మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం సాగింది. కానీ నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన దాని ప్రకారం అమరావతిని తాము వ్యతిరేకించలేదని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు. "మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు రాజధానులు పక్కనపెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తామని" రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఈ మార్పు వెనుక రాజకీయాలు ఏమిటో?
గతంలో జగన్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా, వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు (విశాఖపట్నం-ఎగ్జిక్యూటివ్, అమరావతి-లెజిస్లేటివ్, కర్నూలు-జ్యుడీషియల్) ప్రతిపాదించింది. ఇది అమరావతి రైతులు, టీడీపీ అనుకూలుర నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు.
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు (టీడీపీ) అమరావతిని తిరిగి అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్ 2025) జగన్ ప్రెస్ మీట్‌లో వైఎస్ఆర్‌సీపీ అమరావతిని ఏకైక రాజధానిగా సమర్థించారు. కానీ "ఇప్పటికే ఉన్న భవనాలు సరిపోతాయి, కొత్తవి అవసరం లేదు" అని జగన్ చెప్పారు. ఇది పూర్తి మార్పు కాదు. కానీ వికేంద్రీకరణ నుంచి సింగిల్ క్యాపిటల్ వైపు షిఫ్ట్ అయ్యారనేది స్పష్టమవుతోంది.
అమరావతిలో ఇటీవల వరదలు (ఆగస్టు 2025) కారణంగా వివాదం మరింత రాజుకుంది. వైఎస్ఆర్‌సీపీ "అమరావతి మునిగిపోతోంది" అని ప్రచారం చేస్తుండగా, టీడీపీ "ఫేక్ న్యూస్" అంటూ కౌంటర్ ఇచ్చింది.
పార్టీని రీబ్రాండ్ చేస్తున్నారా?
2024లో వైఎస్ఆర్‌సీపీ ఘోర ఓటమి చవిచూసింది. అమరావతి వ్యతిరేకత ఒక కారణం, రైతులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీకి మద్దతు పెరిగింది. ఇప్పుడు అమరావతిని సమర్థించడం ద్వారా, జగన్ టీడీపీ నిర్ణయాలను "సొంతం" చేసుకుని, పార్టీని రీబ్రాండ్ చేస్తున్నారు. ఇది 2029 ఎన్నికలకు స్ట్రాటజీ అనేది అందరికీ అర్థమవుతోంది. వికేంద్రీకరణను వదిలేసి, అమరావతి అభివృద్ధిని క్రెడిట్ తీసుకోవాలని ప్లాన్. కానీ "కొత్త భవనాలు వద్దు" అని చెప్పడం ద్వారా, ఖర్చులు తగ్గించాలని సూచిస్తున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వాన్ని ఖర్చులపై ఒత్తిడి పెట్టడంగా చెప్పొచ్చు.
పార్టీలో అంతర్గత వత్తిడి పెరిగిందా?
రాజధాని మార్పుపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి ఉంది. అమరావతి సమర్థించడం ద్వారా పార్టీని ఏకం చేసి, రైతుల మద్దతు తిరిగి పొందాలని టార్గెట్ గా వైఎస్సార్సీపీ పెట్టకుంది. అయితే మొదటి చెప్పిన దానికి కట్టుబడి ఉందామని కొందరు జగన్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రజలు ఎలా తీసుకుంటారు?
అమరావతి రైతులు, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు స్వాగతిస్తారు. వికేంద్రీకరణ వ్యతిరేకులు జగన్ మార్పును "సరైన నిర్ణయం"గా చూస్తారు. అయితే దీనిపై విమర్శలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. చాలా మంది దీన్ని "యూ-టర్న్"గా చూసి, జగన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తారు. 2019 కి ముందు కూడా ఇలాంటి మాటలు చెప్పి మార్చారని గుర్తుచేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వికేంద్రీకరణను కోల్పోయినట్టు భావిస్తారు. ఇది ప్రాంతీయ అసమానతలను పెంచుతుంది.
మొత్తం మీద మిశ్రమ స్పందన ఉంది. టీడీపీ అనుకూలురు దీన్ని జగన్ ఓటమిగా చూస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ అనుకూలులు "ప్రజల మంచికి" అని సమర్థనతో చూస్తున్నారు.
జగన్‌కు నష్టమా? లాభమా?
ప్రధానంగా విశ్వసనీయత అశంపై నష్టం కలిగించే అవకాశంగానే చర్చ జరుగుతోంది. గతంలో అమరావతిని "స్కామ్" అని విమర్శించి, ఇప్పుడు సమర్థించడం ఫ్లిప్-ఫ్లాప్‌గా కనిపిస్తుందని పలువురు పరిశీలకులు అంటున్నారు. వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత విభేదాలు పెరగొచ్చనే చర్చ కూడా ఉంది. ప్రత్యర్థులు "ఓటమి భయం" అని ప్రచారం చేస్తున్నారు. దీర్ఘకాలంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ రాజకీయ పరిశీలకుల్లో ఉంది.
రాజకీయంగా స్మార్ట్ మూమెంట్ గా కొందరు భావిస్తున్నారు. అమరావతి మద్దతుతో రైతులు, మధ్యతరగతి వర్గాన్ని తిరిగి ఆకర్షించవచ్చు. టీడీపీ ప్రభుత్వాన్ని "అనవసర ఖర్చులు" అని విమర్శించి, వెల్ఫేర్ ఫోకస్ చేయవచ్చు. 2029లో ఇది పార్టీని రీబూట్ చేస్తుందనేదని వైఎస్సార్సీపీ భావిస్తోంది. షార్ట్ టర్మ్‌లో నష్టం (క్రెడిబిలిటీ లాస్), లాంగ్ టర్మ్‌లో లాభం (స్ట్రాటజిక్ రికవరీ) ఎన్నికల్లో ఎలా పని చేస్తుందో చూడాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియా రెస్పాన్స్ ఎలా ఉంది?
