NTR MARRIAGE |లక్ష్మీపార్వతిని నటకిరీటి రాజేంద్రుడు ఎందుకంత మాటన్నారు?
ఎన్టీఆర్ పెళ్లిపై నాదెండ్ల భాస్కరరావు ఏమన్నారు? ఏమి రాశారు? లక్ష్మీపార్వతి మళ్లీ ఎందుకు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు? నటుడు రాజేంద్ర ప్రసాద్ అంతమాట ఎందుకన్నారు?
ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి (NTR MARRIAGE) మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడామెపై సినీ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఆమె మళ్లీ తెరపైకి వచ్చారు. లక్ష్మీపార్వతిని ఓ అమర్యాదకరమైన పదంతో అభివర్ణించారు. ఆమె ఎన్టీ రామారావుకు పట్టిన దరిద్రం అంటూనే లక్ష్మీపార్వతిని అసభ్యకరంగా భావించే ఓ సంక్షిప్త పదంతో పిలవడం వివాదాస్పదమైంది.
సీనియర్ నటుడుగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా లక్ష్మీపార్వతిని అలా పిలవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్టీఆర్ హయాంలో మాత్రం ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. ఎవర్నీ వ్యక్తిగతంగా కూడా దూషించలేదు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ పైన తన అభిప్రాయాన్ని చెబుతూ లక్ష్మీపార్వతి పేరు ప్రస్తావించారు. ఈ సందర్భంలోనే ఆమెపై తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఎన్టీఆర్ పాలిట ఆమె ఒక దరిద్రమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది.
ఆ దరిద్రం వల్లే సీనియర్ ఎన్టీఆర్ తమకి దూరమయ్యారని, ఆమె ప్లాన్ ప్రకారమే వచ్చి ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసిందంటూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యర్థుల పార్టీలతో చేతులు కలిపిందని, అదే వారికి అస్త్రంగా మారింది అంటూ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు, ఆయన పిల్లల కంటే తానే ఎక్కువగా ఏడ్చానని తెలిపారు.
ఎన్టీ రామారావు పెళ్లీ.. పర్యావసానాలు..
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జీవిత చరిత్ర రాసే పేరిట లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ దరి చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన ఆమెను తన జీవిత భాగస్వామిగా చేర్చుకున్నారు. ఈ పెళ్లిపై లక్ష్మీపార్వతి ఓ సందర్భంలో ఇలా చెప్పారు.
‘‘నిజం చెప్పాలంటే, ఎప్పుడైతే మేము కలిసి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చామో.. అప్పుడే, మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు కట్టిన తాళిబొట్టును మెడలో నుంచి తీసేశా. ఆరు నెలల ముందే, తాళి తీసేసి.. గాయత్రి మాత ఎదురుగా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. ఇక, అధర్మంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాం. ఎవరికీ తెలియకుండా అమ్మవారి ముందు భార్యాభర్తలం అని అనిపించుకున్నాం. తర్వాత, 1993 సెప్టెంబర్‌లో పూర్తిగా అందరి ముందు సాక్ష్యాలతో సహా పెళ్లి చేసుకున్నాం" అన్నారు లక్ష్మీపార్వతి.
అయితే ఆ పెళ్లి ఆనాడు పెద్ద వివాదాస్పదం అయింది. చివరకు ఎన్టీఆర్ తన ముఖ్యమంత్రి పదవినే కోల్పోవాల్సి వచ్చింది. దానిపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా తన జీవిత ప్రస్థానంలో అనేక విషయాలు చెప్పారు.
ఎన్టీఆర్ ఓనాటి సహచరుడు నాదెండ్ల ఏమంటారంటే..
ఈ సందర్భంలో ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి ఆయన ఓనాటి సహచరుడు, ఎన్టీఆర్ తో కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాదెండ్ల భాస్కరరావు చాలా ఆసక్తికరమైన విషయాలను తన జీవిత ప్రస్థానంలో రాశారు.
