
బీవీ రాఘవులు (ఫైల్ ఫోటో)
సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసు నుంచి బీవీ రాఘవులు ఎందుకు తప్పుకున్నారు?
సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవికి ఈనెల 6న జరుగనున్న ఎన్నిక/ఎంపిక నుంచి బీవీ రాఘవులు తప్పుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సరికొత్త పేర్లు తెరపైకి వచ్చాయి..
సంక్లిష్టమైన సవాళ్ల మధ్య సీపీఎం 24వ జాతీయ మహాసభలు తమిళనాడులోని మధురైలో ఏప్రిల్ 2న ప్రారంభమయ్యాయి. వందలాది మంది కార్యకర్తల కవాతు, నవభారత నిర్మాణానికి పిలుపుల మధ్య అట్టహాసంగా మొదలైన ఈ మహాసభలు ఏప్రిల్ 6న ముగుస్తాయి. మహాసభల చివరి రోజున దేశం యావత్తు ఎదురుచూస్తున్న సీపీఎం నూతన నాయకత్వ ఎన్నిక లేదా ఎంపిక జరుగుతుంది. ఇంటా బయట తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సీపీఎంకు వచ్చే మూడేళ్ల కాలానికి సరైన దిశానిర్దేశం చేసి పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా కృషి చేసే నాయకత్వ బాధ్యతను ఎవరు చేపడతారా? అనే ఆసక్తి సర్వత్రా కాకపోయినా వామపక్ష అభిమానుల్లో నెలకొంది.
గతంలో ఎన్నడూ లేనంతగా...
గత మహాసభల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి నాయకత్వ సమస్య ఎదురైనట్టు సమాచారం. పార్టీ సొంతంగా పెట్టుకున్న నిబంధనలు, కొత్త క్యాడర్ నుంచి వస్తున్న సవాళ్లు, రోజురోజుకూ పార్టీ కుచించుకుపోతున్న తీరు, మరోవైపు గ్లోబలైజేషన్, హిందూమతోన్మాదుల తాకిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీపీఎంకు నూతన నాయకత్వ ఎంపిక ఈసారి కత్తిమీద సామే. పార్టీని పూర్తిగా సంస్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ దశలో జరుగుతున్న 24వ పార్టీ మహాసభ - నాయకత్వ పరివర్తనకు సిద్ధమైంది.
సీతారాం ఏచూరి బతికున్నా...
సీతారాం ఏచూరి ఆకస్మిక మరణంతో ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరితో భర్తీ చేస్తారనే అంశమూ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సీతారాం ఏచూరి బ్రతికుంటే ఈ మహాసభలో ఆయనే కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టేవారే తప్ప మళ్లీ ప్రధాన కార్యదర్శి అయ్యేవారు కాదు. సీపీఎంలో 3 సార్లు కంటే ఎక్కువసార్లు ప్రధాన కార్యదర్శి కావడానికి వీలులేదు. ఈ మహాసభకు ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. ఏడుగురు సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు వైదొలగబోతున్నారు. 9 ఏళ్ల తరువాత సీపీఎంకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు.
పార్టీ చీలిన తర్వాత ఈ ఐదుగురే...
సీపీఐ నుంచి సీపీఎం చీలిన తర్వాత 1964 నుంచి ఇప్పటి వరకు పుచ్చలపల్లి సుందరయ్య, ఇఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శులుగా పని చేశారు. ఆరు దశాబ్దాల కాలంలో ఐదుగురు నాయకత్వం వహిస్తే వారిలో ఇద్దరు- సుందరయ్య, ఏచూరి తెలుగువాళ్లు. ఇప్పుడు ఆరోసారి మరో సరికొత్త నాయకుణ్ణి 24వ మహాసభ ఎన్నుకోబోతోంది.
సీపీఎం నాయకత్వం 75 ఏళ్ల వయోపరిమితిని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక బాడీ అయిన పాలిట్ బ్యూరోలో సగానికి పైగా 75 ఏళ్లు దాటిన వారే. సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్, ఆయన భార్య బృందా కారత్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సుభాషిణీ ఆలీ సహ పలువురు పొలిట్ బ్యూరో నుంచి వైదొలగనున్నారు. తాను పాలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టు 77 ఏళ్ల బృందా కారత్ 2025 మార్చి 20న చెన్నైలో ప్రకటించారు. దీన్నిబట్టి జాతీయ స్థాయిలో వయోపరిమితిని పార్టీ కచ్చితంగా అమలు చేయబోతున్నట్టు స్పష్టమవుతోంది. అందువల్లే ప్రస్తుతం పార్టీ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా పని చేస్తున్న ప్రకాశ్ కారత్ కు వయోపరిమితి నిబంధనను సడలించి మళ్లీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు సూచించినా ఎక్కువ మంది వ్యతిరేకించారని సమాచారం. ప్రస్తుతం కారత్ వయసు 78 ఏళ్లు.
