అమరావతికి మళ్లీ శంకుస్థాపన? ఎందుకు, ఎవరి కోసం?
x
అమరావతి రాజధాని ప్రాంతంలోని బుద్ధుని విగ్రహం

అమరావతికి మళ్లీ శంకుస్థాపన? ఎందుకు, ఎవరి కోసం?

రాష్ట్రం విడిపోయి పదేళ్లయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికీ పక్కా రాజధాని లేదు.. అప్పట్లో ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించారు. మళ్లీ చేయిస్తామంటున్నారు ఎందుకు?


రాష్ట్రం విడిపోయి పదేళ్లయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికీ పక్కా రాజధాని లేదు. ఆరేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ కాస్తంత సందడి కనిపిస్తోంది. ‘‘పెద్ద రాజధాని కావాలి’’ అన్న ఆశతో రైతులు 33 వేల ఎకరాలకు పైగా భూములు త్యాగం చేశారు. అప్పట్లో ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించి, ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న మాటలు తరచూ వినపడేవి. 2019 నుంచి ఐదేళ్ల పాటు అమరావతి దెయ్యాలదిబ్బగా మారింది. 2024లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు తిరిగి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెర పైకి తెచ్చారు. తిరిగి అదే మోదీ చేత మళ్లీ భూమిపూజ చేయించాలన్న తలంపుతో కసరత్తు చేస్తున్నారు.

అభివృద్ధి పేరుతో చేపట్టిన శంకుస్థాపనలు, నిధులేకుండా నిలిచిపోయిన పనులు, విస్మరణకు గురైన రైతు వ్యధల మధ్య అమరావతి మళ్లీ రయ్ రయ్ మని సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అందరూ చెబుతున్నారు. అంత సవ్యంగా సాగితే ఏప్రిల్ 15 తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ వచ్చి పనులు ప్రారంభిస్తారు. చిత్రమేమిటంటే అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ తమ బడ్జెట్లలో రూపాయి నిధులు కేటాయించకుండా అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం, సుమారు వంద పనులకు టెండర్లు ఖరారు చేయడం.
ఆవేళ చెంబెడు నీళ్లు, తట్టెడు మట్టి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఉద్దండరాయునిపాలెంలో ఉజ్జీవన వనం (Uddandarayunipalem) పేరిట ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గుంటూరు-విజయవాడ మధ్య కృష్ణా నది ఒడ్డున ఈ ప్రాంతం ఉంది. మోదీతో పాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు, పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు గవర్నర్, సింగపూర్ మంత్రి సహా అనేక మంది హాజరయ్యారు.
జోరు వర్షం కురిసి బురద మయం అయిన ఆ రోజున జనం చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రధాని మోదీ శంకుస్థాపనకు వస్తూ మట్టి, చెంబెడు నీరు తెచ్చారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చారు. గంగానది నీరు, ధర్మశాల, డ్వార్కా, రామేశ్వరంలాంటి ప్రదేశాల మట్టి తీసుకువచ్చారు. వీటిని అమరావతిలో విలీనం చేశారు, ఇది “జాతీయ ఏకత”కు చిహ్నంగా ప్రచారం చేశారు. అమరావతి గొప్ప చరిత్రను గుర్తు చేశారు. సింగపూర్ మాదిరి అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి పునాదులకే పరిమితం అయింది. అప్పటికే చేపట్టిన రూ. 7,500 కోట్ల పనులు ఆగిపోయాయి. అమరావతికి సంబంధించిన వివాదాలు, మారిన ప్రభుత్వ విధానాల కారణంగా నిర్మాణం నిలిచిపోయింది.
కేంద్ర నిధుల కధేంటి?
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయాన్ని పరిశీలిస్తే:
మొదట్లో (2014–2016): కేంద్రం "కేంద్ర సహాయ నిధుల" (Central Assistance) కింద ₹2,500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. వాటిలో సింహభాగం ప్రధానంగా మౌలిక సదుపాయాలకే (infrastructure) సరిపోయింది. ఆ తర్వాత ఏనాడూ రాజధాని అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాల మార్పు, పాలనాలో స్పష్టత లేకపోవడం, కేంద్రం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో రాజధాని ఏమిటో తెలియని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది.
రాజధానుల గందరగోళం
మూడురాజధానుల ప్రతిపాదనతో వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని పక్కనబెట్టి పరిపాలన వికేంద్రీకరణ పేరుతో పనులను నిలిపివేసింది. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అంటూ నాన్చుడు ధోరణి మొదలు పెట్టింది. తీసిన పునాదులు పూడిపోయాయి. కట్టిన భవంతులు అలాగే కునారిల్లుతున్నాయి. మాస్టర్ ప్లాన్ దుమ్ముకొట్టుకుపోయింది.
భూములిచ్చిన రైతులు 1400 రోజులకు పైగా నిరంతర నిరసనలు చేస్తూ తమ భవిష్యత్‌ పై భయాందోళనలు వ్యక్తం చేశారు. రాజధాని స్థానంపై కేసులు న్యాయస్థానాల్లో ఉన్నందున స్పష్టత లేకపోయింది. పాలనలో వచ్చిన మార్పులు పాలసీలలో పటుత్వాన్ని తగ్గించేశాయి.
ప్రపంచ బ్యాంకు, ADB నిధుల కథ..
ప్రపంచ బ్యాంకు మొదట్లో ₹1.7 బిలియన్ (సుమారు ₹11,500 కోట్లు) రుణానికి అంగీకరించినా 2019లో రాజధానిపై స్పష్టత లేకపోవడం, రైతుల నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కుతగ్గింది.
ఈ పరిణామాలతో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) ఆ వైపు తిరిగి చూడలేదు. అంతర్జాతీయ సంస్థలు మొహం చాటేశాయి. సింగపూర్, మలేషియాలు- స్థిర పాలన, పారదర్శక విధానాలు, భద్రత, రైతుల సహకారం లేదంటూ తిరిగి చూడలేదు.
ఇప్పుడేం జరుగుతోంది?
ఇప్పుడు మళ్లీ వీటిని రీ-ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నా, వాటిపై స్పష్టత ఇంకా లేదు. దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. “ప్రధానమంత్రి మోదీ ఏప్రిల్ లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు” అని విజయానంద్ అధికారికంగానే ప్రకటించారు. గతంలో మాదిరిగానే ఈ ప్రాజెక్టుకు సింగపూర్ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు.
2014 నుంచి 2019 వరకు అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ముఖ్య భాగస్వామిగా ఉంది. అధికారులు చెబుతున్న లెక్క ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి అభివృద్ధి కొనసాగుతోంది.

