
రాయలసీమ ఎత్తిపోతలపై ఎందుకింత వివాదం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు: అభివృద్ధి ఆకాంక్షలు, జల వివాదాల మధ్య సంఘర్షణ.
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏపీ, తెలంగాణ మధ్య వివాదమే కాకుండా రెండు రాష్ట్రాల పార్టీల నాయకుల మధ్య కూడా వివాదం సృష్టించింది. ప్రధానంగా అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతల మధ్య ఈ ప్రాజెక్టు నిప్పు రాజేసింది. ప్రాజెక్టు రాయలసీమ కోసం నిర్మించేందుకు నిర్ణయిస్తే దానిని చంద్రబాబు నాయుడు నీరు కారుస్తున్నారని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అయితే సాగునీటి రంగ నిపుణులు మాత్రం ఈ పథకం శుద్ధ దండగ అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు (ఆర్‌ఎల్‌ఐఎస్) మరోసారి రాజకీయ, చట్టపరమైన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతుల జీవనోపాధిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ, అంతర్రాష్ట్ర జల వివాదాలు, పర్యావరణ అనుమతుల లోపాలు దీనిని స్తంభింపజేశాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ చర్చకు వచ్చి ప్రజల్లో అనవసరంగా చిచ్చు పెడుతోందనే విమర్శలు ఇరిగేషన్ రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి.
ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ బృదం
ప్రాజెక్టు స్వరూపం
రాయల సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అనేది కృష్ణా నదిపై శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ ప్రాంతానికి సరఫరా చేసే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ ప్రాజెక్టును ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి వద్ద నిర్మించాలని ఆలోచించారు. ఇక్కడ నుంచి నీటిని 800 అడుగుల ఎత్తు నుంచి రోజుకు 3 టీఎంసీల (సుమారు 3 వేల మిలియన్ క్యూబిక్ ఫీట్) వరకు ఎత్తిపోయాలని ప్రణాళిక. ఈ నీరు రాయలసీమలోని ఎడారి ప్రాంతాలకు సాగు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం. దీని ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగు నీరు అందుతుందని అంచనా.
ప్రాజెక్టు అంచనా ఖర్చు మొదట్లో రూ. 6,810 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, ఇప్పటి వరకు రూ. 990 కోట్లు వ్యయమైనట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి. అందులో రూ. 390 కోట్లు సివిల్ వర్క్స్‌కు, రూ. 283 కోట్లు మెకానికల్ వర్క్స్‌కు కేటాయించారు. ఈ నీటి సరఫరా ద్వారా తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్ వంటి అనేక ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని సాగు భూములకు ఉపయోగం.
వివాదానికి మూలాలు
ఈ ప్రాజెక్టు వివాదానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నది జలాల వాటా. తెలంగాణ ప్రభుత్వం ఆరోపణల ప్రకారం ఈ ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ఏపీ అనధికారికంగా ఎక్కువ నీటిని డ్రా చేస్తుంది. అంతేకాకుండా పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం కూడా వివాదానికి దారితీసింది.
2020లో తెలంగాణా ప్రభుత్వం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించింది. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఆరోపించింది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఎందుకంటే అవసరమైన అనుమతులు పొందకుండా ముందుకు సాగడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ ఆర్డర్ వల్ల ప్రాజెక్టు 2020లోనే స్తంభించిపోయింది. ఆ తరువాతి రాజకీయ మార్పులు దీనిని మరింత వెనక్కి నెట్టాయి.
2024 నుంచి నిశ్శబ్దం, తాజా పరిణామాలు
2024 నుంచి ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా చర్చ లేదు. ఎందుకంటే ఎన్‌డీఏ ప్రభుత్వం దీనిని ఆపు చేసినట్లు కనిపిస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వంలో 2020లో ప్రారంభమైనప్పటికీ రాజకీయ విరోధాలు, చట్టపరమైన అడ్డంకులు దీనిని మరచిపోయేలా చేశాయి. అయితే 2026 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు తన ప్రభావం వల్ల ఆగిపోయిందని క్లెయిమ్ చేయడంతో మళ్లీ వివాదం రేగింది. ఏపీ ప్రభుత్వం దీనిని తోసిపుచ్చుతూ ఎన్‌జీటీ ఆర్డర్ వల్లే ఆగిందని పేర్కొంది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రాజెక్టు పనులను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ విఘాతాలు రైతుల హక్కులను హరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
రాజకీయం, పర్యావరణం మధ్య సమతుల్యత అవసరం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైనది అయినప్పటికీ, అంతర్రాష్ట్ర జల వివాదాలు, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు దీనిని సవాలుగా మార్చాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వం రాయలసీమ రైతులకు నీటి సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశించినప్పటికీ, మరోవైపు తెలంగాణా ఆందోళనలు జల వాటాల సమతుల్యతను ప్రశ్నిస్తున్నాయి. ఎన్‌జీటీ తీర్పు పర్యావరణ సుస్థిరత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అయితే రాజకీయ మార్పులు ప్రాజెక్టును రాజకీయ సాధనంగా మార్చాయి.