ఆ పుస్తకంలోని 389వ పేజీలో ఎన్టీఆర్ ద్వితీయ వివాహం పేరిట రాసిన విషయాలను యథాతధంగా...
ఎన్టీ రామారావు ధర్మపత్ని బసవతారకం స్వర్గస్తులయ్యాక, ఇంత మంది కుమారులూ, కూతుళ్లు ఉండి, పైగా- ముఖ్యమంత్రిగా కూడా పాలన చేస్తున్నాడయ్యే- ఇవేవీ గుర్తించని ఎన్టీ రామారావు సంతానం, ఎన్టీ రామారావుని చిన్న చూపేం ఖర్మ- ఘోరమైన చూపే చూసి ఆయనను నిర్లక్ష్యం చేయడం జరిగిందని పత్రికలు ఘోషించినట్టు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు "నా జీవిత ప్రస్థానం" అనే పుస్తకంలో రాశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు తిరుపతిలో రెండో పెళ్లి చేసుకున్నారు.
ఈ విపరీత పరిస్థితిని గమనించిన చంద్రబాబు అమ్మో! తన మామ ఎన్టీ రామారావు ఆమెకు లొంగిపోయారు, ఇప్పుడే ఈమె తన మామ పైన ఇంత ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంది. మరి భవిష్యత్తులో ఇంకేం చేయగలదో? ఊహకు అందడమే లేదు చంద్రబాబుకు! ఆమె ఎడ విపరీతమైన అసంతృప్తి, అసహ్యం, అసూయ పెంచుకున్నాడు చంద్రబాబు. ఎవరికీ చెప్పలేని పనుల్ని తను తన మామకు చేసినప్పటికీ, తన మామ రామారావు ఆ వచ్చిన ఆగంతక స్త్రీ తోనే ఎక్కువ కాలక్షేపం చేయడంలో మునిగిపోతున్నారు. ఈ సందర్భంలో, తనొకందుకు ఏడుస్తుంటే- ఆ పత్రిక, ఆ వచ్చిన ఆగంతక స్త్రీ సలహాలు, ఇచ్చేతోనే ప్రభుత్వం నడుస్తున్నదని కావాలని రాస్తూ, ఎన్టీ రామారావుని బధనానం చేస్తూ వచ్చేస్తుంది. నామ్ కే వాస్తే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అని మురవడం తప్ప, ఎన్టీరామారావు ఆమె వలలో చిక్కిపోయారు. ఇందుకు తగ్గట్టుగానే ఎన్టీ రామారావు కూడా అభ్యర్థులు ఎంపికలో గానీ, ప్రభుత్వ నిర్ణయాలలో గానీ, ఆ ఆగంతక స్త్రీ ప్రాధాన్యతను, జోక్యాన్ని కాదనలేకపోయారు.
ఇటువంటి కథలు మన ఇతిహాసాలలోనే కాదు మన మధ్యే చాలా జరుగుతున్నాయి అని గమనించవచ్చు. దీంతో కార్యకర్తలలో ఓ భయం ప్రవేశించింది. పత్రికలు ఎన్నెన్నో రాసి, ఏమేమో రాసి శాసనసభ్యుల్లో కూడా ఎన్టీ రామారావు పట్ల వ్యతిరేక భావన ఉద్భవించడానికి, మరింతగా వారిలో భయం పెరగడానికి కారకులు అయ్యారు. ఇంతే కాదు, ఈ సందర్భంలోనే ఎన్టీ రామారావు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో- ఎప్పుడూ ఏదో సంచలనం కావాలి కదా వారికి- అలా మన రాష్ట్రానికి ఓ స్త్రీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు .ఇంకేం? పైత్యం ముదిరింది తలకు రోకలిని చుట్టమనట్టుంది ఎన్టీ రామారావు ఇచ్చిన స్టేట్మెంట్లు.
