
ది ఫెడరల్ గ్రాఫిక్స్ యూనిట్
ఆంధ్రా గ్రానైట్ కు కష్టకాలం? ఎందుకిలా??
క్వారీ గుంతల్లో నీళ్లు నిలిచి... ఎగుమతులు మందగించి. పోర్టుల్లో శ్లాబులు నిలిచి... అందమైన గ్రానైట్ రాళ్లు రంగుమారిపోతున్నాయి.
సీన్ 1- ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా పొదిలి వెళుతుంటే రామతీర్థం దగ్గర్నుంచి ఓ పది కిలోమీటర్లు దుమ్మురేగుతుంటుంది.. రోడ్ల మీద రయ్, రయ్.. మంటూ టిప్పర్లు వస్తుంటాయి, గ్రానైట్ క్వారీలలోకి పోతుంటాయి.. రోడ్డుపై రేగే దుమ్ము పైకి లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లుతుంటారు.. రోడ్డు సంగతైతే చెప్పాల్సిన పనే ఉండదు.. గజానికో గుంత.. రోజుకో యాక్సిడెంట్..

సీన్ 2- చిలకలూరిపేట నుంచి మద్రాస్ హైవే మీద పోతూ ఉంటే బాపట్ల జిల్లా మార్టూరు ఊరు దాటిన దగ్గర్నుంచి రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద క్రేన్లు కనిపిస్తుంటాయి.. వాటి సాయంతో గ్రానైట్ ముడిరాళ్లను పాలిష్ మెషిన్లలో పెట్టేందుకు కార్మికులు నానా తంటాలు పడుతుంటారు.. పెద్ద సైజు బోర్డులతో మిలమిల మెరిసే రాళ్లను కార్మికులు భారీ వాహనాలతో లారీలకు ఎక్కిస్తుంటారు..
సీన్ 3- శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతం.. పెద్ద పెద్ద గ్రానైట్ బండరాళ్లు ట్రాలీ మీద క్రష్షర్లకు, పాలిషింగ్ యూనిట్లకు తరలిపోతున్న దృశ్యం చూసి తీరాల్సిందే.. 16, 20 చక్రాల పెద్ద ట్రాలీ మీద మధ్యలో బ్లూషీట్ కప్పిన పెద్ద బండరాళ్లు తరలిపోతుండేవి.. క్రషర్లు కళకళలాడుతుండేవి. కోత మిషన్ల నుంచి వచ్చిన పాలిషింగ్ రాళ్లు మిలమిలా మెరుసిపోతుంటే కార్మికుల కళ్లల్లో ఆనందం తాండవిచ్చేది..
ఆనాటి సందడి ఇప్పుడేదీ?
అటువంటి గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు కునారిల్లుతోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమల్లో ఇప్పుడు సందడి తగ్గింది. అరుపులు, కేకలతో సందడి సందడిగా ఉన్న క్వారీ గుంతల్లో మౌనరాగం వినిపిస్తోంది. క్రష్షర్లు, కటింగ్ మెషిన్ యూనిట్లు మూగబోయాయి. పాలిషింగ్ యూనిట్లు వెలవెలబోతున్నాయి. క్వారీ గుంతల్లో నీళ్లు నిలిచి... ఎగుమతులు మందగించాయి. నౌకాశ్రయాల్లో (పోర్టులు) శ్లాబులు నిలిచిపోయాయి. అందమైన గ్రానైట్ రాళ్లు రంగుమారిపోతున్నాయి. ఫలితంగా యూనిట్లు మూతపడుతున్నాయి. కార్మికులకు “రోజు వేతనం కూడా చెల్లించలేం” అనే దుస్థితి నెలకొంది.
ఏపీలో పరిశ్రమ ఎందుకు కష్టాల్లో పడింది?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రానైట్ పరిశ్రమ ఒకప్పుడు రాష్ట్రానికి రూ.3,000 కోట్లకు పైగా ఆదాయం తెచ్చేది. శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాలు గ్రానైట్ హబ్‌లుగా వెలిగాయి. నేరుగా 30,000 మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి ఇచ్చింది. కానీ ఇప్పుడు గ్రానైట్ క్వారీలలో ఆపరేషన్లు కొనసాగడం కష్టమై, వేల కుటుంబాలు రోడ్లపైకి వచ్చాయి.

