రేవంత్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు ?
x

రేవంత్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు ?

వామపక్షాల నేతలతో రేవంత్(Revanth) మాట్లాడుతు కొడంగల్(Kodangal) లో ఏర్పాటుచేయబోయేది ఫార్మా సిటీ(PharmaCity) కాదన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు.


రేవంత్ రెడ్డి పూర్తిగా యూటర్న్ తీసుకున్నాడు. రెండోరోజుల క్రితం వరకు చెప్పిన మాటకు పూర్తి విరుద్ధంగా శనివారం మాట్లాడాడు. శనివారం తనను కలసిన వామపక్షాల నేతలతో రేవంత్(Revanth) మాట్లాడుతు కొడంగల్(Kodangal) లో ఏర్పాటుచేయబోయేది ఫార్మా సిటీ(PharmaCity) కాదన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు. కొడంగల్ లో ఏర్పాటుచేయాలని అనుకుంటున్నది ఇండస్ట్రియల్ క్యారిడార్ మాత్రమే అని స్పష్టంగా ప్రకటించారు. ఇండస్ట్రియల్ క్యారిడార్లో కూడా కాలుష్యరహిత పరిశ్రమలు మాత్రమే ఏర్పాటుచేయబోతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో ఏర్పటుచేయబోతున్నది ఇండస్ట్రియల్ క్యారిడారే కాని ఫార్మాసిటి కాదని రేవంత్ మాటమార్చారన్న విషయం అర్ధమైపోతోంది. అయితే ఎందుకు ఇంత సడెన్ గా మాట మార్చినట్లు ?



లగచర్ల గ్రామంలో పర్యటించిన సీపీఎం(CPM) సెక్రటరీ తమ్మినేని వీరభద్రం, సీపీఐ)CPI) కొత్తగూడెం(Kothagudem) ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు తదితరులు రేవంత్ ను కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళతో మాట్లాడిన రేవంత్ తన నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేయాల్సి బాధ్యత తనపైన ఉందికదాని అడగారు. నియోజకవర్గం ప్రజలకు మేలుచేయాలన్నదే తన సంకల్పంగా చెప్పుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు మేలుచేయటమే కాని నష్టం కలిగించే ఆలోచన తనకు లేదన్నారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలన్నదే తన సంకల్పంగా చెప్పారు. భూసేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.



రేవంత్ సంకల్పం, ఆలోచన, తపన అర్ధంచేసుకోదగ్గదే. అయితే ఇక్కడే కొన్ని సందేహాలు మొదలయ్యాయి. అవేమిటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కచ్చితంగా రేవంత్ మీద ఉందనటంలో సందేహాలు లేవు. నియోజకవర్గం ప్రజలకు మేలుచేయాలన్న ఆలోచనను అభినందించాల్సిందే అనటంలో సందేహంలేదు. ప్రజలకు మేలు చేయటమే కాని నష్టం చేసే ఆలోచన తనకు లేదనటంపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వామపక్షాల నేతలతో చెప్పినట్లుగా కొడంగల్ లో ఏర్పాటుచేయబోయేది ఫార్మాసిటి కాదు ఇండస్ట్రీయల్ క్యారిడార్ మాత్రమే అని ఇంతకుముందు రేవంత్ ఎప్పుడైనా ప్రకటించారా ? మొదటినుండి కూడా సేకరించాలని అనుకుంటున్న భూములన్నీ ఫార్మా పరిశ్రమల కోసమే అని కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న విషయం రేవంత్ కు తెలీదా ? తెలిసి ఎందుకు ఇపుడు చెప్పిన మాటలు అప్పుడు చెప్పలేదు ?



