
సీఎం ఆకస్మిక తనిఖీల తేదీ ఎందుకు ముందుకొచ్చింది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీల తేదీని అక్టోబరు 2 నుంచి జూన్ 12కు మార్చడం వెనుక ఏమి జరిగింది?
ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ప్రజలకు అందించే సేవల్లో సంతృప్తి స్థాయి 70 శాతం కంటే మించడం లేదని, ముఖ్యంగా ఆర్టీసీ వంటి విభాగాల్లో 50 శాతం కూడా లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పథకాల అమలులో లోపాలు, అధికారులు, ఉద్యోగుల పనితీరులో నిర్లక్ష్యం, సమన్వయ లోపం ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల తేదీని మూడు నెలల ముందుకు జరపడం ద్వారా, ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి పెంచి, వారిని తక్షణం అప్రమత్తం చేయాలనే సంకేతాన్ని సీఎం చంద్రబాబు ఇచ్చారనొచ్చు.
1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు..
మార్చి 15న జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. మీ ఊరికి వచ్చే విషయం కేవలం రెండు, మూడు గంటల ముందే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది. సమైక్యాంధ్రలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా నేను ప్రారంభించాను. ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ నివేదిక ఇచ్చాను. నా ఆశయం ఒకటే స్వచ్ఛమైన ఏపీ తయారుచేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర మా లక్ష్యం అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
విశాఖ, గుంటూరులో 30 మెగావాట్ల రెండు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు, నెల్లూరు, రాజమండ్రిలో రూ.700 కోట్లతో 22 మెగావాట్ల విద్యుత్ తయారుచేసే ప్లాంట్లు పెడుతున్నాం. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై ఉంది. అందులో 51 లక్షల చెత్త తొలగింపు పూర్తయింది. అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. 2027 నాటికి 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుతాం. ఒకప్పుడు మరుగు దొడ్లు ఉండేవి కాదు. మహిళల ఆత్మ గౌరవం పేరుతో కొత్తవి నిర్మించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల 60 వేల మరుగు దొడ్లు మంజూరు చేశాం. అందులో 72 వేల మరుగు దొడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్స్ లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మిస్తామని చెప్పారు.
మారిన తనిఖీల తేదీ..
చంద్రబాబు నాయుడు గతంలో పలు సందర్భాల్లో అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. ఆకస్మిక తనిఖీల తేదీని ముందుకు జరపడం ద్వారా, అధికారుల్లో ఒక రకమైన భయం లేదా జవాబుదారీతనం పెంచాలని ఆయన భావించినట్లు స్పస్టమవుతోంది. ఈ నిర్ణయం అధికారులు, ఉద్యోగులు తమ రొటీన్ పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే, ఎప్పుడైనా తనిఖీలు జరగవచ్చనే సందేశాన్ని ఇస్తుంది. ఇది ఒక వ్యూహాత్మక వ్యవహారంగా కనిపిస్తోంది. ఎందుకంటే ముందస్తు హెచ్చరిక లేకుండా తనిఖీలు జరిగితే అధికారుల నిజమైన పనితీరు బయటపడుతుంది. జూన్ 12 తరువాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశారు.
రాజకీయ, పరిపాలనా వ్యూహం
సీఎం చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త, పరిపాలకుడు. ఆకస్మిక తనిఖీల తేదీని మార్చడం ద్వారా, ఆయన ప్రభుత్వం పటిష్ఠమైన పరిపాలనను అందిస్తుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని భావించి నట్లుగా చెప్పొచ్చు. ఈ చర్య రాజకీయంగా కూడా కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ సేవల్లో అసంతృప్తితో ఉన్నప్పుడు, ఇలాంటి కఠిన చర్యలు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. అదే సమయంలో ఈ నిర్ణయం అధికారులు, ఉద్యోగులను క్రమశిక్షణలో ఉంచడానికి ఒక వ్యూహంగా కూడా పనిచేస్తుంది.
సవాళ్లను పరిష్కరించేందుకే...
ఆకస్మిక తనిఖీల తేదీని ముందుకు జరపడం వెనుక, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను తక్షణం పరిష్కరించాలనే సీఎం భావించి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉదాహరణకు సూపర్ సిక్స్ వంటి ఎన్నికల హామీల అమల పథకాలు ప్రజలకు సకాలంలో అందాలంటే, అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తనిఖీలు జరుగుతాయని హెచ్చరించడం ద్వారా, అధికారులు తమ పనిని వేగవంతం చేయడానికి, లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తూ, అదే సమయంలో ఒత్తిడిని కొనసాగిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీల తేదీని మార్చడం వెనుక పథకాల అమలులో సంతృప్తి స్థాయి తక్కువగా ఉండటం. అధికారులు, ఉద్యోగుల పనితీరులో లోపాలు, ప్రభుత్వ పరిపాలనను మరింత పటిష్ఠం చేయాలనే ఉద్దేశం ఉన్నాయి. ఈ నిర్ణయం ఒక వ్యూహాత్మక చర్యగా, అధికారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే చర్యగా భావించాల్సి ఉంటుంది.