రేవంత్ రెడ్డి క్లైమ్ ల చుట్టూ తిరుగుతున్న జల వివాదం
ప్రస్తుత వివాదం రేవంత్ రెడ్డి క్లెయిమ్‌ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇది రెండు రాష్ట్రాల మధ్య జల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఏపీ ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్ర జల హక్కులపై ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ, వైఎస్‌ఆర్‌సీపీ దీనిని ప్రజలను మోసం చేయడమే అనే ఆరోపణలు చేస్తోంది. దీర్ఘకాలిక పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కేంద్ర జల కమిషన్ ద్వారా సంప్రదింపులు జరిపి, పర్యావరణ అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి. ఇలాంటి వివాదాలు రైతుల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి సమతుల్య విధానం అవసరం.
సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ ఏమన్నారంటే...
గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనలు కానీ ప్రజల కోసం ప్రాజెక్టులు నిర్మించడం లేదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల కమీషన్ ల కోసం మాత్రమే ఈ విధానాలు అవలంబిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీ నారాయణ విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం చేపట్టిందే. చట్టాన్ని ఏపీకాని, తెలంగాణ కానీ గౌరవించ లేదు. కృష్ణా జలాల పరిరక్షణ బోర్డు నిర్ణయాలను వీరు గౌరవించ లేదు అని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాజకీయ ఆయుధాలు తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమా? అవాస్తవమా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తామని చెప్పారా … రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తే రాయలసీమకు హక్కుగా ఉన్న నీరు పొందడానికి ఏయే ప్రాజెక్టులను బదులుగా మీరు రేవంత్ రెడ్డిని కోరారు … ఇటు రాయలసీమకు, అటు తెలంగాణకు ప్రయోజనం కలిగే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ఆయనను ఒప్పించారా …? రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ జీవిత కాలాన్ని పెంచే దిశగా పూడికను నివారించడానికి చర్యలు తీసుకున్నారా? వంటి ప్రశ్నలు సీఎం చంద్రబాబు నాయుడుపై రాయలసీమ సాగునీటి సాధన సమితీ అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి సంధించారు.
అన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా అందడానికి ఉపయోగపడే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం గురించి ఆయనను ఒప్పించారా అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తామని ఇచ్చిన జీవో నెంబర్ 24 లో ప్రకటించిన విధంగా పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నేడు దీని వల్ల పెద్దగా ఫలితాలు లేవని సీఎం ప్రకటించడంలో అంతర్యమేమిటో వివరించాలి అని అన్నారు.
రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు ఖర్చు పెట్టకుండా కేవలం ప్రకటనలతో కాలం వెళ్లబుస్తున్నారు. నిన్నటికి నిన్న అలుగునూరు రిజర్వాయర్ 36 కోట్ల రూపాయల నిధులు వెచ్చించామని నిమ్మల రామానాయుడు ప్రకటన చేశారు. ఈరోజు వరకు ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అవసరమైన డిజైనర్ ఫైనల్ చేయలేదు. కాంట్రాక్టర్ ను పిలవలేదు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి అదే విధంగా రాయలసీమలో ఉన్న అనేక ప్రాజెక్టుల దుస్థితి గురించి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా నిధుల కొరత, ఏదో వంకతో “పోస్ట్ పోన్” చేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అంతటికీ కారణం నిధుల కొరత అంటున్నారు. నిధుల కొరత ఎందుకు వచ్చింది? నిధుల కొరతను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై కూడా స్పష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రత్యేకంగా ప్రజా సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. అని దశరథ రామిరెడ్డి అన్నారు.

