ఎర్రచందనం నిల్వలపై సీఎంకు అనుమానం ఎందుకొచ్చింది?
x

ఎర్రచందనం నిల్వలపై సీఎంకు అనుమానం ఎందుకొచ్చింది?

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం నిల్వల లెక్కలు కూడా తెలియపోతే ఎలా? ఎంత నిల్వ ఉంది?


ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక విలువైన వనరు. ఈ చెట్టు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ ఉంది. ఈ చెట్ల అక్రమ నరికివేత, స్మగ్లింగ్ రాష్ట్రంలో దీర్ఘకాల సమస్యగా మారింది. ఈ సమస్యను అరికట్టడంలో వివిధ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎర్రచందనం నిల్వలను అంచనా వేయడానికి, అంతర్జాతీయ విక్రయాలను అన్వేషించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చర్య రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఎర్రచందనం నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు అనుమానం ఎందుకు వచ్చిందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. ఇప్పటి వరకు ఉన్న నిల్వలపై స్పష్టమైన రిపోర్టులు లేవనే అనుమానం ముఖ్యమంత్రిలో ఉంది. ఈ విషయం అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ కు తెలియదా? ఆయన ఎందుకు పదినెలలైనా ఈ విషయంపై ప్రత్యేకించి మాట్లాడలేదనే చర్చ కూడా జరుగుతోంది. పైగా పవన్ కల్యాణ్ తో సంబంధం లేకుండానే ఎర్రచందనం నిల్వలను నిగ్గు తేల్చడానికి కమిటీ వేశారు.


యాంటి స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కూడా ఫెయిల్ అయిందా?

గత ప్రభుత్వం 2014-2019 మధ్య రెడ్ శాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (APRSASTF)ను నియమించింది. దీనివల్ల వందలాది స్మగ్లర్లను అరెస్టు చేసిందని, వేలాది కేసులు నమోదయ్యాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు కొన్ని గుర్తించిన ఘటనలలో 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. జూలై 2024లో నలుగురు, జనవరి 2025లో ముగ్గురు, ఫిబ్రవరి 2025లో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఇవి నిర్దిష్ట ఘటనలకు సంబంధించినవి మాత్రమే. మొత్తం కేసుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు.

పది నెలల కాలంలో సుమారు 13 టన్నుల ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. జూలై 2024లో 158 లాగ్‌లు (సుమారు 2 టన్నులు), రూ. 1.91 కోట్ల విలువైన దుంగలు కడప జిల్లాలో స్వాధీనం చేసుకున్నారు. జనవరి 2025న రూ. 4.5 కోట్ల విలువైన 7 టన్నుల ఎర్రచందనం చిత్తూరు సమీపంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో 195 లాగ్‌లు (సుమారు 6 టన్నులు), రూ. 4.2 కోట్ల విలువైనవి, తిరుపతిలో స్వాధీనం చేసుకున్నారు.

ఈ స్వాధీనాలు నిర్దిష్ట ఘటనలకు సంబంధించినవి. మొత్తం స్వాధీనం ఈ సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చు.

నివేదికలు ఎందుకు అందటం లేదు?

ఎర్రచందనం నిల్వలపై ఇంతవరకు స్థిరమైన నివేదికలు సమర్పించక పోవడం ప్రభుత్వ పర్యవేక్షణలో లోపాన్ని సూచిస్తుంది. ప్రతి నెలా నివేదిక సమర్పిస్తే నిల్వ, కేలుల వివరాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అక్రమ నరికివేత కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి రిపోర్టింగ్ లేక పోవడం జవాబుదారీ తనం లోపించిందనే విమర్శలకు దారితీసింది. గత ప్రభుత్వాలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించలేదని, దీనిని అరికట్టడానికి బలమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది.

అక్రమ నరికివేత ప్రభుత్వ వైఫల్యం కాదా?

ప్రతి రోజూ అడవుల్లో ఎర్రచందనం నరికివేత కొనసాగుతోంది. దీనిని నియంత్రించడంలో అటవీ శాఖ, భద్రతా బలగాలు విఫలమవుతున్నాయి. గతంలో ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు (ఉదా. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు) సరిపోలేదు. ఈ వైఫల్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని విలువైన వనరును కాపాడలేక పోవడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.


అధికారులపై నమ్మకం లేకనేనా కమిటీ?

ఎర్రచందనం నిల్వల గురించి స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, దానిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల నిల్వలు ఉన్నాయి. వాటి విలువ ఎంత అనే వివరాలను కమిటీ అందించాలని సూచించారు. ఎన్ని టన్నుల నిల్వలు ఉన్నాయనే ప్రస్తుత నివేదిక సీఎంను సంతృప్తి పరచలేదంటే ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు అక్రమ నిల్వలు చేస్తున్నారే ఆలోచన ప్రభుత్వంలో ఉందని స్పష్టమవుతోంది.

ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంది. ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైన సంస్కరణ కంటే ప్రజల దృష్టిని మరల్చే చర్యగా కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం తాత్కాలికంగా అక్రమ నిల్వలను అమ్మడం ద్వారా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది తప్ప ఎర్రచందనం అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి.

కమిటీ నివేదిక ద్వారా ప్రభుత్వం ఏమి సాధిస్తుంది?

ఎర్రచందనం నిల్వల ఖచ్చితమైన లెక్కలు తెలుసుకోవడం ద్వారా మొత్తం నిల్వల విలువను తెలుసుకోవచ్చు. కర్ర క్వాలిటీ వంటి వివరాలు సేకరించి మరింత మెరుగైన ఆదాయం సాధించేందుకు వీలు ఉంటుందనే ఆలోచన ప్రభుత్వంలో ఉందనే వివమర్శలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఈ ఆదాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమ నరికివేతను అరికట్టడానికి బలమైన వ్యూహాన్ని రూపొందించడానికి ఈ నివేదిక ఆధారం కావచ్చు.

కమిటీ నివేదిక ఆచరణాత్మకంగా ఉంటుందా?

గతంలో ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో, కమిటీ నివేదిక ఆచరణాత్మక చర్యలకు దారితీస్తుందనే నమ్మకం లేదనే వాదన ఉంది. ఈ చర్య నిజమైన సంస్కరణ కంటే ప్రభుత్వ ఇమేజ్‌ను మెరుగు పరిచే ఉద్దేశ్యమనే విమర్శలు ఉన్నాయి.

కమిటీ నివేదిక ఎర్రచందనం నిర్వహణలో ఒక కీలకమైన మలుపు కావచ్చు. రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టవచ్చు. అయితే ఈ సమస్య మూల కారణాలను (అక్రమ నరికివేత, స్మగ్లింగ్) పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోతే... ఇది కేవలం మరో వ్యర్థ ప్రయత్నంగా మిగిలిపోయే అవకాశం ఉంది.

Read More
Next Story