రాజధాని ప్రాంత మ్యాప్

ఏ రుణం అయినా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతోనే వస్తుంది. కేంద్రం అమరావతికి పూచిపడుతుందా అనే అభిప్రాయం ప్రజల్లో ఉండనే ఉంది.
ఏపీని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తూ రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే రాజధాని అమరావతి పనుల కోసం ఈ పద్దులో ఒక్క రూపాయి కేటాయించలేదు. అదే సమయంలో రాజధాని నిర్మాణానికి రూ.6000ల కోట్ల ప్రతిపాదించింది.
అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.292.87 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో సామాజిక భద్రతానిధి కోసం 103.82 కోట్ల కేటాయింపులు చేసింది. అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్ల చెల్లింపు, ఇతర సామాజిక అవసరాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
రాజధాని పనుల కోసం బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోయినా పనులు ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్ట్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో వంటి ఆర్థికసంస్థల సహకారంతో కేంద్రం ద్వారా రాజధానికి నిధులు సమకూర్చుతామంటున్నారు. అందుకే రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి నిర్మాణ పనులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించడం లేదు.
ప్రపంచ బ్యాంకు సాయం ఎంత?
అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ కలసి రూ.15,000ల కోట్ల రుణం మంజూరు చేశాయని, రూ.12,000ల కోట్లు ఇచ్చేందుకు సీఆర్​డీఏతో హడ్కో అంగీకారం కుదుర్చుకుందని పాలకులు చెబుతున్నారు. ఇప్పుడు బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.6000ల కోట్లు కూడా ఆ సంస్థల నుంచి వచ్చేవే. 2024-2025 బడ్జెట్‌లో అమరావతి పనులకు రూ.3000ల కోట్లు ప్రతిపాదించగా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ.5700 కోట్లకు చేరింది.
రాజధాని పనులకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ.6000ల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అమరావతిలో పనుల పురోగతి, చెల్లింపుల్ని బట్టి ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అమరాతిలో సుమారు రూ.48,000ల కోట్ల పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీ ఇప్పటికే టెండర్లు పిలిచాయి. రాజధాని నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సామాన్యుడి ప్రశ్నలు – సమాధానాలెక్కడ?
గతంలో చేసిన శంకుస్థాపన ఏమీ ఫలితాలివ్వలేదు. ఇప్పుడు నిధులూ లేని పరిస్థితిలో మళ్లీ అదే పని చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “మోదీ మళ్లీ భూమిపూజ చేస్తే మారేదేమిటి?” అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగానే ప్రశ్నించారు. “ప్లాన్లూ లేవు, నిధులూ లేవు, భూమిపూజ మళ్లీ మళ్లీ చేస్తే నిధులు వస్తాయా” అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నిలదీశారు. అభివృద్ధి కంటే ఇది ఎన్నికల ముందు ప్రచార పావుగా మారిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

రాజధాని అమరావతి ఊహా చిత్రాలు

భూములిచ్చిన రైతులు ఇప్పటికీ ధైర్యంగా జీవించలేని పరిస్థితి. ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వడం కాదు, శంకుస్థాపనలతో ఊరట కలిగించాలనుకుంటోందని సీఆర్డీఏ ప్రాంతానికి చెందిన బెనర్జీ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానికి నోటిఫికేషన్ లేని స్థితి
ప్రస్తుతం అమరావతి రాష్ట్ర రాజధానిగా అధికారికంగా నోటిఫై కాలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం (Andhra Pradesh Reorganisation Act – 2014) ప్రకారం, రాజధాని స్థానాన్ని పార్లమెంటే నోటిఫై చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధానులను మార్చే పరిస్థితి ఏర్పడిందని నేషనల్ ఎలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (ఎన్ఏపీఎం) అభిప్రాయపడింది. ప్రజల జీవితాల్లో ఇదే అయోమయం. ఇదే అస్థిరత కొనసాగుతోందని ఆ సంస్థ నాయకుడు రామకృష్ణం రాజు అన్నారు.
రైతులెంతో నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మోదీతో శంకుస్థాపన అంటే ఆశలు కలగక మానవు. “ఇప్పటికే ఒకసారి చేసిన పూజలకే నిధులు రాలేదు. ఇప్పుడు మళ్లీ పూజలు చేసి ఏమి చేస్తారో?” అనే వారూ లేకపోలేదు. “పాలకులు మారినప్పుడల్లా పునాదులేనా?” అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
స్పష్టత కోరుతున్న సామాన్యులు..
రాజధాని నిర్మాణంపై మళ్లీ భూమిపూజలకంటే ముందుగా కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. నిధుల హామీ, టైమ్‌లైన్, రాజధాని నోటిఫికేషన్, రైతుల భద్రత—ఇవి లేకుండా ఏ పునాదిపూచినా అది ప్రజల గుండెల్లో మరొక గాయం మాత్రమే అవుతుందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read More
Next Story