గిల్లుడెందుకు..గోళ్ల మీద బొమ్మలేయక
x

గిల్లుడెందుకు..గోళ్ల మీద బొమ్మలేయక

కొంత మంది గోళ్లతో రక్కడం, గీరడం చేస్తారు. కానీ నాగాచారి మాత్రం అందంగా బొమ్మలేస్తారు. ఎలా అంటే..


వలేటి గోపీచంద్

గత రెండు రోజులుగా అసహనంగా ఉంది. గోళ్ళు గిల్లు కింటూ, నోటితో వాటిని కొరుకుతూ సమయం గడుపుతూ ఉన్నా. ఎందుకో మనస్సు అంతా గోళ్ళ మీదికి వెళ్లింది. ఇంటర్‌లో రంగా రావు అనే మిత్రుడు వాడికి కోపం వస్తే గోళ్ళతో కసిగ రక్కీ కసీ తీర్చుకునే వాడు. ఎక్కువ మంది గుర్తుకు రాక పోతే తల గొక్కోవటం చూస్తాం. ఇప్పుడు అంతా స్టైల్‌ పెరిగి, నాజూకు తనం వచ్ఛింది. పళ్ల సందులో ఏమైనా ఇర్రుక్కుంటే అబ్బో టూత్‌ పిక్స్‌ వాడటం సభ్యత సంస్కారం అంటున్నాం. ఇప్పటికీ గోళ్లకే పని చెప్పే నా బోటి మొరటోళ్ళు ఎక్కువ గానే కనపడతారు. గోళ్ళు పెరిగితే దరిద్రం అంటూ నోటితోకొరకటం పరిపాటి. ఇప్పుడు సోకులు పెరిగి నైల్‌ కట్టర్‌ వచ్ఛింది. ఇక నైల్‌ పాలిష్, గోరింటాకు పెట్టుకోవడం చూస్తున్నాం. అయితే హాఠాత్తుగా నాకు గోటితో బొమ్మలు గీసే మా నాగ్‌ గుర్తుకు వచ్చాడు. గోటితో విన్యాసాలు చేస్తాడు. అవి కొన్ని మీతో పచుకుంటా.

నా వరకు నాకు బొమ్మలు గీయటం రాదు. నేర్చు కోవాలనే కోరిక లేకపోవటం కూడా కారణం కావచ్చు. హైస్కూల్‌లో మా డ్రాయింగ్‌ మాష్టారు చిన్నయ్య గారు బాగా నేర్పేవారు. వారి గీతలకు రాష్ట్ర స్థాయిలో బహుమతులు వచ్చేవి. పిల్లలకు నేర్పాలని ఇష్ట పడుతూ కష్ట పడేవారు. ఆసక్తి, ఇష్టమున్న పిల్లలుతో బాగా గీయించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించి, స్కూల్‌కు పేరు తెచ్చే వారు. బొమ్మలు గీయటం వేరు. చిత్ర కళ వేరేమో. ఇంటర్‌లో బైపీసీ వారికి నాలుగు రికార్డ్స్‌ ఉంటాయి. వాటిలో బొమ్మలు గీయటం రొటీన్‌ కదా..అయితే ఆసక్తి ఉన్న వారి రికార్డ్స్‌లో బొమ్మలు ఆకర్షణీయంగా ఉంటాయి అనుకోండి. ఈ కథ అంతా ఎందుకు కానీ మన కథా నాయకుడు గోటి నాగ్‌ కథలోకి వద్దాం.

1978–1980 లో చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌లో ఇంటర్‌ పూర్తి చేసీ, మరో ఆరుగురుతో కలిసి చీరాలకు కొద్ది దూరంలో ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1980లో చేరా. మన లాగే మొత్తం 150 మంది దాకా, ఇందులో 99 శాతం మెడిసిన్‌ రాక పోగయ్యారు. ఇందులో ఎవరి టాలెంట్‌ వారిది. ఎవరి శక్తి యుక్తులు వారివి. ఆటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ , చిత్రకళ ఇలా ఎన్నో..