ఈ సంక్షోభం ఒక్క కార్మికులపైనే కాదు యాజమాన్యాలపైనా ప్రభావం చూపింది.. ఇక్కడ గ్రానైట్ బ్లాకులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లేవి. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రానైట్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోనుంది.
గెలాక్సీ గ్రానైట్ కి పేరుగాంచిన ప్రకాశం జిల్లా చీమకుర్తి—గెలాక్సీ గ్రానైట్ హబ్. ఇక్కడ చిన్నా చితక కలిపి దాదాపు 200 యూనిట్లు మూతపడే స్థితి.
శ్రీకాకుళం జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. సుమారు 150 క్వారీలు ఈ జిల్లాలో ఉన్నాయి. వాటికి అనుసంధానంగా మరో 150 పాలింగ్ యూనిట్లు, 30 క్రషర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25 వేల మంది, పరోక్షంగా 45 వేల మంది ఉపాధి పొందేవాళ్లు. వీరిలో జిల్లాకు చెందిన వారే కాకుండా ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారూ ఉన్నారు.
నూతన మైనింగ్ పాలసీతో శ్రీకాకుళం జిల్లా సహా వివిధ ప్రాంతాలలో క్వారీలు, క్రష్పర్లు మూతపడే దుస్థితి నెలకొందని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు.
పెద్ద కార్పొరేట్ ఫ్యాక్టరీలు అడ్వాన్స్ పెట్టి స్టాక్ తీసేసుకోవడం వల్ల చిన్న యజమానులకు రాయి దొరకట్లేదు. పనివాళ్లకు పనిలేకపోతోంది.

మరోపక్క, బాపట్ల జిల్లాలో బల్లికురవ క్వారీలో ఇటీవల భారీ రాయి జారి ఆరుగురు వలస కూలీలు మృతి, పలువురికి గాయాలతో సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టం చేశారు.
ఎందుకు కష్టాలు పెరిగాయి?
అధిక రాయల్టీలు, సెస్:
APలో CBM (Cubic Meter)కి రూ.2,500 వరకు వసూలు చేస్తుంటే, గుజరాత్/తమిళనాడులో అది రూ.1,500 వరకే పరిమితం చేశారు. ఆంధ్రలోనూ అదే సూత్రం పాటించాలి.
తరచూ మారే పాలసీలు:
లీజ్ రీన్యువల్స్ ఆలస్యం, ఆకస్మిక తనిఖీలు పెట్టుబడిదారుల్ని వెనక్కి నెట్టాయి.
రాజకీయ/అధికార జోక్యం:
కొంతమంది ప్రభావశీలులకే లాభం; చిన్న యూనిట్లు మూతపడే స్థితి.
ఎగుమతుల మందగింపు:
కోవిడ్ తర్వాత ఆర్డర్లు తగ్గాయి; ఖర్చులు (కరెంట్, ట్రాన్స్‌పోర్ట్) పెరిగాయి.
పెద్ద కంపెనీల ఎంట్రీ:
అడ్వాన్స్ పెట్టి క్వారీ స్టాక్ మొత్తం తీసేసుకోవడం; చిన్న యజమానులకు రాయి దొరకట్లేదు.
కార్మికుల ఆవేదన...
“క్వారీలు ఆగిపోయాయి. పని లేదు. బత్తాలు కూడా లేవు. పస్తులుంటున్నాం.” – చీమకుర్తి గ్రానైట్ కార్మికుడు ఉమా మహేశ్.
“పరిశ్రమలు తెరవమని అడిగితే మంత్రి తినడం మానేస్తావా అని వ్యంగ్యంగా మాట్లాడారు.” – టెక్కలి ప్రాంత కార్మికుడు పరమేశ్వర్.
“ఈ ప్రభుత్వం వచ్చాక మా లాంటి పేదలకు పెద్ద ఇబ్బందులు వచ్చాయి. గతంలో ఉపాధి బాగుండేది.” – మార్టురు గ్రానైట్ కార్మికుడు ఓబులేశు.
ఉపాధి కోల్పోయినవారు మళ్లీ వలస బాట పట్టే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
మినర్ మినరల్ పాలసీ 2025:
చిన్న ఖనిజాలకి అప్లికేషన్-బేస్డ్ లీజులు మళ్లీ తెచ్చారు. MSMEలకు ఊతమని చెబుతున్నారు. OTS (One-Time Settlement) కింద 1,900 పెండింగ్ కేసులు పరిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టారు. కానీ ఇవి తక్షణ ఉపశమనం ఇవ్వలేదని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

