ఇప్పుడందరూ కడప వైపే చూస్తున్నారెందుకు?
x

ఇప్పుడందరూ కడప వైపే చూస్తున్నారెందుకు?

కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా షర్మిల ఎన్నికల పోరాటాన్ని నేరుగా తన సోదరుడు వైఎస్ జగన్‌ గడప వద్దకు తీసుకెళ్లారు.


ఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవేళ మరోసారి నామినేషన్ వేయబోతున్నారు. ఘనంగా జరుగుతున్నాయి. 22వందల కిలోమీటర్ల బస్ యాత్ర పూర్తి చేసి ఆయన పులివెందుల బయలుదేరారు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కడప జిల్లా నుంచీ అదీ తన సొంత చెల్లెలు నుంచి ఈసారి ఆయన విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఎన్నికల పోరాటాన్ని నేరుగా తన సోదరుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గడప వద్దకు తీసుకెళ్లారు. కడప జిల్లా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపికి, అంతకుముందు ప్రత్యేకంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కుటుంబంలో దూరపు బంధువుల మధ్య ఎన్నికల పోరు జరిగినా.. సొంత అన్నా చెల్లెళ్లు ఒకళ్లపై ఒకళ్లు సవాళ్లు విసురుకోవడం ఇదే తొలిసారి. దీంతో కడప దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట..

కడప లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట. ఆ తర్వాత అది YSRCPకి కోటగా మారింది. 1989, 1998 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి, షర్మిల తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కడప నుంచి లోక్‌సభకు కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన సోదరుడు వై.ఎస్. వివేకానందరెడ్డి రెండు సార్లు కడప ఎంపీగా ఉన్నారు. 2009లో జగన్ మోహన్ రెడ్డి ఈ సీటు నుంచి ఎన్నికయ్యారు. 2009లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ ప్రారంభించాలనుకోవడం, అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడం, చివరకు కాంగ్రెస్‌ను వీడి 2011లో సొంత పార్టీ వైఎస్సార్‌సీపీని పెట్టుకోవడం.. 2012లో ఉపఎన్నికల్లో మళ్లీ గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచే కడప పార్లమెంటరీ సీటును తన సమీప బంధువు, వైఎస్ జగన్ భార్య భారతి మేనమామ కుమారుడు అయిన అవినాశ్ రెడ్డికి సీటు కేటాయించడం మొదలైంది. 2014, 2019లో అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.
2019లో వైఎస్ వివేకానంద హత్య...

2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ సొంత బాబాయి వై.ఎస్. వివేకానంద రెడ్డి పులివెందులలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ హత్య చుట్టూ రాజకీయాలు నడిచాయి. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తరుణంలో వైఎస్ కుటంబంలో పొడసూపిన విభేదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారాయి. బాబాయి హత్యకు జగన్ కారణమంటూ షర్మిల ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మరో అడుగు ముందుకు వేసి తన తండ్రి హంతకులను జగన్ కాపాడుతున్నారని, సీబీఐ విచారణకు అప్పగించే అవకాశం ఉన్నా అప్పగించలేదని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిట్టింగ్ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి ఆరోపించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ కొనసాగుతున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో అవినాష్ రెడ్డిని ఓడించేందుకు అటు షర్మిల, ఇటు సునీత కంకణం కట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు. అవినాష్ ఓటమే తమ ఇద్దరి ఉమ్మడి లక్ష్యమని ప్రకటించారు.
బాబాయి పేరిట ప్రచారం...

వై.ఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ కుటుంబానికి, కడప ఓటర్లకు మధ్య ఉన్న ఏకైక లింక్ వివేకానందరెడ్డి. స్థానికంగా ఆయన అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. మంచివాడుగా పేరున్న వారు. ఇప్పుడా పేరిట షర్మిల ప్రజల మనసును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ ప్రముఖ ప్రబోధకుడు. అందువల్ల మైనారిటీ క్రిస్టియన్ ఓట్లను ఆమె దక్కించుకునే అవకాశం ఉంది. ఇదేగనుక జరిగితే అవినాష్ రెడ్డి గెలుపు అవకాశాలపై ప్రభావం చూపవచ్చు.
షర్మిలకున్న ఇబ్బందులు ఇవీ..
అయితే షర్మిలకూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. నాలుగేళ్లుగా తెలంగాణలోనే ఉంటున్న ఆమె కడప రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీని ప్రారంభించిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె ఏపీసీసీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల పోరాటానికి కాలుదువ్వుతున్నారు. అందులో భాగంగానే కడపలో తన సమీప బంధువైన అవినాష్ రెడ్డిపై పోటీకి దిగారు. రోజురోజుకూ ముదురుతున్న కుటుంబ తగాదాలతో ఓటర్లు అయోమయంలో పడే చాన్స్ లేకపోలేదు. ఇది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డికి లాభించవచ్చు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని టిడిపి ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
బీటెక్ రవి సరిపోతాడా..
కడపలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో వైఎస్సార్‌సీపీ కడప లోక్‌సభ సీటుతో పాటు మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్సీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేలందర్నీ బరిలోకి దింపింది. ప్రతిష్టాత్మకమైన పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరోపక్క వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన ఎం. రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి టీడీపీ తరఫున, షేక్ దస్తగిరి జైభీంరావ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తూ జగన్ కు ఎదురునిలిచారు.
సంక్షేమమే జగన్ ఆయుధం..
గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తన పార్టీని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో గెలిపిస్తాయని జగన్ చాలా నమ్మకంతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తన సభలన్నింటా ఆ అంశాన్నే ప్రచారం చేశారు. అయితే జగన్ ఆరోపణలకు, విమర్శలకు టీడీపీ కూడా ఘాటుగానే బదులిస్తూ వచ్చింది. వై నాట్ 175 అనే నినాదం ఇస్తున్న సమయంలోనే ఆమధ్య జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ విజయమే జగన్ ఓటమికి నాందీ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ గెలుస్తామంటున్నారు చంద్రబాబు. ఇది అసాధ్యమని తెలిసినా వైఎస్సార్సీపీకి కంచుకోట అయిన పులివెందులలో ఓట్ల కోసం పావులు కదుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుంటే టీడీపీకి కడప జిల్లా పెద్ద సవాలనే చెప్పాలి. షర్మిల, అవినాష్ రెడ్డి మధ్య జరిగే పోటీని వాళ్లిద్దరి మధ్య జరిగే పోటీ కన్నా అన్నా చెల్లెళ్ల మధ్య సాగే సమరంగానే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
Read More
Next Story