
ఆ స్కూలు పిల్లలు ఎందుకు యాక్సిడెంట్ కు గురయ్యారు?
పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజపేట స్కూలు విద్యార్థులు ఆటోలో వెళుతూ యాక్సిడెంట్ కు గురయ్యారు. వారు ఎందుకు ఆటోలో వెళ్లారు?
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామానికి చెందిన MPP స్కూల్ పిల్లలు యాక్సిడెంట్ కు గురయ్యారు. ఆటోలో వెళుతుండగా తిరగబడి ఏడుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎందుకు జరింది. స్కూలు పిల్లలు ఆటోలో ఎందుకు ప్రయాణం చేశారు?
రేషనలైజేషన్ లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దపెంకి గ్రామ ఎంపీపీ స్కూలును రద్దుచేసి ఆ స్కూలులో చదువుకుంటున్న 40 మంది పిల్లలను ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న మూడు స్కళ్లకు సర్థారు. దీంతో మా ఊళ్లో స్కూలు కావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పట్టుబట్టారు. విద్యాశాఖ అధికారులు వీరి గోడు పట్టించుకోలేదు. దీంతో వీరు కలెక్టర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు.
సోమవారం గ్రీవెన్స్ కు హాజరు
పెద్దపెంకి స్కూలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలెక్టరేట్ వద్ద కనిపించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి ఒక వినతి తప్రతం ఇచ్చారు. దీనిని కలెక్టర్ కు ఇచ్చి మా గ్రామంలో స్కూలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మా ఊరికి స్కూలును దూరం చేయొద్దని నినాదాలు చేసి లెక్టర్ కు అర్జీ ఇప్పించారు.
మాజీ ఎమ్మెల్యే జోగారావుకు కలెక్టరేట్ వద్ద అర్జీ ఇస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
ఆ తరువాత ఏమి జరిగింది?
కలెక్టర్ ఆఫీసు నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటికి ఆటోల్లో వెళుతుండగా ఒక ఆటో పల్టీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయిందని తెలియగానే మాజీ ఎమ్మెల్యే జోగారావు వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్య సాయం పొందుతున్నారు.
విద్యాశాఖ మంత్రికి ట్విటర్ లో ఫిర్యాదు
స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచన మేరకు గొర్లె శ్యామ్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. స్కూలు పిల్లలు అనవసరంగా మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో కలెక్టర్ కార్యాలయానికి పోయి వస్తూ యాక్సిడెంట్ కు గురయ్యారని, వారిని రెచ్చగొట్టినందుకు మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విజయచంద్ర మంత్రి లోకేష్ కు జరిగిన విషయం చెప్పి మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టటం వల్ల సమస్య ఏర్పడిందని చెప్పారు.
స్పందించిన మంత్రి నారా లోకేష్
ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం. అంటూ ట్విటర్ వేదికగానే స్పందించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను విచారించాల్సిందిగా ఆదేశించారు.
ఏడు స్కూల్స్ రద్దు చేశారు: మాజీ ఎమ్మెల్యే జోగారావు
బలిజిపేట మండలం లో ఏడు స్కూల్స్ ని రద్దు చేసి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. మంగళవారం పార్వతీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపెంకి లో 40 ఏళ్ళ క్రితం గ్రామస్థులు స్వంత స్థలం ఇచ్చి స్కూల్ నిర్మించుకున్నారు. ఈ స్కూల్ ని ఇప్పుడు రద్దు చేస్తామంటే గ్రామస్థులు కలెక్టరేట్ కి వచ్చి ధర్నా చేశారు. విద్యార్థుల ధర్నాకి మంత్రి లోకేష్ రాజకీయ దురుద్దేశం ఆపాదిస్తున్నారు. జూన్ 12 నుంచి పెద్దపెంకి స్కూల్ విద్యార్థులకు మద్యాన భోజనం పెట్టడం లేదు. పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు.
యువత పోరు కార్యక్రమానికి హాజరై, అక్కడే ఉన్న విద్యార్థులకు సంఘీభావం తెలిపితే లోకేష్ రాజకీయం చేస్తున్నారు. పెద్ద పెంకి నా స్వగ్రామం. సొంత వూరు పాఠశాల సమస్య పై మాట్లాడితే దానిని రాజకీయం చేస్తున్నారు. ధర్నా తరువాత డిఈఓ పిలవడం వలన రెండో పూట కూడా విద్యార్థులు అక్కడే ఉన్నారు. కూటమి ప్రభుత్వ విధానం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ లను చదువులకు దూరం చేస్తున్నారని విమర్శించారు.