ప్రభుత్వ కార్యక్రమాలలోనూ, నిర్ణయాల లోనూ, ఇంట్లోను ఆ ఆగంతక స్త్రీ పెత్తనం చెలాయిస్తున్న తీరునూ, అప్పటికే తల్లి పోయి దుఃఖిస్తున్న ఎన్టీ రామారావు పిల్లల్లోనూ, వీరితో పాటు శాసనసభ్యులను రెచ్చగొట్టి వీరందరినీ కూడగట్టి ఒకే అభిప్రాయ వేదిక మీదకు తీసుకు రాగలిగారు చంద్రబాబు. దటీజ్ చంద్రబాబు స్టైల్. అంతకు ముందు నుంచే చంద్రబాబు అంటే గిట్టని, కొంతకాలంగా దూరంగా ఉంటున్న పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు.
వైస్రాయ్ హోటల్ సాక్షిగా...
ఒకనాటి జనతా పార్టీ నాయకుడైన బాబుల్ రెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న వైస్రాయ్ హోటల్ లో కొంతకాలంగా ఎన్టీ రామారావు విధానాలు నచ్చక ప్రత్యేకించి ఆ ఆగంతక స్త్రీ వలలో పడిపోయి తమను నిర్లక్ష్యం చేస్తూ, తమ పార్టీని నిర్లక్ష్యం చేస్తున్న ఎన్టీ రామారావు చర్యలకు వ్యతిరేకంగా ఉన్న శాసనసభ్యులందరిని వైస్రాయ్ హోటల్ లోకి విజయవంతంగా చేర్చాడు చంద్రబాబు.
ఎన్టీ రామారావు లండన్ వెళ్లినప్పుడు... డబ్బులు తిని అరక్ (సారా) పాలసీని మార్చాడని- అప్పటికే అడ్వాన్స్ గా పత్రికల్లో రాయించి ఉన్నాడు చంద్రబాబు. అంతేకాదు, డబ్బులు తిని ఎన్టీ రామారావు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టులు ఇచ్చారని కూడా పత్రికలు ఎంతో ముందు చూపుతూ వార్తలు రాయించి, పేపర్లు చదువ కలిగిన ప్రజల మెప్పును మెండుగా పొంది నమ్మించగలిగాడు చంద్రబాబు.
ఎన్టీ రామారావు లండన్ నుంచి వచ్చాక ఇక్కడ తన అల్లుడు తనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిర్వాకాన్ని చూసి తట్టుకోలేక క్యాబినెట్ నుంచి చంద్రబాబు నాయుడు ను తరిమేద్దామని ప్రయత్నించారు కానీ పాపం తన బిడ్డ మొహం చూసి అంత పని చేయలేకపోయారు ఎన్టీరామారావు.
సరే, వైస్రాయ్ హోటల్ లో జరగవలసిన మంత్రాంగం, గూడుపుఠాణి జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ పోగవుతూనే ఉన్నారు. ఆనాటి రాజకీయాలపై చర్చించుకుంటూ ఎన్టీ రామారావు గురించి ఆగంతక మహిళామణి గురించి ఏవేవో వ్యాఖ్యలు చేసుకుంటూనే ఓ నిర్ణయానికి వచ్చారు శాసనసభ్యులు. ఏమైనా సరే, ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా ఉండనీయడానికి వీలు లేదు, ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు శాసనసభ్యులు చేసిన ఉద్బోధ.
ఇంకెం, శాసనసభ్యులంతా.. అబ్బా, చంద్రబాబు నాయుడుది ఎంత విశాల హృదయం, పార్టీ కోసం, పార్టీ శాసనసభ్యులు కోసం, ప్రజల కోసం తన మామ అని కూడా చూడకుండా తన మామను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలన్న చంద్రబాబు నాయుడు విశాల హృదయానికి ఉదాహరణ కాదా? అనుకున్నారు.
