
'విద్యా శక్తి'ని ఫ్యాప్టో ఎందుకు బహిష్కరిస్తోందీ?
ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేల కోట్ల కు పైగా చెల్లించాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పోరుబాట పట్టింది. ఇకపై బోధనేతర కార్యక్రమాలు నిర్వహించబోమని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందని, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా బోధనేతర పనులతో వేధిస్తోందని ఆరోపించింది. తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ ప్రకటించారు.
బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలి..
ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.28 వేల కోట్ల కు పైగా చెల్లించాలని.. వీటిని ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏకీకృత సర్వీసు రూల్స్ వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో–57 అమలు చేసి 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.
1998 డీఎస్సీలో మిగిలిపోయిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు అసమంజసమని, న్యాయబద్ధమైన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవడమేనని దుయ్యబట్టారు. ఈ తరహా బదిలీలను వెంటనే రద్దు చేయాలని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గత ప్రభుత్వం గ్రామీణ పేద బాలికల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన హైస్కూలు ప్లస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
ఫ్యాప్టో 20 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి. గత ప్రభుత్వం గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు హైస్కూల్ ప్లస్ లను ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు ప్రయత్నించిందని, దీనిపై పెద్దఎత్తున నిరసన రావడంతో వెనక్కి తగ్గి, ఆ స్కూళ్లల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులను సర్‌ప్లస్ పేరిట బదిలీ చేసిందని, ఈ విధానం పేద బాలికలు చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాయడమే అవుతుందని ఆరోపించింది.
Next Story