జగన్ చేసిన తప్పే చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి..
ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఎన్డీఏ అధికారం చేపట్టగానే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల భూములు ఈ చట్టం ద్వారా స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలును నిలిపి వేస్తామని చెప్పి ఆపివేశారు. ఆరు నెలల తరువాత తిరిగి ఈనెల 10 నుంచి భూముల రీ సర్వేను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ మంత్రం అని విమర్శలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన తప్పునే సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.
ల్యాండ్ టైటిల్ చట్టం అంటే ఏమిటి?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2022 ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం భూ యజమానులకు వారి భూముల పై స్పష్టమైన హక్కులను కల్పించడం. టైటిల్ గ్యారెంటీ ఇవ్వడం. భూ సంబంధిత వివాదాలను తగ్గించడం. ప్రతి సారీ ఏవో ఒక వివాదంలో భూ హక్కు దారులు చిక్కుకోకుండా, నిత్యం కోర్టుల చుట్టూ తిరగకుండా చేయడం. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒక కొత్త రిజిస్టర్‌ను తయారు చేస్తుంది. ఇందులో ప్రతి భూమి యజమాని వివరాలు, హక్కులు నమోదు చేస్తారు. భూ యజమానుల టైటిల్‌కు గ్యారెంటీ ఇస్తుంది. అంటే ప్రభుత్వం వారి హక్కులను రక్షిస్తుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ చట్టం ద్వారా భూ వివాదాలలో కోర్టుల ప్రమేయం తగ్గుతుంది. సమస్యకు త్వరగా పరిష్కారాలు దొరుకుతాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ఏమిటి?
ప్రస్తుతం అమలులో ఉన్న భూ చట్టాలకు టైటిల్ గ్యారెంటీ లేదు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమి వివరాలు కానీ, పట్టాదారుకు ఉన్న భూమి వివరాలు కానీ రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. ఎవరైనా ఒకరు వచ్చి ఈ భూమి తన తాతల నాటి భూమి అని, ఈ భూమిపై ప్రభుత్వానికి కానీ, సాగుదారుకు కానీ హక్కులు లేవని కోర్టులో కేసులు వేసే అవకాశం ఉంది. అంటే ఈ భూమి నాదేనని భూమి సొంత దారు కోర్టులో నిరూపించుకోవాలి. భూమిపై హక్కులు కల్పించినట్లు చెబుతున్న రెవెన్యూ శాఖ వారిని కోర్టు వివరాలు అడిగితే తమ రికార్డుల్లో ఉన్న వివరాలు మాత్రమే వారు ఇస్తారు. మా రికార్డుల్లో ఈ వివరాలు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఆ తరువాత కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. కోర్టు ఎవరి భూమి అని చెబితే వారికి రెవెన్యూ వారు భూమిని అప్పగించాలి. అందుకు పోలీసు వారు సహకరించాలి. ఇదీ ఇప్పుడు ఉన్న చట్టం.
కొత్త చట్టం ఎవరికి చుట్టం
కొత్తగా వచ్చిన ‘టైటిల్ గ్యారెంటీ చట్టం’ కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారికి చుట్టంగా మారుతుంది. ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి కూడా ఈ చట్టం బాగా ఉపయోగ పడుతుంది. ప్రధానంగా పెట్టుబడి దారులు వచ్చి ప్రభుత్వం నుంచి కానీ, పట్టా దారుల నుంచి కానీ కొనుగోలు చేస్తారు. ఈ చట్టం కింద టైటిల్ గ్యారెంటీ ఇస్తే ఇక వారిని కదిలించే వారు ఉండే అవకాశం లేదు.
టైటిల్ వ్యక్తికి కోర్టులో అండగా ఎవరుంటారు?
కొత్తచట్టం ప్రకారం ఈ భూమి పలానా వ్యక్తిది అని తేల్చి చెప్పేస్తుంది. ఈ భూమికి హక్కు దారు అని నిర్థారించిన వ్యక్తి కి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. దీని వల్ల వివాదాన్ని క్లైం చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు. ప్రభుత్వానికి, దానిని ప్రశ్నిస్తూ కోర్టుకు ఎక్కిన వ్యక్తి మధ్య వివాదం ఉంటుంది. ఒక వేళ కోర్టులో ప్రభుత్వం ఓడిపోతే టైటిల్ యజమానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న అజయ్ కళ్లం మాటల్లో ‘ఎస్యూరెన్స్ (Assurance) ప్రిన్సిపల్ అన్నారు. అదేదో నేరుగా టైటిల్ దారుకు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందని, ప్రభుత్వమే టైటిల్ దారు తరపున ఖర్చులు భరించి పోరాడుతుందని వివరించలేదు.