రాజమండ్రి నుంచి వచ్చిన కుర్రోడు, నూనూగు మీసాలు, మిలమిలా మెరిసే కళ్ళతో ఇట్టే ఆకర్షించే రింగుల జుట్టుతో ఉండే వాడు. ఇవేమీ నన్ను పెద్దగా ఆకర్షించ లేదు. ఆ అందగాడు గోళ్ళు , గోటితో చేసే విన్యాసాలు మాత్రం అందరి దృష్టిని తన వైపుకు లాక్కుంది. గోటితో బొమ్మలు గీయటం అదే నేను జీవితంలో మొదటి సారి చూచింది మా కళాశాల, విశ్వ కవి రవింద్రులను తన గోటితో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో అన్నట్లు గీశాడు. సమ్మోహనం. నయానందకరం. అతడే గోటితో కొండంత కళా వైభవం తీసుకు వచ్చే పి నాగా చారి.
చారిది పోలవరం మండలం గూటాల పంచాయతీ శివారు కొత్త పట్టిసం. గూటాల హైస్కూల్లో చేరిన తర్వాత కొత్తగా డ్రాయింగ్‌ టీచర్‌ జాయిన్‌ అయ్యారు. ఆయన స్కూల్లో వేసే గోరు బొమ్మలు చూసి నేర్పమని అడిగినా, నేర్పడానికి మాష్టారు ఇష్ట పడలేదు అట. అయినా నాగ్‌కు పెన్సిల్‌తో స్కెచెస్, పెన్సిల్‌ షేడ్‌ డ్రాయింగ్‌ వర్ణచిత్రాలు వేసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన చెప్పకపోయినా గోటితో బొమ్మలు వేయాలని వారి మేనమామ డక్కన్‌ సిగరెట్‌ గుల్ల మధ్య ఉండే దళసరి రేపర్‌ మీద గోటితో గీతలు గీసే క్రమంలో గోరు బొమ్మ వచ్చే ఎంబోజింగ్‌ ఎలా తీసుకోవాలో స్వతః గా నేర్చుకున్నాడు. అప్పటినుండి కొంగ, బాతు, పూలు, కొండలు, సీనరీస్‌ మనిషి ఆకారాలు మొదలగునవి వేయడం మొదలు పెట్టి సంతోష పడ్డాడు. అయితే చారికి బాపట్ల కళాశాలలో చేరిన తర్వాత వారి గోరు బొమ్మల ఆర్ట్‌ పది మందికి తెలిసేవిధంగా అవకాశం వచ్చింది. కాలేజ్‌ డే, తెనాలి దగ్గర వెల్లటూరులో జరిగే లలిత కళా అకాడమీ వారి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనటం వల్ల గుర్తింపు సాధించారు. ర్యాగింగ్‌ చేసిన సీనియర్స్‌ అందరికీ ఏదో ఒక గోరు బొమ్మ వేసి ఇచ్చి ర్యాగింగ్‌ తప్పించు కున్నడు. చూశారా మనోడు మామూలు వాడు కాదు.
కళపట్ల నిజమైన ఆసక్తి అభిలాష వుండాలేకాని కళాకారుడు తన ప్రావీణ్యం పలు రకాలుగా ప్రదర్శించవచ్చు. వీటిలో చిత్రకళ ఓ ప్రత్యేకమైన కళ. ఒకరు పేపర్‌ మీద పెన్సిల్‌తో బొమ్మలు వెస్తే, మరొకరు కాన్వాస్‌ రంగులతో రంగుల చిత్రాలు చిత్ర విచిత్రంగా వే స్తారు. పెన్సిల్, కుంచెలు లేకుండా కేవలం తన చేతి గోళ్ళనే కుంచెగా చేసుకొని దళసరి కాగితం మీద చిత్రాలు గీయటం అద్భుతం కదా. అలాంటి చిత్రాలు గీసే నఖ చిత్రాకారుడే మిత్రులు పి నాగా చారి. అందరం నాగ్‌ నాగ్‌ అని పిలుస్తాం. కేవలం తెల్లకాగితంపై మన శరీరంలోని కొనగోళ్లతో జీవం తొణికిసలాడే విధంగా బొమ్మలు అత్యద్భుతంగా గీసి మెప్పించే శక్తి ఉన్న చిత్రకారుడు మా నాగాచారి. పెన్సిలు, రబ్బరు, ఇంక్, రంగులు, కుంచెలు ఇవేవి వాడకుండా కుడిచేతి బొటన వేలు చూపుడువేలుకున్న కొనగోళ్ల మధ్య తెల్ల కాగితం వుంచి తనలోని భావాన్ని అందంగా కళ్లకు కట్టినట్లు గీసే శక్తి మా చారికి ఉండటం నిజంగా మా అందరికీ గర్వ కారణం. ఎటువంటి పరికరములు లేకుండా కేవలం చేతిగోళ్ళతో, అందరినీ ఆకట్టుకునే రీతిలో,ఆలోచించే విధంగా నఖ చిత్రాలు గీసే విధానం ఎవ్వరికైనా ఆసక్తిని, అనురక్తిని కలిగిస్టు్టంది. అంతేకాదు ఇట్టే ఆకర్షిస్తుంది కూడా.
