శ్రీశైలం వివాదం ఎందుకొచ్చింది?
x
శ్రీశైలం డ్యామ్ (ఫైల్ ఫొటో)

శ్రీశైలం వివాదం ఎందుకొచ్చింది?

ఆంధ్రప్రదేశ్‌లో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. కొత్త జిల్లాల ప్రకటనలో మార్కాపురం ఉంటుంది.


శ్రీశైలం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న మార్కాపురం జిల్లాలో కలుపుతారని ఎవరన్నారు? ఎందుకు చర్చ తెరపైకి వచ్చింది. నిప్పు లేకుండానే పొగ రాజుకుందా? ప్రభుత్వ పెద్దల వద్ద చర్చ జరగకుండానే ఈ వ్యవహారం ఇంత భారీగా ఎందుకు చర్చకు దారి తీసిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి అటువంటిదేమీ లేదని సెలవిచ్చారు. అసలు ఆ చర్చే లేనప్పుడు ఆ వ్యవహారంపై మంత్రి ఎందుకు స్పందించాలనేది కూడా చర్చకు దారి తీసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ హామీ మేరకు మంత్రివర్గ ఉపసంఘం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ - జిఓఎం) ప్రతిపాదనలు పంపినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని వివాదంలోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించడం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రస్తుత ప్రకాశం జిల్లా విశాలమైనదని, అందుకే మార్కాపురం కొత్త జిల్లాగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందని పలువురు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

సాగునీటి ఉద్యమకారుల నోర్లు మూయించేందుకేనా?

‘‘రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. నేడు రాళ్ల సీమ’’ అంటున్నారు సాగునీటి ఉద్యమకారులు. ప్రస్తుతం రాయలసీమలో ఉన్న చెరువులకు నీరు నింపాలంటే పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణాలు జరగాలి. ఆ నిర్మాణాలు చాల చోట్ల అసంపూర్తిగా ఉన్నాయని సాగునీటి సాధన సమితీ నాయకులు చెబుతున్నారు. హంద్రీనీవా సుజల శ్రవంతి నుంచి నీటిని కుప్పం వరకు తీసుకు పోయారని సీఎం చెప్పుకోవడం కాదు. చెరువులో పడవలు వేసి తిరగటం కాదు, ఈ మధ్యలో ఉన్న పొలాల పరిస్థితి ఏమిటి? కాలువల ద్వారా చుక్క నీరైనా సాకుకు అందుతున్నాయా? ఈ విషయం పాలకులకు తెలియదా? అనేది పలువురు సాగునీటి సాధన కోసం పనిచేస్తున్న నాయకులు అంటున్న మాట. వీరు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం పోరాటాలు రాయలసీమలో చేస్తూనే ఉన్నారు. వీరి నోరు మూయించాలంటే శ్రీశైలం దేవస్థానాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కలపడం ద్వారా మార్కాపురం జిల్లాలో భాగం చేస్తే ఈ ఉద్యమకారుల నోర్లు మూత పడతాయనే ఆలోచన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చేశారనేది రాయలసీమ వాసుల ఆరోపణ.

26 జిల్లాలను 32కి పెంచాలనే ప్రతిపాదనలు

ప్రభుత్వం 2025 జులై 22న జారీ చేసిన జిఓ నెం.1378 మేరకు జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు, భవనాల మంత్రి కందుల దుర్గేశ్ లు ఉన్నారు. ఆగస్టు 13న మొదటి సమావేశం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సరిహద్దు వివాదాలు, జిల్లాల పేర్ల మార్పులు వంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుత 26 జిల్లాలను 32కి పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో మార్కాపురం ఒకటి. అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లె తో పాటు మార్కాపురం కొత్త జిల్లాలుగా రానున్నాయని సమాచారం.

మార్కాపురం జిల్లా ఏర్పాటు హామీలో భాగం

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల హామీల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు ఉంది. 2025 మార్చి 8న సిఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం ను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఉపసంఘం ప్రతిపాదనలు పంపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అయితే ఉపసంఘం నామినల్ మాత్రమేనా అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. వాస్తవానికి ఈ సంఘం ప్రజల వినతులు స్వీకరిస్తూ, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తుంది. జిల్లాల సరిహద్దులు, మండలాల విభజన, గ్రామాల విడిపోవడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజల వినతులకు విలువ ఇవ్వకుండా ప్రభుత్వం తనకు తోచినట్లు చేస్తుందనే అనుమానాలు అవాస్తవమని, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారు.


