
హాస్టళ్లలో ఎందుకిలా జరుగుతోంది..వార్డెన్లు ఏం చేస్తున్నారు
రోజూ నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదు. ఇలాంటి సంఘటనలు ఇకపై జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాన కార్యదర్శి విజయానంద్ సీరియస్ అయ్యారు.
సంక్షేమ హాస్టళ్లలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్‌లో సోమవారం పబ్లిక్ పర్ సెప్షన్ పైన, వివిధ శాఖల పనితీరుపైన సమీక్ష నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించి అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టళ్లలో ఏం జరుగుతోంది అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
హాస్టళ్లలో వార్డెన్లు ఏం చేస్తున్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. వార్డెన్లు ఏం పట్టించుకోరా? ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరేం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ప్రతి రోజూ నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదన్నారు. నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోటా సదుపాయాలున్నాయని వాటిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నారు. హాస్టళ్ల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టళ్ల పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛాంధ్ర నిధులతో అన్ని హాస్టళ్లలో ఎక్కడా కూడా మరుగుదొడ్లు, బాత్‌రూముల కొరత అనేదే లేకుండా చూడాలన్నారు. యుద్ద ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలన్నారు.
డేటాలేక్ పూర్తికావడంపై సంతృప్తి
ఆర్టీజీఎస్‌లో నిర్ణీత గడువులోపే డేటా లేక్ పనులు పూర్తి చేయడంపై విజయానంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల బహుళ ప్రయోజనాలుంటాయని, శాఖల పనితీరు మరింత సులభతరమవుతుందన్నారు. పీపుల్స్ పర్‌సెప్షన్‌పై ఆయన సమీక్షించారు. సంతృప్తి శాతం ఓవరాల్‌గా బాగానే కొన్ని శాఖలు ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరముందన్నారు. ఏయే జిల్లాల్లో ఆయా శాఖలకు సంబంధించి ఏఏ అంశాల్లో సంతృప్తి శాతం తక్కువ ఉందో చూసి, దానికిగల కారణాలను విశ్లేషించి సంతృప్తి శాతం మెరుగుపరచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్, ఆర్టీజీఎస్ డిప్యూటీ సెక్రటరీ మాలిక గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story

