ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు ఎందుకు ఓటు లేదంటే
x

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు ఎందుకు ఓటు లేదంటే

పిఠాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో తన చదువు, అర్హతలను గురించి ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. అధికారంలో ఉన్న కూటమి వర్గాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓటు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైకు రేటుతో 21 స్థానాలు గెలుచుకుని దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఓటు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఓటెందుకు లేదనే చర్చ తాజాగా తెరపైకొచ్చింది. టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే ఓటర్లు కావడంతో పవన్‌ కల్యాణ్‌కు అక్కడ అవకాశం లేదు. ఇక పట్టభద్రుల కిందైనా పవన్‌ కల్యాణ్‌కు ఓటు ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ డిగ్రీ పట్టాదారుడు కాకపోవడం వల్ల ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు లేకుండా పోయింది. మరో వైపు డిగ్రీ పట్టాదారులు కావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లల్లో తన విద్యార్హతలను గురించి పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించి సంచలనం సృష్టించారు. తన శాఖల పరిధిలోని ఫైళ్లను చూస్తున్న సమయంలో తాను బాగా చదువుకుని ఉండి ఉంటే.. కనీసం డిగ్రీ వరకైనా చదవుకుని ఉండి ఉంటే ఫైళ్లను ఈజీగా అర్థం చేసుకొనే అవకాశం ఉండేదని, కానీ అంత వరకు చదువుకోక పోవడం వల్ల చదువు విలువ ఇప్పుడు తెలిసొస్తుందని వేలాది ప్రజల ముందు పిఠాపురంలో ఒక సభలో వెల్లడించడం విశేషం. తన చదువు గురించి అలా వేలాది ప్రజల ముందు బహిరంగంగా ప్రస్తావించి అందరినీ ఆశ్చర్య పరచడం పవన్‌ కల్యాణ్‌కే చెల్లిందనే టాక్‌ అప్పట్లో వినిపించింది. డిగ్రీ హోల్డర్‌ అయ్యుంటే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకునే వారుని కూటమి వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది.
Read More
Next Story