
cooperative Banks (గ్రాఫిక్స్)
సహకార బ్యాంకుల్లో మూలధనం ఎందుకు తగ్గుతోంది?
మూలధనం తగ్గితే ఏమవుతుంది? ప్రపంచ బ్యాంకు ఆందోళన ఎందుకు? సహకార వ్యవస్థకు ఎలా నష్టమో సీనియర్ జర్నలిస్టు కృష్ణ కానూరి విశ్లేషణ
(కృష్ణ కానూరి, విజయవాడ)
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రపంచ బ్యాంక్ (World Bank) తాజా నివేదిక విడుదల చేసింది. అందులో చాలా అంశాలున్నా నన్ను ఆకట్టుకుంది మాత్రం దేశంలోని సహకార వ్యవస్థలకు సంబంధించింది.
దేశంలోని సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణను ప్రశంసించింది. పటిష్టమైన నియంత్రణ చర్యలను కొనియాడుతూనే, కొన్ని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు (యుసిబిలు) తగినంత మూలధనం లేకుండా ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. ప్రాధాన్యతా రంగ రుణాల (పి.ఎస్.ఎల్)) లక్ష్యాలను చిన్న బ్యాంకులు అధిగమించినా, వాటి నిర్వహణ వ్యయాలు పెరిగాయని కూడా ఈ 'ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్‌మెంట్ (ఎఫ్.ఎస్.ఎ)' నివేదిక గుర్తించింది.
ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఆర్థిక రంగ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్.ఎస్.ఎ.పి) అనంతరం ఈ నివేదిక విడుదలైంది. 2017లో జరిగిన చివరి ఎఫ్.ఎస్.ఎ.పి తర్వాత సహకార బ్యాంకులపై ఆర్‌బీఐ తన నియంత్రణ పరిధిని గణనీయంగా పెంచడాన్ని నివేదిక అభినందించింది.
ఏకీకృత నియంత్రణ: అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు (యుసిబిలు) సహా అన్ని సంస్థలపై ఆర్‌బీఐ ఒకే విధమైన నియంత్రణ, పర్యవేక్షణ విధానాన్ని అమలులోకి తీసుకురావడాన్ని స్వాగతించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం: నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా నివేదిక ప్రశంసించింది.
తక్కువ మూలధనంపై హెచ్చరిక: ఈ నివేదిక ప్రకారం, యూసీబీ రంగం స్థూలంగా బలంగానే ఉంది. ఒత్తిడి పరిస్థితుల్లోనూ మొత్తం మూలధన పటిష్టత నిష్పత్తి (సిఎఆర్) 31 శాతంగా ఉంది. అయినప్పటికీ, నివేదిక కొన్ని ఆందోళనలను వ్యక్తం చేసింది.
మూలధన లోటు: సుమారు 20 నుంచి 22 యూసీబీలు (మొత్తం సహకార రంగ ఆస్తులలో 10 శాతం) ప్రతికూల పరిస్థితుల్లో కనీస నియంత్రణ మూలధనం కంటే దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
కారణం: ఈ లోటుకు ప్రధాన కారణం అధిక రుణ నష్టాల కేటాయింపులు (Loan Loss Provisions)గా పేర్కొంది.
ప్రపంచ బ్యాంక్ ఆందోళనకు కారణం ఏమిటీ?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా చోట్ల ఇప్పటికే చాలా సహకార బ్యాంకులు మూలధనం తగ్గి మూతపడ్డాయి. మరికొన్ని మూతపడే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రపంచ బ్యాంకు నివేదికను పరిగణలోకి తీసుకోవాలి.
సహకార బ్యాంకులు గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటివి. చిన్న వ్యాపారాలు, రైతులు, స్వయం సహాయక సంఘాలు వీటిపైనే ఆధారపడతాయి.
ప్రపంచ బ్యాంక్ తెలిపినట్లుగా కొన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు (UCBs) తగినంత మూలధనం (Capital Adequacy) కలిగి లేవు. సుమారు 20–22 బ్యాంకులు (మొత్తం రంగ ఆస్తులలో 10%) నియంత్రణ స్థాయి కంటే తక్కువ మూలధనంతో ఉన్నాయి. అధిక Loan Loss Provisions- అంటే తిరిగి రాకపోయే రుణాల నష్టాన్ని ముందుగానే లెక్కలోకి తీసుకోవడం వల్ల మూలధనం తగ్గిపోవడం.
మూలధనం తగ్గితే జరిగే పరిణామాలు ఏమిటీ?
మూలధనం అనేది బ్యాంకుల ‘సురక్షా కవచం’ లాంటిది. ఇది తగ్గితే చాలా ప్రమాదాలు ఉంటాయి.
-డిపాజిటర్ల డబ్బు ప్రమాదంలో పడుతుంది
-రుణాలపై నష్టాలు పెరిగితే, వాటిని తట్టుకునే సామర్థ్యం లేకుండా బ్యాంకులు డిపాజిటర్లకు డబ్బు తిరిగి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.
-పరపతి సామర్థ్యం తగ్గుతుంది. తక్కువ మూలధనం ఉన్న బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేవు. వడ్డీ ఆదాయం తగ్గిపోతుంది.
-నియంత్రణ చర్యలు కఠినమవుతాయి. RBI ఇలాంటి బ్యాంకులపై పరిమితులు విధిస్తుంది. కొన్ని సందర్భాల్లో విలీనాలు లేదా లైసెన్స్ రద్దు జరుగుతుంది.
-ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. సహకార బ్యాంకులపై నమ్మకం కోల్పోతే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది.
సహకార వ్యవస్థకు వచ్చే నష్టం ఏమిటీ?
సహకార బ్యాంకులు కేవలం ఆర్థిక సంస్థలే కాదు, ఇవి గ్రామీణ ఆర్థిక జీవ నాడులు. రుణ సరఫరా తగ్గుతుంది. రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు రుణాల కోసం మళ్ళీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడవలసి వస్తుంది, అక్కడ షరతులు కఠినంగా ఉంటాయి.
సహకార వ్యవస్థ బలహీనమవుతుంది. బ్యాంకుల మూలధన లోటు కారణంగా సహకార సంఘాలు, జిల్లా బ్యాంకులు, రాష్ట్ర సమాఖ్యలు ఒకదానిపై ఒకటి ఆధారపడే చైన్ దెబ్బతింటుంది.
విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. (Trust Deficit). ఒక బ్యాంకు సమస్య మొత్తం రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అందువల్ల అన్ని బ్యాంకులు కనీస మూలధన నిష్పత్తి (Capital Adequacy Ratio) నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాయి. దేశ ఆర్థిక భద్రత, ప్రజల నమ్మకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై కూడా ఉంది. సహకార రంగం నిలబడాలంటే మూలధన పటిష్టత, సైబర్ భద్రత, పారదర్శక నిర్వహణ తప్పనిసరి.
Next Story