23వ మహాసభలో పాలిట్ బ్యూరో సభ్యులు వీరే..
కేరళలోని కన్నూరులో జరిగి పార్టీ 23వ మహాసభలో 17 మంది సభ్యులతో కూడిన పాలిట్ బ్యూరోను ఎన్నుకుంది. వారిలో కొడియేరి బాలకృష్ణన్, సీతారాం ఏచూరి చనిపోయారు. వారి స్థానంలో కొత్తగా ఎవర్నీ భర్తీ చేయలేదు. దీంతో ఆ సంఖ్య 15కి తగ్గింది. ఆ మహాసభల్లో సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శి అయ్యారు. తొలిసారి రామచంద్ర డోమ్ అనే దళిత నాయకుడు పొలిట్‌బ్యూరోలోకి ప్రవేశించించారు. ఇదో చారిత్రాత్మక మైలురాయిగా పార్టీ వర్గాలు చెబుతుంటాయి.
ప్రకాశ్ కారత్, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుతం ప్రకాష్ కారత్ (ఢిల్లీ కేంద్రం), పినరయి విజయన్ (కేరళ), బృందా కారత్ (ఢిల్లీ కేంద్రం), మాణిక్ సర్కార్ (త్రిపుర), సూర్యాకాంత మిశ్రా (పశ్చిమ బెంగాల్), జి. రామకృష్ణన్ (తమిళనాడు), సుభాషిణి అలీ (ఢిల్లీ కేంద్రం), బి.వి.రాఘవులు (ఆంధ్రప్రదేశ్), మహ్మద్ సలీం (పశ్చిమ బెంగాల్), ఎంఏ బేబీ (కేరళ), తపన్ కుమార్ సేన్ (ఢిల్లీ కేంద్రం), నీలోత్పల్ బసు (ఢిల్లీ కేంద్రం), రామ్ చంద్ర డోమ్ (పశ్చిమ బెంగాల్), ఎ. విజయరాఘవన్ (కేరళ), అశోక్ ధావలే (మహారాష్ట్ర), ఎం.వి. గోవిందన్ (కేరళ) ఉన్నారు.
రిలీవ్ కానున్న ఏడుగురు పొలిట్ బ్యూరో సభ్యులు వీరే..
75 ఏళ్ల వయో నిబంధన ప్రకారం ప్రస్తుత పాలిట్ బ్యూరో సభ్యుల్లో ప్రకాష్ కరత్ నుంచి సుభాషిణి అలీ వరకు ఏడుగురు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు రిలీవ్ కాబోతున్నారు. ప్రకాష్ కారత్ (77), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (79), బృందా కారత్ (77), త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ (76), సూర్యాకాంత మిశ్రా (75), సుభాషిణి అలీ (77), జి.రామకృష్ణన్ (75)లు రిలీవ్ అయ్యే అవకాశముంది.
పొలిట్ బ్యూరోలో భారీ మార్పులు..
కేంద్ర కమిటీ సభ్యులకు 75 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించారు. 88 మందితో కేంద్ర కమిటీ, అవసరాన్ని బట్టి శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఐదుగురితో కంట్రోల్ కమిషన్ ఉంటుంది. పార్టీకి కేంద్ర కమిటీ గుండెకాయ లాంటిది. దీనిలో నుంచే పాలిట్ బ్యూరో సభ్యుల్ని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు.
వివిధ అంశాలపై పార్టీ వైఖరిపై చర్చలు, భవిష్యత్తు దిశానిర్దేశం, పదవీ విరమణ చేసే కేంద్ర కమిటీ కొత్త సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమించడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి చెందిన పాలిట్ బ్యూర్యో సభ్యుడు బీవీ రాఘవులు నేతృత్వంలో నియమించిన కమిటీ కొన్ని పేర్లతో ఓ ప్యానెల్‌ను సిఫార్సు చేసింది. దాని ప్రకారంగా పార్టీ కేంద్రకమిటీ, పాలిట్ బ్యూరోలో మార్పులు చేర్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర కమిటీ వరకు 75 ఏళ్ల వయోపరిమితి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పాలిట్ బ్యూరో విషయంలోనే సమస్య ఎదురుకావొచ్చునని భావిస్తున్నారు.
