్సల్స్‌లో భాగంగా మెరుపు వేగంతో రయ్‌ రయ్‌మంటూ దూసుకుపోయే రకరకాల యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు, బాంబుల మోతలు, యుద్ధనౌకల సోయగాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో విన్యాసాలు జరుగుతాయి. నేవీ డే వరకు మినీ యుద్ధ వాతావరణాన్ని వైజాగ్‌ వాసులు ఆస్వాదిస్తుంటారు.
ఏం విన్యాసాలు జరుగుతాయి?
నేవీ డే సందర్భంగా నావికాదళం ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలను నిర్వహిస్తుంది. యుద్ధ విమానాల నుంచి బాంబులు జారవిడిచి పేల్చడం, జలాంతర్గామి (సబ్‌మెరైన్‌) సాగర గర్భంలోంచి బైటకు వస్తూ శతృమూకలపైకి మెరుపు దాడులు చేయడం, మెరైన్‌ కమెండోలు (మార్కోస్‌) శతృ సైన్యంపైకి జెమినీ బోట్లలో దూసుకు రావడం, ప్రమాదంలో చిక్కుకున్న నావికులను సీకింగ్‌ హెలికాప్టర్లలో వచ్చి రక్షించడం, సముద్రంలో శతృ దేశం ఆయిల్‌ రిగ్‌ను పేల్చి వేయడం, ఉభయ చర యుద్ధ ట్యాంకులు సముద్రంలోంచి వచ్చి తీరంలో చక్కర్లు కొట్టడం, శతృ దేశం ఆయిల్‌ రిగ్‌ పేల్చివేత వంటి ఎన్నో విన్యాసాలు కనువిందు చేస్తుంటాయి. ఇంకా ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి నేవీ డైవర్లు యుద్ధ విమానాల నుంచి దూకి త్రివర్ణ పతాక పారాచూట్లతో స్కై డైవింగ్‌ చేస్తూ ప్రధాన వేదికపైకి దిగడం, యుద్ధ నౌకలపైకి హెలికాప్టర్లను దించడం, యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్, డోనియర్‌ హెలికాప్టర్లు, హాక్స్‌ యుద్ధ విమానాలు శబ్ద వేగంతో భూమిపైకి దూసుకు రావడం, డోనియర్‌ హెలికాప్టర్ల దూకుడు, పీ–8ఐ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్‌ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లడం వంటివి అబ్బుర పరుస్తాయి.
2023 నుంచి వేడుకల వేదిక మార్పు..
ఏటా భారత నౌకాదళ వేడుకలు వెస్ట్రన్, ఈస్ట్రన్, సదరన్‌ కమాండ్‌లలో జరుగుతుంటాయి. అయితే ప్రధాన వేడుకలు మాత్రం తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖలోనే జరుగుతాయి. వీటికి కేంద్ర రక్షణమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి, భారత/తూర్పు నావికాదళ ప్రధానాధికారి, రాష్ట్ర మంత్రులు, నేవీ ఉన్నతాధికారులు హాజరవుతారు. నేవీ డే వేదికలను మారుస్తుండాలని 2023లో నిర్ణయించి దానిని పశ్చిమ కమాండ్‌లో నిర్వహించాలనుకున్నారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూర్పు నావికాదళం పరిధిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఒడిశాలోని పూరీలో గత ఏడాది డిసెంబర్‌ 4న నేవీ డే వేడుకలు జరిపారు. అయితే నెల రోజుల తర్వాత జనవరి 4న విశాఖలో మరోసారి నేవీ డే విన్యాసాలు జరిగాయి. ఆ వేడుకలకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, సీఎం చంద్రబాబు, ఆయన మనవడు దేవాన్ష్‌తో హాజరయ్యారు.
ఈసారి వేడుకలు షంగుముగం బీచ్‌లో..