చంద్రబాబు నాయుడు మేదో పరిపక్వానికి, రాజనీతికి పరాకాష్ట కాదా? అనుకొని, శాసనసభ్యులందరూ ఎన్టీరామారావుని గద్దె దింపడానికి సై అంటే సై అని ఏకముఖంగా ప్రతిన పూనారు. ఇక్కడ ఈ దృశ్యం ఎలా ఉంటే అక్కడ ఎన్టీ రామారావు వైజాగ్ పర్యటనలో ఉన్నారు. ఇక చూడండి. ఈ దృశ్యాన్ని ఎంతగా ఎంత చక్కగా చిత్రించడం జరుగుతుందో!
ఎన్టీ రామారావు వెంట చంద్రబాబు నాయుడు.. జరుగుతున్న కుట్రలు గానీ, కుహకాలు కానీ తనకేమీ తెలియనట్టు, తాను కేవలం రామబంటు అన్నట్టుగానే తన మామ వెంట ఉంటూనే హైదరాబాద్ కి మామగారు తిరిగి రావడంతోనే ఐదారుగురు సీనియర్ మంత్రులను (మంత్రులనే కన్నా మంత్రగాళ్ళు అంటే ఏమైనా బాధపడతారా?) ఎన్టీ రామారావు దగ్గరికి పంపి, అయ్యా రామారావు, మీ ధోరణి ఫలానా విషయంలో మాకు నచ్చలేదు, మరీ విపరీతమైపోయిన మీ పనులు మాకు అసలు నచ్చలేదు,యమర్జంటుగా మీరు మీ కార్యక్రమాన్ని మానుకోవాలి? ఇదిగో ఇప్పటి నుంచి మీరు ఇలా చేయాలి? అలా మీరు చేస్తానంటేనే మేం నీ వెంట ఉంటాం, లేదంటే నీకు గుడ్ బై కొట్టేయగలం, ఆలోచించుకోమని బలంగానే తమ అభిప్రాయాన్ని చెప్పారు.
దీంతో నవరసాలు అద్భుతంగా పోషించగలరని- రక్తి కట్టించగలరని పేరున్న రామారావు కుపితుడై, కళ్ళల్లో రక్తం చిందిస్తూ.. అలాగా బాబులు! అలాగైతే, నేను అసెంబ్లీని రద్దు చేస్తానని, తన వద్దకు వచ్చిన ఆ ఐదారుగురు మంత్రులకు చెప్పి పంపించారు. ఇక్కడ చంద్రబాబును డైరెక్షన్ ఎంత పరిణితి చెందిందో గమనించండి!
తన మామ ఎన్టీ రామారావు అసెంబ్లీని రద్దు చేస్తానంటున్నాడు అనే మాటను వైస్రాయ్ హోటల్లో ఉన్న శాసనసభ్యులకు వినిపించి, వారితో పాటు మిగతా శాసనసభ్యులకు కూడ- ముఖ్యమంత్రి, హౌస్ ని రద్దు చేస్తానంటున్నాడు! ఇక మరి మన శాసనసభ సభ్యత్వాలు కూడా మురిగిపోతాయని, అలా పాపం శాసనసభ్యులను భయపెట్టి, రెచ్చగొట్టి, అందరిని కూడగట్టి, తన వైపు తిప్పుకొని, అలా వచ్చిన వారినందర్నీ, రాని వారందరినీ పిలిపించి, అందరినీ కట్టగట్టి వైస్రాయ్ అంతఃపురంలో దాచివేశారు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్!