శ్రీశైలం వివాదం, మంత్రి ఆరోపణలు, నేపథ్యం

మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి రెండు రోజుల క్రితం మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ "ఏ జిల్లాలో ఉన్న ప్రముఖ ప్రాంతాలు అక్కడే ఉంటాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కొందరు వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. శ్రీశైలం ఆలయాన్ని మార్కాపురం జిల్లాలో కలిపేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ వివాదంలోకి లాగాలనుకుంటున్నది ఎవరు? ప్రధానంగా విపక్ష వైఎస్ఆర్‌సీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు అని మంత్రి ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో అక్రమాలు చేసిందని, ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మండల వ్యవస్థ రాక ముందు (1985కు ముందు) శ్రీశైలం ఆత్మకూరు తాలూకాలో ఉండేది. అప్పుడు ఇది కర్నూలు జిల్లాలో భాగం. ఎర్రగొండపాలెం మండలానికి శ్రీశైలంతో సంబంధం ఉంది. ఇవి పక్కపక్కనే ఉన్న మండలాలు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి తూర్పున త్రిపురాంతకం మండల కేంద్రంలో త్రిపురాంతకేశ్వరుడు (శివుడు) వెలిశాడు. నాగార్జున సాగర్ కుడికాలువ పై భాగాన కొండపై ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కొండ కింద భాగాన చెరువులో శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. భక్తులు ముందుగా త్రిపురాంతకేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ఆ తరువాత శ్రీశైలం వెళుతుంటారు. అందుకే ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాలతో శ్రీశైలానికి విడదీయరాని బంధం ఉందని చరిత్ర కారులు చెబుతుంటారు. శ్రీశైలం ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. మంత్రి వ్యాఖ్యలు చేయడానికి కారణం రాజకీయ ప్రత్యర్థుల ప్రచారాన్ని అడ్డుకోవడమేననే చర్చ కూడా జరుగుతోంది.


మార్కాపురం చెన్నకేశవ ఆలయం

మార్కాపురం జిల్లా ప్రతిపాదనకు మూలాలు

మార్కాపురం జిల్లా కావాలనే ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది. రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల్లో భాగంగా మార్కాపురం ను ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ ఉంది. అయితే 2019 నుంచి ఆ డిమాండ్ అన్ని వర్గల నుంచి వచ్చింది. అప్పటి అఖిలపక్ష సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ, మిగిలిన పక్షాలు డిమాండ్ చేశాయి. మార్కాపురం ప్రాంతం గతంలో కర్నూలు జిల్లాలో ఉండేది. 1970లో ప్రకాశం జిల్లాలో కలిపారు. కానీ వెనుకబాటుతనం తొలగ లేదు. ప్రకాశం జిల్లా విశాలమైనది, (14,322 చ.కి.మీ) రాష్ట్రంలో పెద్దది కావడంతో పాలనా సౌలభ్యం కోసం విభజన అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

కాబోతున్న మార్కాపురం జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా చెన్నకేశవ స్వామి ఆలయం (మార్కాపురం) ప్రధానమైనది. ఆ తరవాత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. నంద్యాల జిల్లాలో మాత్రం శ్రీశైలం (మల్లికార్జున జ్యోతిర్లింగం), అహోబిలం, మహానంది, యాగంటి వంటి 8 ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.

ప్రస్తుత జిల్లాల పేర్లు మార్చే అవకాశం ఉంది. ఉపసంఘం దీనిపై చర్చిస్తోంది. జిల్లాల విభజనలో గ్రామాలను మండలాల నుంచి వేరు చేసే అవకాశం ఉంది. వినతులపై ఉపసంఘం సాంస్కృతిక, చారిత్రక కారణాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తుంది.

ప్రతిపాదిత నియోజకవర్గాలు

మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు చేరుతాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఈ 5 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా పశ్చిమ భాగంలో ఉన్నాయి. బాగా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతాలను జిల్లాలుగా చేయాలనే డిమాండ్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ ఐదు నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా చేయాలనే ప్రతిపాదనకు ఉపసంఘం సిఫార్సు చేసింది.

పాలనా సౌలభ్యమా? రాజకీయ లబ్ధా?

మార్కాపురం జిల్లా ఏర్పాటు వెనుక పాలనా సౌలభ్యం ప్రధాన కారణం అయినప్పటికీ, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. ప్రకాశం విశాలమైనది కావడం, ఎక్కవ నల్లమల అడవులతో ఉండటం వల్ల పశ్చిమ ప్రాంతం అభివృద్ధి లోపించింది. కొత్త జిల్లా ద్వారా డీసెంట్రలైజేషన్ సాధ్యమవుతుంది. అయితే శ్రీశైలం వివాదం వంటివి రాజకీయ ప్రచారాలుగా మారాయి. ప్రభుత్వం ప్రజల వినతులు పరిగణనలోకి తీసుకుంటుందని పలువురు ఆశిస్తున్నారు. కానీ అమలు ఎలా ఉంటుందో చూడాలి. ఈ ప్రక్రియ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలి, రాజకీయ లబ్ధికి కాదు.

Read More
Next Story