
పిల్లలేం చేశారు దుర్గా? గోదావరిలోకి తోసి చంపేశావు?
శిరిగినీడి దుర్గాప్రసాద్, పక్క గ్రామం విశ్వేశ్వరాయపురంకు చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
కంటి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నపిల్లలను కడతేర్చాడు. ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ కన్న బిడ్డలను వేలు పట్టి నడిపించాల్సిన చోట మెడపట్టి గోదావరిలోకి తోసేశాడు. జీవితాంతం అండగా దండగా ఉంటూ కొండంత భరోసా ఇవ్వాల్సిన తండ్రి ఆ చిరు ప్రాణాలను తీసేశాడు. సమాజం గగుర్పాటుకు గురయ్యే ఈ దుర్ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. మల్లికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి శిరిగినీడి దుర్గాప్రసాద్ (38) సోమవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను దిండి-చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి తోసి, అనంతరం తాను కూడా గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం చుట్టు పక్కల గ్రామాలను విషాదంలో ముంచెత్తింది.
ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబం… ఒక్కసారిగా ఏమైంది?
శిరిగినీడి దుర్గాప్రసాద్, పక్క గ్రామం విశ్వేశ్వరాయపురంకు చెందిన రేకపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె నాగలక్ష్మిని 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, పిల్లలను అల్లారు ముద్దుగా పెంచారు. కుమారుడు మోహిత్ (14, 9వ తరగతి), కుమార్తె జాహ్నవి (4వ తరగతి) రోజూ పాఠశాలకు సరదాగా వెళ్లి వచ్చే చిన్నారులు. ఆదివారం కూడా అత్తవారింట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు దుర్గాప్రసాద్. సోమవారం సాయంత్రం “ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకుందాం” అని పిల్లలను బైక్‌పై తీసుకెళ్లాడు. వంతెనపై బైక్, సెల్‌ఫోన్, పర్సు ఉంచి… ముందు పిల్లలను నదిలో తోసేసి… తాను కూడా దూకేశాడు.
మంగళవారం లభించిన మృతదేహాలు
గోదావరిలో దూకేసిన దుర్గాప్రసాద్ తోపాటు ఇద్దరు చిన్నారుల కోసం పోలీసులు, స్థానిక మత్స్యకారులు, డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. మంగళవారం ఉదయం దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమార్తె జాహ్నవి ఆచూకీ కోసం ఇప్పటికీ గాలిస్తున్నారు. రెండు గ్రామాల్లోనూ గుండెలు బద్దలయ్యే ఏడ్పులు మిన్నంటుతున్నాయి.
కారణం ఏమిటి? ఇంకా మిస్టరీ
తన ఇద్దరి పిల్లలను ఎందుకు చంపాలనుకున్నాడు, తానెందుకు చనిపోవాలనుకున్నాడు అనే విషయాలు అంతుబట్టం లేదు. దుర్గాప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు ఇవ్వలేకపోయాడా? తాను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడ్డాడా? కుటుంబ కలహాలా? ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని బంధువులు అనుమానిస్తున్నారు. కానీ పిల్లలను కూడా చంపాలని నిర్ణయించుకోవడం మాత్రం ఎవరూ ఊహించలేక పోతున్నారు. తట్టుకోలేక పోతున్నారు. ఈ దుర్ఘటనపై రాజోలు సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నాం. పూర్తి వివరాల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు.
మానవత్వానికి మచ్చ
తండ్రి అంటే భరోసా… ఆసరా… ఆధారం. కానీ ఈ ఒక్క ఘటనే ‘నాన్న’ అనే పదానికి మచ్చ తెచ్చింది. అన్నెం-పున్నెం ఎరుగని చిన్నారులను నీటి గర్భంలో కలిపేసిన ఈ కర్కశ చర్య… సమాజాన్ని కలచివేస్తోంది. లక్కవరం, విశ్వేశ్వరాయపురం గ్రామాల్లో విషాద మేఘాలు అలుముకున్నాయి. జాహ్నవి ఆచూకీ కోసం ప్రార్థనలు… కన్నీళ్లు… నిశ్శబ్దం మాత్రమే మిగిలాయి.

