విశాఖ మహా నగరపాలక సంస్థలో మేయర్ పీఠం మార్పుపై యాదవ సామాజికవర్గంలో కుమ్ములాటలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. యాదవ కులానికి చెందిన మేయర్ హరి వెంకట కుమారిని అదే సామాజికవర్గానికి చెందిన నేతలే ఇప్పడు ఆమెను పదవీచ్యుతురాలిని చేయడానికి కంకణం కట్టుకున్నారు. తన సామాజికవర్గం వారే తనను వెన్నుపోటు పొడుస్తున్నారంటూ బహిరంగంగానే కంటతడి పెడుతున్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడం, మరోపక్క కూటమికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువవుతుండడంతో ఆమెను అలజడికి గురి చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై కన్నేశారు. ఎలాగైనా విశాఖ మేయర్ పీఠంపై కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టాలని తెగ తంటాలు పడుతున్నారు. ఆరంభంలో అందుకోసం హడావుడి చేసినా జీవీఎంసీ పాలకవర్గానికి నాలుగేళ్లు నిండేదాకా అవిశ్వాసానికి వీలుపడదని నిబంధనలు తేటతెల్లం చేయడంతో అప్పటిదాకా అతికష్టమ్మీద ఓపికపట్టారు. అంతకుముందే సామ, దాన, దండోపాయాలతో 58 మంది కార్పొరేటర్ల బలం ఉన్న వైసీపీ కార్పొరేటర్లకు వల వేయడం మొదలు పెట్టి సఫలీకృతులయ్యారు. టీడీపీలోకి కొందరిని, జనసేనలోకి మరికొందరిని లాక్కున్నారు. ఇలా 58 మంది సభ్యులున్న వైసీపీ సంఖ్యను ఇప్పడు 30 లోపునకే తీసుకొచ్చారు. దీంతో మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితులకు చేరువలోకి కూటమి నేతలు వచ్చారు. కూటమి నేతల కుట్రలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను తొలుత బెంగళూరు, ఆపై శ్రీలంక (కొలంబో)కు తరలించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు విదేశాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తుంటే మా సంగతేమిటని కూటమి కార్పొరేటర్లు తమ నాయకులను నిలదీశారు. విధిలేని పరిస్థితుల్లో కూటమి నేతలు కూడా తమ వారిని మలేసియా ట్రిప్‌నకు పంపించారు. కొన్నాళ్లుగా వైసీపీ, టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ కార్పొరేటర్లను విదేశాలకు పంపి ఇక్కడ ఇరువర్గాల నేతలు ఎవరి రాజకీయ వ్యూహాలు వారు రచిస్తున్నారు.
టీడీపీ ఎమ్మల్యేలు వంశీ, రామకష్ణబాబులతో వైసీపీ సభ్యుడు బెహరా భాస్కరరావు
వెన్నుపోటులో కీలక నేతలు వారే..
మేయర్ హరి వెంకట కుమారి యాదవ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వారు. 2021లో జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు బీసీ జనరల్‌కు కాకుండా బీసీ మహిళకు కట్టబెట్టారు. దీనివల్ల అటు బీసీతో పాటు మహిళలకు పెద్దపీట వేశామని చెప్పుకోవడానికి ఆ ఎత్తుగడ వేశారు. విశాఖ మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఆ పదవి తనకే దక్కుతుందని వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు కాకుండా అదే సామాజికవర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారికి అనూహ్యంగా కట్టబెట్టడంతో వంశీకృష్ణ షాక్ తిన్నారు. ఇక అప్పట్నుంచి ఆయన వైసీపీ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి వంశీకృష్ణకు ఎమ్మల్సీ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీరిద్దరూ మేయర్ ను పదవీచ్యుతురాలిని చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీఎంసీలో మొత్తం 98 స్థానాలుండగా అందులో 22 మంది కార్పొరేటర్లు యాదవ సామాజికవర్గం నుంచి ఎన్నికైన వారే. వీరిలో వైసీపీ నుంచి 13 మంది, టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన, బీజేపీ, సీపీఐ(ఎం)ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి ఆరుగురు కూటమిలోకి జంప్ చేశారు.
కంటతడి పెట్టిన మేయర్..
కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు చేరుతుండడంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇందుకు తన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావులే కంకణం కట్టుకున్నారని మేయర్ హరివెంకట కుమారి బహిరంగంగానే ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాకు వివరిస్తూ ‘మీ సోదరిలాంటి దాన్ని పదవి నుంచి తప్పించడం మీకు న్యాయమేనా?’ అంటూ బుధవారం కంటతడి పెట్టారు.
అవిశ్వాసం నెగ్గితే యాదవులకే ఇస్తారా?
మేయర్‌ను అవిశ్వాసంలో ఓడిస్తే ఆ స్థానంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్‌కు ఇస్తారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి కూటమిలోకి కార్పొరేటర్లను జంప్ చేసేందుకు అవసరమైన ఖర్చులను భరించే బాధ్యతను ఆయనకే అప్పగించారన్న చెప్పుకున్నారు. ఇంతలో ఇటీవల యాదవ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు ఆల్సి అప్పలనారాయణ ఆధ్వర్యంలో సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారినే మేయర్‌గా కొనసాగించాలని, ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ఆమె ఓడిపోతే యాదవ సామాజికవర్గానికి చెందిన వారికే మేయర్ ను చేయాలన్నది వారి డిమాండ్. అలాకాకుండా వేరొక సామాజికవర్గానికి మేయర్ పదవినిస్తే విశాఖలో ప్రాబల్యం ఉన్న యాదవుల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం కూటమి నేతల్లో క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే యాదవ సామాజిక వర్గ కార్పొరేటర్‌కే మేయర్ పదవిని ఇవ్వాలన్న నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. కాగా కార్పొరేటర్ గొలగాని మంగవేణిని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మొల్లి హేమలతను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రతిపాదిస్తున్నట్లు కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మేయర్ పదవి గతంలో బీసీ జనరల్‌కు కేటాయించినందున మళ్లీ మహిళకు కాకుండా యాదవుల్లో పురుష కార్పొరేటర్‌కు ఇవ్వాలన్న వాదన మరి కొందరి నుంచి వినిపిస్తోంది. అలా జరిగితే ఇన్నాళ్లూ మేయర్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న పీలా శ్రీనివాస్‌కు డిప్యూటీ మేయర్‌తో సరిపెడతారని అంటున్నారు.
పెరిగిన కూటమి బలం!
కొన్నాళ్లుగా కూటమి నాయకులు జరుపుతున్న కసరత్తు ఒకింత సత్ఫలితాలిచ్చినట్టే కనిపిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు కూటమికి 72 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74. దీంతో వైసీపీ నుంచి తాజాగా వైసీపీ కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, ఆయన భార్య స్వర్ణలత శివదేవి, కోడలు .జ్యోత్స్నలు జనసేనలో, గాజావాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీలు కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటేశామని కూటమి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. అయితే టీడీపీలోని ఇద్దరు. వైసీపీ నుంచి కూటమిలో చేరి అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని, అందువల్ల తమ మేయర్ పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19న అవిశ్వాస తీర్మానంపై జరిగే సమావేశంలో చేతులెత్తే విధానం అవలంబిస్తారని, అవిశ్వాసానికి వ్యతిరేకించే వారు ఆరోజు గైర్హాజరవడం ద్వారా వైసీపీకి మేలు చేస్తారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విప్‌ను ధిక్కరించి కూటమికి ఓటేస్తే వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తమని హెచ్చరించారు.