ఈ ఏడాది నేవీ డే (డిసెంబర్‌ 4) వేడుకలను విశాఖలో కాకుండా సదరన్‌ కమాం పరిధి కేరళలోని తిరువనంతపురం షంగముగం బీచ్‌లో నిర్వహిస్తున్నారు. తూర్పు నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. నేవీ డే వేదిక మారిన నేపథ్యంలో డిసెంబర్‌ 4న బీచ్‌ రోడ్డులోని విక్టర్‌ ఎట్‌ సీ వద్ద ఉన్న యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరులకు నౌకాదళ అధికారులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించి గౌరవ వందనం చేస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆర్కే బీచ్‌కు సమీపంలో యుద్ధనౌకలను ప్రదర్శనకు ఉంచి, చీకటి పడగానే విద్యుత్‌ వెలుగులను విరజిమ్ముతారు.
ఇది నాలుగోసారి..
నేవీ డే వేడుకలు విశాఖేతర ప్రాంతంలో నిర్వహించడం ఇది నాలుగోసారి. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ మరణించడంతో సంతాప దినాలు పాటిస్తున్నందున ఆ ఏడాది నేవీ డే జరగలేదు. కోవిడ్‌ కారణంగా 2020లో వేడుకలు నిర్వహించలేదు. 2024లో పూరీలో నేవీ డే వేడుకలు జరిగాయి. ఈ ఏడాది తిరువనంతపురం షంగుముగం తీరంలో నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాదీ మరో చోట ఎందుకంటే?
నేవీ డే వేడుకలను ఈ ఏడాది విశాఖలో నిర్వహించకపోవడానికి త్వరలో జరగనున్న వివిధ ఈవెంట్లే కారణం. ఫిబ్రవరి 15 నుంచి వారం రోజులు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), ఆ తర్వాత మిలాన్‌–2026 ఉన్నాయి. ఈ రెండూ పూర్తయ్యాక మహాసాగర్‌ పేరుతో ఇండియన్‌ ఓషన్‌ సింపోజియం సదస్సు తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ నేవీ డేకి నాటికి రెండు నెలలే ఉన్నందున ఈ ఏడాది వేడుకలు తిరువనంతపురంలో జరపాలని నిర్ణయించారు.
నేవీ డే నేపథ్యం తెలుసా?
ఇండియన్‌ నేవీని 1612లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించింది. అప్పట్లో దీనిని రాయల్‌ ఇండియన్‌ నేవీగా పిలిచేవారు. ఇండియా, పాకిస్తాన్ల మధ్య 1971లో జరిగిన యుద్ధ సమయంలో డిసెంబర్‌ 3న పాకిస్తాన్‌.. భారత్‌ వైమానిక స్థావరాలపై దాడికి పాల్పడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత నావికాదళం డిసెంబర్‌ 4,5, తేదీల్లో పాకిస్తాన్‌పై ప్రతి దాడులకు ప్రణాళిక రూపొందించింది. ఇందులోభాగంగా డిసెంబర్‌ 4న పాకిస్తాన్‌లోని కరాచీ నౌకాదళ ప్రధాన స్థావరంపై మెరుపుదాడి చేసి ఐఎన్‌ఎస్‌ ఖైబర్, పీఎన్‌ఎస్‌ ముహఫిజ్‌ సహా మూడు యుద్ధనౌకలను ముంచేసింది. ఈ దాడిలో పాక్‌కు చెందిన 500 మందికి పైగా నేవీ సిబ్బంది మరణించారు. రాత్రి వేళ జరిపిన ఆ దాyì కి ‘ఆపరేషన్‌ ట్రెడెంట్‌’ అని పేరు పెట్టారు. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన జలాంతర్గామి పీఎన్‌ఎస్‌ ఘాజీని విశాఖ తీరానికి సమీపంలోనే సముద్రంలో మన నేవీ పేల్చి వేసి తుత్తునియలు చేసింది. అనంతరం పాక్‌పై భారత్‌ విజయం సాధించింది. పాకిస్తాన్‌పై విజయానికి చిహ్నంగా భారత్‌ అప్పట్నుంచి ఏటా డిసెంబర్‌ 4న నావికాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
Read More
Next Story