ఏపీ ఎందుకు విద్వేష రాజకీయాలకు వేదికైంది?
x

ఏపీ ఎందుకు విద్వేష రాజకీయాలకు వేదికైంది?

ఏపీలో రాజకీయాలు విద్వేష పూరితంగా మారాయి. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. కేసులు, కోర్టులు, శిక్షల వరకు వెళ్లింది. ఇంతకు మునుపెన్నడూ ఈ పరిస్థితి లేదు. ఎందుకు?


పరుచూరి బ్రదర్స్‌ రాసే డైలాగులు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ వారు ఎవరికైనా మాటలు రాస్తే సంచలనాలకు మారు పేరు అవుతున్నాయి. వాస్తవాలకు దగ్గరగాను ఉంటున్నాయి. ఒక సినిమాలో రాజకీయం అంటే పరుచూరి గోపాలకృష్ణ తానే నటిస్తూ ఆయన రాసిన ఒక డైలాగ్‌ను చెబుతాడు. ‘రా అంటే రాక్షసంగా.. జ అంటే జనానికి.. కీ అంటే కీడు చేసే.. ఎం అంటే యంత్రాంగం’ అంటాడు. నిజానికి ఈ డైలాగు రాజకీయాలు ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తోందంటే.. నాటి రాజకీయాలు వేరు. నేటి పాలిటిక్స్‌ వేరు. నాటి రాజకీయాలు సరదాలు, చెణుకులతో కూడి ఉండేవి. కానీ నేటి రాజకీయాలు కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకార చర్యల వరకు వెళ్లి పోయాయి. అందుకే రాజకీయం అనే పదానికి అర్థం చెప్పాలంటే అందరి వెన్నులోను వణుకు పుడుతోంది.

ఈ పదేళ్ల రాజకీయాలను ఒక సారి పరిశీలిద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఒక ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన రాజకీయ చతుర దురందురుడు కావాలని ప్రజలు భావించారు. అందుకే కాంగ్రెస్‌ను మట్టి కరిపించి, వైఎస్‌ఆర్‌సీపీని కాస్తా పక్కకు నెట్టి తెలుగుదేశం పార్టీనికి గెలిపించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వారంతా రాజకీయ ఉద్దండులుగానే చెప్పొచ్చు. ఎంతో మంది 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా కాంగ్రెస్‌ను తిరస్కరించి టీడీపీలో చేరారు. సోషల్‌ వర్కర్లుగా ఉన్న వారు, ప్రజల హక్కుల కోసం పోరాడే వారు, ప్రజాస్వామ్య పరిరక్షకులు ఇలా ఎవరైతేనేమీ కాంగ్రెస్‌ను తిరస్కరిద్దామనుకున్న వారంతా ఒక్కటయ్యారు.
ప్లేటు పిరాయించిన ఎమ్మెల్యేలు...
పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ పెట్టిన నాటి నుంచి కష్టపడి పని చేస్తున్న సామాన్య కార్యకర్తల్లాంటి తమను కాదని మధ్యలో వచ్చిన ఒక మహిళకు అధికార పీఠాన్ని కట్టబెడుతున్నారనే ప్రచారం రాష్ట్రమంతా నాడు జోరందుకుంది. ఇంకేముంది.. ఒక్క సారిగా ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడును బలపరచారు. ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారు. మాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబే కావాలని 1995లో టీడీపీ ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కోరారు. బల నిరూపణకు గవర్నర్‌ సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ గద్దె దిగి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. తర్వాత ఎన్టీఆర్‌ మరణించడం, ఆయన భార్య లక్ష్మిపార్వతి ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించడం, అనంతరం ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ అన్న ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించడం వరుసగా జరిగాయి. ఆ పార్టీలు ఫెయిల్‌ కావడంతో విధిలేక అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీని ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో తన వంతు పాత్రను పోషిస్తూ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అడుగులు ముందుకేసింది.
జగన్‌ నాయకత్వాన్ని బాబు దెబ్బతీశారా?
ఆంధ్రప్రదేశ్‌ రెండు ముక్కలైన తర్వాత తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్‌ వరకు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తనను, తన పార్టీని కాపాడుకోవడంతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఏర్పడిన జగన్‌ నాయకత్వాన్ని కూడా దెబ్బ తీసేందుకు పావులు కదిపారు. చంద్రబాబు ఎందుకు ఆ విధమైన రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చిందంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తి ఉన్న కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర విభజనతో ప్రజలు తిరస్కరించారు. వైఎస్‌ఆర్‌ నాయకత్వంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్‌ఆర్‌ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడి క్విడ్‌ ప్రోకో ద్వారా కోటాను కోట్లు సంపాదించారని వైఎస్‌ఆర్‌ మరణానంతరం కాంగ్రెస్‌ వారి ప్రోద్బలంతో కేసు నమోదైంది. ఈ కేసులో అగ్నికి ఆజ్యం పోసినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీతో మాట్లాడి అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో మా సహకారం మీకుంటుందని, జగన్‌ లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి తనను సీబీఐ ద్వారా జైలుకు పంపించారనే కక్ష జగన్‌ మనసులో ఉంది. ఎన్నో సార్లు ఈ విషయాన్ని కాంగ్రెస్‌తో కుమ్మక్కై తనను జైలుకు పంపించారని చంద్రబాబుపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను జగన్‌ ఆరోపించారు.
ఐదేళ్లలో జగన్‌ కక్ష రాజకీయాలు
అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక మెజారిటీతో అధికారమిచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ సాగించిన పరిపాలన కూడా విద్వేషాలకు తావునిచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరి కొందరు ముఖ్య నాయకులను జైళ్లకు పంపడంలో జగన్‌ కృతకృత్యుడయ్యారు. ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలతో విషం కక్కుతూ, ప్రజల మధ్య ప్రజా ప్రతినిధులుగా ఉంటూ పాలనలో మంచి చెడుల ప్రభావం పడకుండా చూస్తున్నామనుకున్నారు. కానీ చంద్రబాబు విద్వేష రాజకీయాలకు 2019లో బలయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుశ్చిత రాజకీయాలతో 2024లో బలయ్యారు. ప్రజలు అందరినీ గమనిస్తారు. రాజకీయ కీచకులెవరు, రాజకీయ సాధకులెవరు, అనేది ప్రజలకు తెలియంది కాదు. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకులకు మాత్రమే ప్రజల మనో భావాలు అర్థం కావని, 2024 ఎన్నికలు కానీ, 2019 ఎన్నికలు కానీ స్పష్టం చేశాయని చెప్పొచ్చు.
ఇప్పటికైనా రాజకీయాలనేవి కేవలం తన వ్యక్తితత్వాన్ని కాపాడుకోవడానికి పరిమితం చేసుకోవాలే తప్ప వ్యవస్థలను బ్రష్టు పట్టించే వరకు వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పును స్పష్టం చేస్తున్నాయి. ఇకపై నేతలు ఎలా చేస్తారో, ఏ విధమైన రాజకీయాల వైపు అడుగులు వేస్తారో అనేది వారిష్టం.
Read More
Next Story