తనను ఒకనాడు అమితంగా ఇష్టపడి గొప్పగా ప్రచారం చేసిన పత్రికలే ఈనాడు, తనపై- తన ఆంతరంగిక విషయాలపై- తన రాజకీయ జీవితంపై నీలి నీడలు పరుస్తూ, తనకు వ్యతిరేకంగా, ప్రజలను చైతన్య పరుస్తూ వస్తున్న విషయం ఎన్టీ రామారావు కేమాత్రమూ అవగతం కాలేదు. ఆనాటి మైకం, తమకం అటువంటిది. రామారావు పరిస్థితి కుడితిలో పడిన ఎలక మాదిరిగా, బోనులో చిక్కిన పులిలా తయారైంది.
ఏ ప్రజలైతే తనను కావాలని అపురూపంగా ఆహ్వానించి గౌరవించారో అదే ప్రజలు ఈనాడు తనను ఛీ అని తూలనాడడం ఎన్టీ రామారావుకు దుస్సహమైంది.
రాముడిగా ఎన్టీ రామారావు నటనను కీర్తించిన ప్రజ, రాముణ్ణి ఆరాధించినట్టుగానే తననీ ఆరాధించిన ప్రజలు, రాముడిలాగే ఏకపత్నీవ్రతుడనీ, ఆదర్శవంతుడనీ భావించారు. తమకు ఆదర్శమని అనుకున్నారు. ఇప్పుడిదేమిటీ? గురుడు, ఈ వయసులో స్త్రీవలలో పడిపోయారు? ఈమె కనుసనల్లోనే మెలుగుతున్నాడు ఏమిటీ? అనుకుని ప్రజలందరూ ఎన్టీ రామారావును అసహ్యించుకున్నారు.
ఎన్టీ రామారావు చేసిన పనికి అభ్యంతర పెట్టారు. అంతేకాదు, ఎన్టీ రామారావు చేసిన పనికి తమ అసమ్మతిని ఘాటుగానే తెలిపారు. అంతేకాదు, ఎన్టీ రామారావు చేసిన పని ఎడల తమ ఏహ్యభావాన్ని కూడా చక్కగా ప్రదర్శించారు. తాము ఎంతగానో ఆరాధించిన ఎన్టీ రామారావుని ఈ పరిస్థితుల్లో భరించలేని స్థితికి ప్రజలు చేరుకున్నారు.
దైన్యంతో ఎన్టీరామారావు వినతి...
ఎన్టీ రామారావు దంపతులు హైదరాబాదులో రెండు మూడు చోట్ల ఊరేగి, సాయం సమయానికి చైతన్య రథం మీద నిలబడి ఓ కొత్త ప్రదర్శన నిర్వహించారు. వైస్రాయ్ హోటల్ నుంచి శాసనసభ్యులను బయటకు రమ్మని ఎంతో ఆర్తిగా, దైన్యంగా ప్రాధేయ పూర్వకంగా, గాద్గిదికమైన గొంతుకతో- ఇలా ఎన్ని హావభావాలో చూపిస్తూ- అర్థించినా, వైస్రాయ్ నుంచి వచ్చిన జవాబు రాళ్లు, చెప్పులు, ఉమ్మి వేయడాలు, నానా దుర్భాషలు, నలుగురిలో అనుకోడానికి వీలేలేని తెలుగు భాషా పదాలు వాడి ఆయనకు శాస్తి చేసి తిరుగుముఖం పట్టించారు ఎన్టీ రామారావు అనుంగు తమ్ముళ్లు.
1984లో తను చేసిన విపరీతానికి ఇది శాస్తా అన్నట్టుగా ఎన్టీరామారావు కి తగు రీతిలో పాఠం చెప్పి పంపారు గౌరవనీయ శాసనసభ్యులు.
పాపం, భార్యాభర్తలిద్దరూ జరిగిన దానికి, జరుగుతున్న దానికి, ఏడ్చారు, గోల పెట్టారు. అయ్యో, దేవుడా అన్నారు. కుమిలి కుమిలి ఏడ్చారు లోలోపల.