వయో నిబంధన అమలయితే పాలిట్ బ్యూరో నుంచి - ప్రకాష్ కారత్, బృందా కారత్, సుభాషిణి అలీ, మాణిక్ సర్కార్, సూర్యకాంత్ మిశ్రా, పినరయి విజయన్, రామకృష్ణన్ - తప్పుకోవాల్సిందే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దేశంలోని ఏకైక సీపీఎం సీఎం అయినందున ఆయనకు మినహాయింపు ఇస్తారా? లేక గతంలో జ్యోతి బసును పిలిచినట్టే పొలిట్ బ్యూరోకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తారా అనే దానిపై పార్టీలో తర్జనభర్జన జరుగుతోంది.
ఎవరెవరితో భర్తీ చేయవచ్చు..
మిగిలిన 6 పాలిట్ బ్యూరో ఖాళీలను భర్తీ చేయడానికి సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సంఘ్ (AIKS) జనరల్ సెక్రటరీ విజూ కృష్ణన్, పార్టీ అంతర్జాతీయ విభాగానికి డిప్యూటీ ఇన్‌చార్జ్ గా ఉన్న అరుణ్ కుమార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుజన్ చక్రవర్తి, మహిళా నాయకులలో తమిళనాడుకు చెందిన యు వాసుకి, కె హేమలత, మరియం ధవాలే, కె.కె. శైలజ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓ దశలో తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న తమ్మినేని వీరభద్రం పేరు వినిపించినా కే.హేమలత పేరు తెరపైకి రావడంతో ఇప్పుడు ఆయన పేరు పరిశీలనలో లేదని తెలిసింది.
కేంద్ర కమిటీ పునర్వ్యవస్థీకరణ..
ఢిల్లీలో 2025 మార్చి 22న సమావేశమైన సీపీఎం కేంద్ర కమిటీ- బీవీ రాఘవులు కమిటీ సమర్పించిన పార్టీ సంస్థాగత నివేదికను సమీక్షించింది. కేరళకు చెందిన పలువురు సీనియర్ నాయకులు - పినరయి విజయన్, ఎ.కె. బాలన్, పి.కె. శ్రీమతి - వయోపరిమితి కారణంగా కేంద్ర కమిటీ నుంచి వైదొలగనున్నారు. అయితే, మహిళా సంఘం అఖిల భారత అధ్యక్షురాలిగా శ్రీమతిని కొనసాగించే సూచనలు ఉన్నాయి.
పార్టీ కాంగ్రెస్‌కు సంబంధించి ప్రధాన బాధ్యతలు ఉన్నందున, అనుభవజ్ఞుడైన నాయకుడు , మాజీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ కారత్‌ను ప్రస్తుతానికి పార్టీ వ్యవహారాలను నిర్వహించమని కోరవచ్చని వర్గాలు తెలిపాయి. బృందా కారత్ జాతీయ రాజకీయాల్లో పేరున్న వ్యక్తి కనుక ఆమెకు ఏవైనా బాధ్యతలు అప్పగించవచ్చని ఒక వర్గం భావిస్తోంది.
ప్రధాన కార్యదర్శిగా...
పూర్తి జనరల్ సెక్రటరీగా కొత్త ముఖాన్ని ఎంపిక చేసుకోవాలని సీపీఎం నిర్ణయించుకుంటే, ఇప్పుడున్న పాలిట్ బ్యూరో నుంచే తీసుకోవాలనుకుంటే ఎంఏ బేబీ, బివి రాఘవులులో ఒకర్ని ఎంపిక చేసుకోవాలి. వీళ్లిద్దరికీ 75 ఏళ్ల వయోపరిమితి వర్తించదు.
“ఏచూరి వారసుడిగా ఉండాలంటే, పార్టీకి ఇతర ప్రతిపక్ష పార్టీలలో కూడా ఆమోదయోగ్యమైన ముఖంగా ఉండే నాయకుడు కావాలి. ముఖ్యంగా సంకీర్ణ రాజకీయాల దృష్యా ఇది అవసరం. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో అవగాహన కలిగి ఉండాలనే రాజకీయ విధానం, పార్టీలోని వివాదాలను సర్దుబాటు చేయగల సత్తా కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని ఓ కేంద్ర కమిటీ సభ్యుడు అన్నారు. అందుకు భాష కూడా అవసరమేనని అభిప్రాయపడ్డారు.
