
తెలుగు రాష్ట్రంలో సంస్కృత శిలాఫలకం ఎందుకు?
అమరావతిలో మోదీ సర్కార్ సరికొత్త ప్రయోగం
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో మే2న చే సిన శంకుస్థాపనల శిలాఫలకాలపై నాలుగు భాషలు ఉండడంపై రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. తెలుగు, హిందీ, ఆంగ్లం తోపాటు తాజాగా సంస్కృతంను కూడా చేర్చడం ఒక విశేషంగా మారింది. గతంలో మూడు భాషలకే పరిమితంగా ఉండే శిలాఫలకాల్లో ఇది ఒక మార్పుగా కనిపిస్తుంది.
నాలుగు భాషల్లో శంకుస్థాపన శిలా ఫలకాలు
వివిధ రాష్ట్రాలలో భాషల వాడకంపై వివాదం చెలరేగుతున్న సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో నాలుగు భాషల్లో శిలాఫలకాలు ఉండడం గమనార్హం.
ఇది కేంద్ర విధానమా?
సంస్కృతం చేర్చడం ఒక్కో సందర్భంలో ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇవ్వడంతో జరుగుతోంది. కానీ, అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో పాటించాల్సిన విధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే కొన్ని సందర్భాల్లో సంస్కృత సంస్కృతికి ప్రాధాన్యమిచ్చిన సందర్భాలు లేకపోలేదు.
ఉదాహరణకు కాశీ విశ్వనాథ్ కారిడార్, రామ మందిర ప్రారంభ వేళల్లో కూడా సంస్కృతానికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. 2023 లో ప్రధాని మోదీ సంస్కృతాన్ని 'భారతీయుల అస్థిత్వానికి కీలకమైన భాషగా' అభివర్ణిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో దీన్ని ప్రోత్సహించాలని పిలిపిచ్చారు.
అమరావతిలో ఎందుకు?
ఇది రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందుతున్న ప్రాంతం. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి వేళ సంస్కృతాన్ని చేర్చడం ద్వారా సరికొత్త వివాదానికి తెరలేపినట్టయింది.
సంస్కృతంలో ఉన్న శిలా ఫలకం
ఇది ఒక కేంద్ర విధానంగా ఖరారు కాలేదు గాని భవనాలు, ప్రాజెక్టుల ప్రారంభాలలో సంస్కృతం చేర్చడం ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానానికి అనుగుణంగా జరుగుతోంది. దీన్ని ఒక సంకేతాత్మక నిర్ణయంగా, సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నంగా పరిగణించవచ్చునని చెబుతోంది.
భారత కేంద్ర ప్రభుత్వం శిలాఫలకాలపై భాషల వాడకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. The Official Languages (Use for Official Purposes of the Union) Rules, 1976 ప్రకారం "కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే అన్ని నేమ్‌ప్లేట్లు, సైన్‌బోర్డులు, లెటర్‌హెడ్‌లు, ఇతర స్టేషనరీ అంశాలు హిందీ, ఆంగ్ల భాషల్లో ఉండాలి." రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత భాషలతో పాటు ఇంగ్లీషును ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఈ నియమాల నుండి మినహాయింపులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.
సంస్కృతం చేర్చడం గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 అధికారిక భాషలలో సంస్కృతం ఒకటి. అయితే, శిలాఫలకాలపై సంస్కృతం చేర్చడం గురించి ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వ విధానం లేదు.
సంస్కృతం చేర్చడమంటే..
అమరావతిలో నాలుగు భాషలలో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా సంస్కృతం చేర్చడం, కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కాకుండా, ప్రత్యేక సందర్భంలో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నందున సంస్కృతాన్ని చేర్చి ఉండవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ శిలాఫలకాలపై భాషల వాడకానికి సంబంధించి హిందీ, ఆంగ్ల భాషల వాడకం తప్పనిసరి. అయితే, ఇతర భాషల చేర్చడం ప్రత్యేక సందర్భాలలో, సంస్కృతం వంటి భాషల ప్రోత్సాహానికి సూచికగా చెప్పవచ్చు.
భాషలపై వివాదం జరుగుతున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో శిలాఫలకాలపై సంస్కృతం చేర్చడం అనేది పక్కా రాజకీయ ప్రాధాన్యత కలిగిన చర్యగా పరిగణించవచ్చు.
హిందీ భాషా ఆధిపత్యంపై విపక్ష పార్టీలు, దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. NEP (National Education Policy) వంటి విధానాలలో సంస్కృతం, హిందీ వంటి భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భాషా స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్కృతం చేర్చడం అనేది ప్రాచీన భారతీయతకు చిహ్నం అని బీజేపీ వాదించవచ్చు గాని తెలుగు రాష్ట్రంలో సంస్కృతాన్ని ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో ఇది ఇతర స్థానిక భాషలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంకేతంగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సంస్కృతాన్ని భారతీయ సంస్కృతికి మూలంగా ప్రతిష్ఠాపించడానికి యత్నిస్తోందా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చిహ్నాత్మక భాషా నిర్ణయాలు రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముంది.
Next Story