బడా బాబు లకు ఏవిధంగా ప్రయోజనం..
పెట్టుబడుల పేరుతో రాష్ట్రంలోకి వచ్చే బడా బాబులు వందలు, వేల ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తారు. ఆ తరువాత వారు టైటిల్ గ్యారెంటీ చట్టం ద్వారా టైటిల్ పొందుతారు. ఏవైనా న్యాయపరమైన వివాదాలు వస్తే వారి తరపున ప్రభుత్వం ఉంటుంది. ప్రజల ధనంతో వారికి అండగా ఉండి న్యాయ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతుంది. వేల కోట్ల పెట్టు బడులు పెట్టి నప్పుడు మా తరపున ప్రభుత్వం ఉండాలనే దానికి ఈ చట్టం బలం చేకూరుస్తుంది. ఇదీ పాలక పెద్దల అసలు స్వరూపం. ఇది పాలకులకు తెలియనిది కాదు. రికార్డులు బాగు చేసి టైటిల్ ఇస్తామని రైతులకు చెప్పటంతో వారు నమ్ముతారు. ఎందుకంటే ఎంత పెద్ద రైతు అయినా ఆయన పేరుతో 50 ఎకరాలు మించి భూమి ఉండేందుకు చట్టం అంగీకరించదు. కానీ కార్పొరేట్స్ కు ఎన్ని వందల ఎకరాలైనా ప్రభుత్వం ఇస్తుంది. లేదా కొనుగోలు చేసేందుకు సహకరిస్తుంది.
పాలకుల తరపున అధికారులు చెప్పే మాటలు
ఈ చట్టం భూ యజమానులకు పూర్తి భద్రతను ఇస్తుందని, భూ సంబంధిత వివాదాలను తగ్గిస్తుందని పేర్లు చెప్పేందుకు ఇష్టపడని ల్యాండ్ సర్వే ఉన్నతాధికారులు కొందరు తెలిపారు. పెట్టబడి దారులు భూ వివాదాలు లేని రాష్ట్రాలకు వచ్చేందుకు ఎక్కువగా ఇష్టపడతారని, అందువల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం ఉందని పాలకులు సైతం చెబుతున్నారు. ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయమై ఇటీవల మాట్లాడుతూ భూమి హక్కుల చట్టం ఎంతో మంచిదన్నారు. అయితే ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించి న్యాయంగా ఎవరి భూమి పై వారికి టైటిల్ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు రావని, గత ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అందుకే తాము భూ యజమానుల ఆకాంక్ష మేరకు వారితో మాట్లాడి వారి అంగీకారం తీసుకున్న తరువాతనే రీ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.
మూడొంతుల గ్రామాల్లో సర్వే పూర్తి..
తాము పకడ్బందీగా సర్వే చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం కూడా రీ సర్వేను పకడ్బందీగానే నిర్వహించామని చెబుతోంది. గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం 627 మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సర్వే మొదలు పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తమ భూములు లాక్కున్నారని రెవెన్యూ గ్రామ సదస్సుల్లో రెండు లక్షలు పైన ఫిర్యాదులు వస్తే లక్షన్నర వరకు పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. భూ వివాదమంటే అంత తేలిగ్గా పరిష్కారమయ్యేది కాదు. అయినా సదస్సుల వద్ద కొన్ని, ఆఫీసుల్లో కొన్ని సమస్యలు పరిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎల్పీఎం రద్దు
జాయింట్ ల్యాండ్ పార్సిల్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వం సబ్ డివిజన్ విధానం ద్వారా కాకుండా ఎల్పీఎం విధానం ద్వారా ల్యాండ్ టైటిల్ ఇచ్చారు. జాయింట్ ల్యాండ్ పార్సిల్ విధానంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు కలిపి ఒక నెంబర్ కేటాయించినట్లు ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. తాము అలా కాకుండా గతంలో మాదిరి భూమిని సబ్ డివిజన్ చేసి ఇస్తామని, దీని వల్ల ఎవ్వరికీ ఎటువంటి సమస్యలు రావని ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో 17,546 గ్రామాలు
ప్రభుత్వం రీ సర్వే చేసేందుకు 16,816 గ్రామాలు అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన 6,688 గ్రామాలు మినహాయించి మిగిలిన గ్రమాల్లో సర్వేను ప్రభుత్వం మొదలు పెట్టింది. కొత్తగా 172 గ్రామాల్లో సర్వే పూర్తి కావస్తోంది. ఇక్కడి అనుభవాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన గ్రామాల్లో కూడా సర్వేను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.