ఈ ఎస్పీ ఇప్పుడెందుకు స్పందించారు?
x

ఈ ఎస్పీ ఇప్పుడెందుకు స్పందించారు?

ఈ ఎస్పీ గారికి వారం రోజుల క్రితం జరిగిన ఎన్నికల గొడవలు ఇప్పుడు గుర్తొచ్చాయి. శనివారం ఒక సీఐ, ఐదుగురు ఎస్‌ఐలకు చార్జి మెమోలు జారీ చేశారు.


ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న కడప నగరంలోని గౌస్‌నగర్‌లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి మంత్రి అంజాద్‌ భాష కుటుంబ సభ్యులు, టీడీపీలోని కొందరు ముఖ్య నాయకులు కారణమని పోలీసులు భావించారు. అయితే దాడిలో పాల్గొన్న వారెవరినీ నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చేయలేదన్న విమర్శలు మే 13న ఘటన జరిగిన రోజునే వచ్చాయి. వారం రోజులుగా ఈ ఘటన గురించి ఎస్పీ పట్టించుకోలేదు.

రాష్ట్రంలో అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో హింస చెలరేగింది. రాళ్ల దాడులు, హత్యాయత్నాలు వంటి సంఘటనలపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆయా ఎస్పీలను సస్పెండ్‌ చేసింది. దీంతో కడప ఎస్పీ సిద్దార్థ కౌశిల్‌ శనివారం హడావుడిగా కడప హెడ్‌ క్వార్టర్‌లోని పోలీసులతో సమీక్ష నిర్వహించారు. గౌస్‌ నగర్‌లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఇరు వర్గాల దాడులకు కారణమైన వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మీ పై ఎందుకు చర్యలు తీసుకో కూడదో సమాధానం చెప్పాలంటూ కడప టౌన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు రంగస్వామి, తిరుపాల్‌ నాయక్, మహ్మద్‌ రఫీ, ఎర్రన్న, ఆలీఖాన్‌లకు చార్జి మెమోలు తయారు చేశారు.
కడప జిల్లా కేంద్రం కావడం, అందులోను వైఎస్‌ఆర్‌సీపీ మంత్రి అంజాద్‌ బాషా కుటుంబ సభ్యుల జోక్యం ఉండటంతో సీఎం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోమోనన్న భయంతో వారం రోజుల వరకు ఎస్పీ పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. ఎప్పుడైతే పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింసపై సిట్‌ పేరుతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంతో అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తనపైకి సమస్య వస్తుందోనని ఈ విధమైన చర్యలకు ఎస్పీ పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిజానికి చార్జి మెమోలతో ఎవ్వరికీ ఏమీ కాదు. తమను తాము సమర్థించుకునేందుకు సీఐతో పాటు ఐదుగురు ఎస్‌ఐలు సమాధానం ఇస్తారనడంలో సందేహం లేదు. తను సమీక్షించానని, బాధ్యులైన వారిపై చార్జి మెమోలు జారీ చేసి తగు వివరణ తీసుకున్నానని డీజీపీకి చెప్పుకునేందుకు ఎస్పీకి ఈ వ్యవహారం ఉపయోగపడుతుంది. అంతే కానీ నిజంగా తప్పు చేసిన అధికారులపై కానీ ఘటనకు బాధ్యులైన నిందితులపై కానీ చర్యలు తీసుకునేందుకు ఈ యాక్షన్‌ పనికి రాదు. ఒక వేళ బాధ్యులపై చర్యలు తీసుకోవాలనిపిస్తే ఎస్పీ, డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరిపించి, సాక్ష్యాధారాలతో రికార్డులను తయారు చేసి డీజీపీకి సమర్పించాలి. అంతే కానీ తూతూ మంత్రంగా గొప్పగా చేశామని, నలుగురు పోలీసు అధికారులను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Read More
Next Story