మా సమూహాల్లో ఇప్పటికీ పండుగలు, ప్రత్యేక రోజుల సమయంలో తన గోటి బొమ్మలను పోస్ట్‌ చేస్తుంటారు. తన వృత్తిలో పడి ప్రవృత్తిని మరచి పోయి నట్లు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ గానో సంయుక్త సంచాలకులు హోదా లోనో పదవి విరమణ చేశారు. కష్ట నష్టాల కోర్చి, వ్యయ ప్రయాసలకోర్చి మా 1980 బ్యాచ్‌ వారి ముఖాలను తన గోటితో అందంగా, ఆకర్షణీయంగా, అందరూ అసూయ పడే విధంగా గీస్తారేమో అనుకున్నాం. కానీ ఎందుకో జరుగ లేదు. మా బ్యాచ్‌ లోని మరో చిత్ర కారుడు ఎ రమేష్‌ పెన్సిల్‌ గీతలతో ఆ పని చేశాడు. అయితే ఇప్పటికీ మా బ్యాచ్‌ వారికి నాగ్‌ గోటి బొమ్మల మీద ఆశ ఉంది. దృష్టి పెట్టాలి, పెడితే బాగుండు అని నాకు కూడా ఎక్కడో చిన్న నమ్మకం ఉంది. నఖ చిత్రాలుకూడా జీవం ఉట్టిపడుతూ అద్భుతంగా, అందంగా వుంటాయి. మా నాగాచారి నఖ చిత్రాలు కూడా.
మా నాగన్న ఏమంటాడు అంటే
(దళసరి పేపర్‌ ఎడమచేతి బొటన వేలు మధ్య వేలు మధ్య పేపర్‌ పెట్టుకుని కుడిచేతితో పేపరును కావాల్సిన కదుపుతూ బొమ్మను తయారు చేయాలి. ఇదేవిధంగా కుడి చేతిని గోళ్ళు అవసరాన్ని బట్టి వాడాలి. గోరు బొమ్మ ఎక్కడ మొదలు పెట్టాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం.
నఖచిత్ర కళాకారులు అందరూ చాలా చిన్న సైజు బొమ్మలు వేస్తూ ఉంటారు నేను కాలేజ్‌ రోజులలో నుండి చిన్న వాటితో పాటు చాలా పెద్ద సైజు అనగా ఏ4 సైజు గోరుబొమ్మలు వేసే అలవాటు ఇంత పెద్దబొమ్మలు ఎవరూ వేయడం నేనెక్కడ చూడలేదు. కాలేజీ రోజుల్లో నేను వేసిన నాదమయం, డిఏడబ్ల్యూన్, రాధాకృష్ణులు, ప్రేమైక జీవులు మొదలగునవి ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్‌ కాలేజ్‌ బాపట్ల ఎలివేషన్‌ ని కూడా ఏ4 సైజు బొమ్మని వేయడం జరిగింది.
83 బ్యాచ్‌ రాముకి నేర్చుకుంటానని అంటే ఆయనకి ఈ కళ నేర్పడం జరిగింది. ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేర్చుకుంటాను అన్న వాళ్ళకి నేర్పడం జరిగింది .ఆసక్తి ఉంటేనే సరిపోదు నఖచిత్ర కళను ఎవరికి వారే డెవలప్‌ చేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్‌ డ్రాయింగ్‌ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి రకమైన ఆర్ట్‌ ఫాం అయినా)
ఈ నఖ వార సత్వాన్ని బావి తరాలకు నాగాచారి అందించాలన్నది మా కోరిక. అంతే కాదు వారి నఖచిత్ర ప్రదర్శనలు కనీసం వారి ప్రాంతం లోనీ పాఠశాలలో అయినా నిర్వహించాలన్నది మా మనోగతం
పెద్దలు మాట
‘నఖే నఖే సరస్వతి’
గుర్తు చేసుకుంటూ ముగిస్తు్తన్నా. మీరు మా నాగా చారితో మాట్లాడాలి అని అనుకుంటే వెంటనే ఈ ఫోన్‌కు +91 95055 40022 రింగ్‌ ఇవ్వండి. గోటితో కొండంత అనుభూతి పొందండి.

Read More
Next Story