టీడీపీ అనుకూల వర్గాలు చేసే వాధన ప్రకారం ... జగన్ మార్పును "డ్రామా, డిజాస్ట్రస్" అని ట్రోల్ చేస్తున్నారు. వరదలపై ఫేక్ ప్రచారం అని కౌంటర్ వీడియోలు షేర్ చేస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీ అనుకూలురులు మాత్రం ఈ వాదనను కొట్టిపారవేస్తున్నారు. ఇంకా వికేంద్రీకరణను సమర్థిస్తూ, అమరావతిని "స్కామ్, మునిగిపోతుంది" అని పోస్టులు పెడుతున్నారు. జగన్‌ను "విజనరీ" అని ప్రమోట్ చేస్తున్నారు.
తటస్థుల వాదన మరోలా ఉంది. చాలా పోస్టులు అమరావతి వరదలు, ఖర్చులపై ఫోకస్ పెడుతున్నాయి. "జగన్ మాట మార్చాడు" అని మీమ్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. ఓవరాల్ గా టీడీపీ సైడ్ డామినేట్ చేస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు...
సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో అమరావతి అంశంపై స్పష్టత ఇచ్చారు. గతంలో అమరావతిపై అనవసరమైన ఖర్చు చేయడం ఎందుకనే భావనతోనే విశాఖపట్నం, కర్నూలు గురించి ప్రస్తావించాల్సి వచ్చిందని అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని, అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు వెంటనే ఇస్తామని ప్రకటించారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాలు కలిస్తేనే అమరావతి మహానగరంగా మారుతుందని చెప్పారు.
ఇది వైఎస్ఆర్‌సీపీ గత స్టాండ్‌కు పూర్తి విరుద్ధం. ఎందుకంటే 2019-2024 మధ్య పార్టీ మూడు రాజధానులను ప్రోత్సహించింది.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో జరిగిన అదే కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిశ్రమలు రావడం వల్ల అమరావతి ఎక్కువ అభివృద్ధి సాధించగలదని, హైదరాబాద్ ప్రస్తుతం మహానగరంగా మారడానికి అదే కారణమని చెప్పారు. అమరావతి రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇరు పార్టీలు అమరావతిపై ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం.
టీడీపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, వైఎస్ఆర్‌సీపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోందనే చర్చ కూడా ప్రజల్లో ఉంది.
జగన్ కు రాజధానిపై స్పష్టత లేదు: నారాయణ
వైసీపీ అధ్యక్షుడికి రాజధానిపై స్పష్టత లేదు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఆయనే అసెంబ్లీ లో చెప్పాడు. ఆ తర్వాత పొలిటికల్ గేమ్ తో మూడు ముక్కలాట ఆడాడు. ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలి. అమరావతి అనంతపురానికి, శ్రీకాకుళం కు సెంటర్ పాయింట్ లో ఉంది. అమరావతికి రైల్వే కనెక్టివిటీ, పోర్టు, ఎయిర్ పోర్టు దగ్గరలోనే ఉన్నాయి.
అమరావతికి ఒప్పుకుని అసెంబ్లీ లో జగన్ కూడా చేతులెత్తాడు. మళ్ళీ ప్రభుత్వం రాగానే మాట మార్చాడు అని రాష్ట్ర మంత్రి పి నారాయణ శనివారం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని... మళ్లీ అధికారం కోసం అమరావతి అని మాట మార్చడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే ప్రజలు ఆ 11సీట్లు కూడా ఇవ్వరు. మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని నాటకం ఆడారు. రూములో కూర్చుని నలుగురైదుగురు ఇచ్చే సలహాలు పాటించకూడదు. సజ్జల ఆ పార్టీలో సీనియర్ నేత... ఆయన చెబితే వైఎస్సార్సీపీ చెప్పినట్లే కదా... అని అన్నారు.
నేను మంత్రిగా మాట్లాడితే సీఎం చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్లే కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు కలిపి భవిష్యత్తులో మహా నగరంగా చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. అని నారాయణ చెప్పారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొడున్నాడు: బీజేపీ మాధవ్
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శనివారం మీడియాతో చెప్పారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు.
జగన్ దొంగనాటకాలు: అనగాని
ప్రజా రాజధాని అమరావతిపై మళ్లీ వైసీపీ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే గుంటూరు, విజయవాడ మధ్య నిర్మిస్తామని కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు.
రివర్స్ డ్రామాలు: మంత్రి సవిత
రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రివర్స్ డ్రామాకు తెరతీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో జగన్నాటకానికి తెర తీశాడన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం జగన్. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని, తన నివాసం ఇక్కడే ఉందని ప్రజలను నమ్మబలికాడు. అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర తీశాడు. అయిదేళ్లలో ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని భ్రష్టు పట్టించాడు అని ఆమె విమర్శించారు.
మొత్తంగా అమరావతి అంశం రాష్ట్ర రాజకీయాలను మరింత ఉత్కంఠగా మార్చింది. వైఎస్ఆర్‌సీపీ యూ-టర్న్ 2029 ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.