ఎంత ఏడిస్తేనేం.. చేతులు కాలిక ఆకులు పట్టుకుని ఏం లాభం? రావణాసురడంత పరాక్రమవంతుడే, స్త్రీ బలహీనత ఉండటం కారణంగా కదా ఘోరంగా రాజ్యాన్ని కోల్పోయింది. బంధువులనూ, ప్రాణాల్నీ కోల్పోయింది. అయ్యో, ఇక్కడా అంతే జరుగుతుందా? ఏమో?
ఎన్టీ రామారావు చేసిన కేవలం ఒకే ఒక్క ఘోర అపరాధానికి ఏ పరిస్థితులు కల్పింపబడుతున్నాయో, మరే విపరీత సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుందో? మనం గతంలో ఎన్నో వదంతాలను వినిఉన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం.
బిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఏకమైపోయారు. అందరూ కట్టకట్టుకుని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే క్రతువులో పాల్గొన్నారు. తెలుగునాట ఏ కుటుంబంలోనైనా ఎన్నడైనా ఇంత సమైక్యత వెల్లి విరిసిందా? ఏమో, ఇక్కడ వీరిలో సమైక్యత మూడు పూవులు ఆరు కాయలుగా కాసింది. ఎందుకు?
తనను ఎంతో ప్రేమతో పెంచుకున్న తన తండ్రి అని ఎన్టీ రామారావు పిల్లలు - తమ తల్లి చనిపోగానే పరాయి స్త్రీని చేరదీస్తాడా? పైగా వివాహం కూడా చేసుకుంటాడా? అదీ ఈ వయసులో అని ఎన్టీ రామారావు సంతానం కుపితులై ఉంటే, తమ అత్త చనిపోగానే ఈ ఆస్తిపాస్తులనూ- ఈ ప్రభుత్వాన్ని, ఈ అందలాలను, ఈ అధికారాన్ని రెండో భార్యకు అప్పగిస్తారా తమ మామ? అని అల్లుళ్లు, కోడళ్ళు అనుకుని వారిలో ఈర్షతో వెల్లివిరిసిన సమైక్యతారాగం తప్ప- ఈ సమైక్యత ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండేదేమీ కాదు అని నాదెండ్ల భాస్కరరావు తన పుస్తకంలో రాసుకున్న విషయం.
ఆ తర్వాత ఎన్టీరామారావు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేకపోతారు. అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో చంద్రబాబు నాయుడు 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా సింహాసనంపై కూర్చొన్నారు. ఆ తర్వాత ఎన్టీరామారావు కోర్టుల చుట్టూ తిరుగుతారు. చివరకు మంచం పట్టారు. 1996 జనవరి 18న కన్నుమూస్తారు.
నాదెండ్ల భాస్కరరావు ఊహించినట్టే ఎన్టీరామారావు కుటుంబ సభ్యుల్లో చీలిక వచ్చింది. లక్ష్మీపార్వతి ఒంటరయ్యారు. ఆమె వద్ద ఉన్న ఎన్టీఆర్ ఆస్తుల్ని కొందరు లాగేసుకున్నారు. చంద్రబాబు నాయుడిపై సుదీర్ఘకాలంగా పోరాడినా ఆమె ఆయన్ను ఏమీ చేయలేకపోయారు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె వార్తల్లో వ్యక్తిగా మాత్రం మిగిలారు.
ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారు?
దేవుడు లాంటి ఎన్టీఆర్ కు ఒక దరిద్రం పట్టిందని, ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితమంతా మారిపోయిందని ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలే మరో నటుడు మోహన్ బాబు కూడా అన్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి ఓ పథకం ప్రకారమే ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించి ఆయన్ను నాశనం చేసిందన్నారు. ఈ సందర్భంలో ఆమె పేరును "లపాకీ" అన్నారు. నిజానికి ఈ పదం అసభ్యకరమైంది. లక్ష్మీపార్వతిని లపాకీ అనే సంక్షిప్త నామంతో పిలవడం సంస్కారం కాదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
Next Story