బీసీ హాస్టళ్లలోనే ఇలా ఎందుకు జరుగుతోంది?
x

బీసీ హాస్టళ్లలోనే ఇలా ఎందుకు జరుగుతోంది?

అన్నపర్లు హాస్టల్ లో కలుషిత ఆహారం, పలువురు విద్యార్థులు ఆస్పత్రిపాలు, విచారణకు మంత్రి ఆదేశం


మరో బీసీ హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. విద్యార్థులను పెదనందిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారు.

ఈ సంఘటనపై సంబంధిత శాఖ మంత్రి సవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాల నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్సీకి వెళ్లారు. విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు డైరెక్టర్ మల్లికార్జున మంత్రి సవితకు తెలిపారు.
వాంతులు, విరేచనాలు తగ్గిన విద్యార్థులను ఇవాళ సాయంత్రానికి డిశ్చార్జి చేస్తారని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండమన్నారు. కాచి చల్లార్చిన తాగునీరు, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తాగునీరు, ఆహారం శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం పంపి నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అన్నారు.
రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఇటీవలి కాలంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని చోట్ల ప్రాణాలు కూడా పోయిన ఘటనలు ఉన్నాయి. కలుషిత ఆహారంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
Read More
Next Story