ఫార్మా కంపెనీలకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లన్నీ ఫోర్త్ సిటీ(Fourth City)లో ఏర్పాటుచేస్తు కాలుష్యకారక ఉత్పత్తి యూనిట్లను కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తామని అంటే అందుకు ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు ? అసలు తమ వ్యవసాయభూములను ఏ పరిశ్రమ ఏర్పాటుకూ ఇచ్చేదిలేదని రైతులు, గ్రామస్తులు తెగేసి చెబుతున్న విషయం రేవంత్ కు తెలీదా ? ప్రజోపయోగాల కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం అనుకుంటే ఎవరూ అడ్డుకోలేరన్న విషయం తెలిసిందే. తమ భూములు ఇచ్చేదిలేదని ఎవరైనా అంటే అందుకు కోర్టులు కూడా మద్దతుగా నిలబడవు. కాబట్టి ఏదో రోజు భూములను ప్రభుత్వం తీసేసుకోవటం ఖాయం. రైతుల భూములను తీసుకోవాలని ప్రభుత్వం అనుకున్నపుడు ముందుగా రైతులు, గ్రామస్తులను కన్వీన్స్ చేయాలని రేవంత్ కు తెలీదా ? వ్యవసాయం చేయటంలో వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వానికి భూములు ఇవ్వటం వల్ల దక్కే ప్రయోజనాలు ఎక్కువని రైతులు, గ్రామస్తులు కన్వీన్స్ అయినపుడు మాత్రమే భూములు ఇవ్వటానికి రెడీ అవుతారని రేవంత్ కు అంతమాత్రం తెలీదా ? ఆ పద్దతిలో రైతులు, గ్రామస్తులను ఒప్పించాల్సిన బాధ్యత ఎంఎల్ఏ, సీఎంగా రేవంత్ పైనే ఉంది.



తన బాధ్యతను పక్కనపెట్టేసి భూసేకరణ వ్యవహారం మొత్తం సోదరుడు తిరుపతిరెడ్డి(TiruptiReddy) మీద పెట్టడంతోనే విషయం పక్కదారిపట్టింది. తిరుపతిరెడ్డి రైతులు, గ్రామస్తులను బెదిరిస్తున్నట్లు మాట్లాడటంతోనే అందరు వ్యతిరేకం అయ్యారు. చివరకు లగచర్ల గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద దాడి జరగటంతో వ్యవహారం కాస్త జాతీయస్ధాయికి చేరుకున్నది. లగచర్ల ఘటనకు సంబంధించి మీడియాలో మెజారిటి వార్తలు ప్రభుత్వాన్ని తప్పుపడుతునే వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది వాస్తవం. ఇంటా, బయట ఎదురైన వ్యతిరేకత కారణంగా ఏమిచేయాలో రేవంత్ కు దిక్కుతోచలేదు. దాడిలో పాల్గొన్న వారి కుటుంబాల్లోని ఆడవాళ్ళని, పిల్లలను కూడా పోలీసులు స్టేషన్లలో పడేసి అరాచకంగా వ్యవహరించటంతో వివాదం కాస్త జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తో పాటు మానవహక్కుల కమిషన్(Human Rights Commission) కు చేరుకుంది. బాధితులను ఢిల్లీకి తీసుకెళ్ళి కమిషన్ల దగ్గర ఫిర్యదు ఇప్పించటంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.


కొడంగల్ లో ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాటుచేద్దామని అనుకున్నపుడు ఫార్మా పరిశ్రమలనే ప్రచారం ఎలా జరిగింది ? ముఖ్యమంత్రిగా కాకుండా ఎంఎల్ఏ గా రేవంత్ రైతులు, గ్రామస్తులతో భూసేకరణ విషయంలో కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసుంటే వ్యవహారం స్మూత్ గా జరిగిపోయేదేమో. అలాకాకుండా తాను చెప్పగానే భూములిచ్చేస్తారని, తన నియోజకవర్గంలో సేకరించబోయే భూముల కోసం తాను ఎవరితోను మాట్లాడాల్సిన అవసరంలేదని రేవంత్ అనుకున్నారేమో. అందుకనే రైతులు, గ్రామస్తులతో మాట్లాడే బాధ్యతలను సోదరుడు తిరుపతిరెడ్డికి అప్పగించారు. ఇక్కడే రేవంత్ జనాలను చాలా తక్కువ అంచనా వేశారు. మొత్తంమీద చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహారం అంతా వివాదంగా మారిపోయిన తర్వాత రేవంత్ ఇపుడు మాట మార్చారన్న విషయం అర్ధమైపోతోంది. ఇకముందన్నా భేషజాలకు పోకుండా రేవంత్ తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుంది.

Read More
Next Story