ఈ మేరకు పరిశ్రమను కాపాడమంటూ ఇటీవల Sign Petition పేరిట సుమారు 30 మంది గ్రానైట్ పరిశ్రమల అధిపతులు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు.
“తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ గ్రానైట్ ఎగుమతి మార్కెట్లో తన స్థానాన్ని కోల్పోతుంది. వేలాది కుటుంబాలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతాయి” అని ఓ గ్రానైట్ కంపెనీ అధిపతి సుధాకర్ పోకూరి హెచ్చరించారు. ఆయన నాయకత్వంలోనే సుమారు 30 మంది ఓ అర్జీని ప్రభుత్వానికి సమర్పించారు. గ్రానైట్ రంగం కుప్పకూలకుండా కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలను సూచించారు.
పరిశ్రమ ప్రముఖులు/అసోసియేషన్లు ఏమంటున్నాయి?
“గెలాక్సీ రేట్లు క్యూబిక్ మీటర్ కి ఎక్కడైతే ₹27,000 వసూలు చేస్తున్నారో అదే వస్తువుకి మరోచోట ₹22,000 తీసుకుంటున్నారు. రేట్లను ఒకేలా చేయండి, చిన్న యూనిట్లకి నెలవారీ స్టాక్ కోటా కేటాయించండి” అని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
“ఎగుమతులు పడిపోవడమే కాదు, పవర్ బిల్లు/ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడంతో టన్నుకి ఉండే మార్జిన్ పడిపోయింది” అని రాయలసీమ యూనిట్లు చెప్తున్నాయి.
చీమకుర్తి–ప్రకాశం క్లస్టర్‌లో చిన్న యూనిట్లకి క్వారీ స్టాక్ కోటా ఫిక్స్ చేయాలి (ఉదా: నెలకు X క్యూబిక్ మీటర్లు/యూనిట్).
రాయల్టీ/ఫీజు స్టాండర్డైజేషన్—జిల్లా తేడాల్ని సరి చేసి ఒకే రేటు.
వాళ్లు ప్రతిపాదించిన డిమాండ్లు ఏమిటంటే..
-DMF (District Mineral Foundation) కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ ను ప్రస్తుత 30% బదులుగా 10–15%గా పరిమితం చేయాలి.
-కనీసం 3 ఏళ్ల పాటు స్థిరమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఉండాలి.
-గ్రానైట్ ప్రమోషన్ సెల్ ఏర్పాటు చేసి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అనుమతులు, సమస్యల పరిష్కారం, గ్లోబల్ ప్రమోషన్ వంటివి చూడాలి.
-రవాణా సబ్సిడీలు, వడ్డీ సబ్సిడీలు, పన్ను రాయితీలు ఇవ్వాలి.
-విధానపరమైన (పాలసీ) చర్చల్లో పరిశ్రమ భాగస్వామ్యం కల్పించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగదు.
పరిష్కారం ఎలా?
చిన్న యూనిట్లకు క్వారీ స్టాక్ కోటా కేటాయించి రాయల్టీ ఫీజు ఒకేలా ఉండేటట్టు చేయడం, సేఫ్టీ SOP అమలు.
ఎగుమతుల సబ్సిడీలు, వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్.
క్లస్టర్ ఆధారిత మెషిన్ షేర్ మోడల్, డ్రోన్/టెలీమెట్రీతో సస్టైనబుల్ మైనింగ్.
“ఇది కేవలం గ్రానైట్ గురించి కాదు—వేలాది కుటుంబాల జీవనాధారం గురించి. రాయి ఉంది… కానీ రన్‌వే లేదు. పరిశ్రమ నిలబడాలంటే పాలసీని రీసెట్ చేయాలి. చిన్న యూనిట్లకు రాయి అప్పగింత, సేఫ్టీ కట్టుదిట్టం—ఇవే వెంటనే చేయాల్సిన మూడు పనులు” అని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు స్థిరమైన విధానాలతో పరిశ్రమకు ప్రోత్సాహకాలతో ముందుకు సాగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్ లోనూ చేయాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు.

“ఇది కేవలం గ్రానైట్ గురించి కాదు—వేలాది కుటుంబాల గౌరవం, జీవనాధారం గురించి. న్యాయమైన పాలసీలు, దూరదృష్టి ఉన్న నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్‌కి గ్లోబల్ నేచురల్ స్టోన్ మార్కెట్లో తిరిగి ప్రతిష్ట తెప్పించండి” అని పరిశ్రమ వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మైన్స్ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి.
“రాయి ఉంది… కానీ రన్‌వే లేదు”—స్టాక్, ఖర్చులు, పాలసీ గ్యాప్, సేఫ్టీ— ఇవన్నీ కలిసి గ్రానైట్ రంగాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి.
Next Story