
Students waiting at US Consulate centre (File)
F-1 VISA | మన పిల్లలకు అమెరికన్ వీసాల్లో కోత ఎందుకు పడిందీ?
గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటికి 38 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే వీసాలలో భారీ కోతే పడింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటికి 38 శాతం తగ్గుదల కనిపిస్తోంది. కరోనా తర్వాత పెద్దఎత్తున వచ్చిన అమెరికన్ క్యాంపస్ వీసాలు 2024లో తగ్గినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న లెక్కలు చూపుతున్నాయి. అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు భారతీయులకు జారీ చేసిన F-1 విద్యార్థి వీసాలలో 38 శాతం తగ్గుదలని చూపుతోంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 వీసాలు జారీ అయితే 2023లో ఇదే కాలానికి 1,03,495 వీసాలు మంజూరయ్యాయి. 2021లో ఇదే కాలంలో 65,235, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. కరోనా వచ్చిన 2020లో కేవలం 6,646 F-1 వీసాలు మాత్రమే అమెరికా ఇచ్చింది.
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు మక్కువ చూపే విద్యార్థుల పాలిట ఈ తరుగుదల పెద్ద ఆశాభంగంగా ఉంది. మన దేశం నుంచి ఏటా వేల మంది విద్యార్థి వీసాలపై (US Student Visa) అగ్ర రాజ్యానికి వెళ్తుంటారు. అయితే, ఈసారి భారతీయులకు మాత్రమే కాదు.. చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసా (Visa)ల్లోనూ 8శాతం తగ్గుదల కన్పించింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 73,781 మంది చైనీస్ విద్యార్థులకు వీసాలు ఇస్తే గత ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 80,603గా ఉంది.
మొత్తంగా చూసినపుడు అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు అధికంగా ఉన్నారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో చైనా వాళ్లు ఎక్కువ. దీనికి భిన్నంగా ఈ విద్యా సంవత్సరం 2023-24లో 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398గా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది భారతీయులే.
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.
భారతీయులకు F-1 వీసా జారీలో భారీ కోత ఎందుకు పడిందనేది ఎవ్వరికీ అంతుబట్టకుండా ఉంది. అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ భారతీయ విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కనీసం 2025లోనైనా భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.
Next Story