పార్టీ కొత్త ముఖాన్ని ఎంచుకుంటే, ఆంధ్ర నాయకుడు రాఘవులు. కేరళ నాయకుడు బేబీ. పశ్చిమ బెంగాల్ నాయకుడు నీలోత్పల్ బసు. ఎంఏ బేబీ లేదా నీలోత్పల్ బసు ఎంపిక కావాలంటే కచ్చితంగా ఆయా రాష్ట్ర పార్టీల ఆమోదం అవసరం. అక్కడ వాళ్లకు సమస్యలు ఉన్నాయి. అదే బీవీ రాఘవులుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏమాత్రం అభ్యంతరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శి. ఆయనకు మంచి అవకాశం ఉన్నా రాఘవులు అంతటి పెద్ద పోస్టుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది.
ప్రధాన కార్యదర్శి పదవి వద్దన్న బీవీ రాఘవులు!
రిలీవ్ అయ్యే నేతలను మినహాయిస్తే, మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీ రాఘవులు సీనియర్. 75 వయోనిబంధన ఆయనకు వర్తించదు. 1995లో బీవీరాఘవులు చంఢీఘడ్ లో జరిగిన 15వ జాతీయ మహాసభల్లో పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 2005లో న్యూఢిల్లీలో జరిగిన పార్టీ 18వ జాతీయ మహాసభలో తొలిసారి పాలిట్ బ్యూరోకి ఎంపికయ్యారు. ఆయనే తదుపరి ప్రధాన కార్యదర్శి అవుతారని చర్చ కూడా సాగింది. అయితే అనారోగ్యం వల్ల ఆయన ప్రధాన కార్యదర్శి రేస్‌లోంచి తప్పుకున్నట్లు సమాచారం. భాషా పరమైన ఇబ్బందులు కూడా ఆయనకు ప్రతిబంధకం అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
(లేట్) సీతారాం ఏచూరి (సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి)
రాఘవులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పెదమోపాడు గ్రామంలో వెంకట సుబ్బయ్య, పున్నమ్మ దంపతులకు జన్మించారు. పాఠశాల విద్యను స్వగ్రామంలో పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్ ను గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. బాపట్ వ్యవసాయ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో చేరి అనివార్య కారణాలతో అక్కడ మానివేసి కావలిలో బి.ఎ.లో చేరాడు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిండంతో చదువును మధ్యలో ఆపేసి ఆ తర్వాత పూర్తి చేశారు. పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులో హోల్ టైమర్ గా పనిచేశారు. ఆయన భార్య పుణ్యవతి కూడా పార్టీ నాయకురాలే.
కొత్తగా తెరపైకి అశోక్ ధావలే..
సీపీఎం ప్రధాన కార్యదర్శి రేసులోకి సరికొత్త పేరు వినిపిస్తోంది. ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) అధ్యక్షుడు అశోక్ ధావలే పార్టీ జనరల్ సెక్రటరీ రేసులో ముందంజలో ఉన్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లోనూ చాలా చురుగ్గా ఉన్నారు. నాసిక్-ముంబాయి కిసాన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో చారిత్రత్మాక రైతు ఉద్యమం ఆయన నాయకత్వంలోనే సాగింది. ఆయన మహారాష్ట్రకు చెందినప్పటికీ, ఢిల్లీ కేంద్రంలో ఉండి పని చేస్తున్నారు. రైతు పోరాటాలు, హిందీ బెల్ట్‌లో పార్టీ సంస్థాగత పనులకు ఆయన చేసిన కృషి ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. సీపీఎం ప్రభావం తక్కువగా ఉన్న మహారాష్ట్ర మూలాలు ఆయనకు ప్రతిబంధకం కాకుంటే ఆయనకు ఈ పదవి దక్కవచ్చునని భావిస్తున్నారు.
ఇక, సీపీఎం పశ్చిమ బెంగాల్ కార్యదర్శి ఎండీ సలీం కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కూడా గతంలో ఢిల్లీ కేంద్రంగా పని చేశారు. అయితే ఆయన ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉండటంతో ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు అవకాశాలు లేవు. పశ్చిమ బెంగాల్ యూనిట్ తన అభ్యర్థి కోసం ఒత్తిడి తెస్తే, ట్రేడ్ యూనియన్ నాయకుడు అయిన సేన్ లేదా సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం కంటే నిలోత్పల్ బసు వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఏచూరితో కలిసి పని చేసిన అనుభవం, ఎన్నికల ఎత్తుగడలు ఆయనకు కలిసివచ్చే అంశం.
మరో బలమైన పోటీదారు ఎంఏ బేబీ..
మరో పోటీదారుడు, ప్రస్తుతం పార్టీ అంతర్జాతీయ విభాగానికి బాధ్యత వహిస్తున్న ఎం.ఎ. బేబీ. కేరళ యూనిట్ ఆయన అభ్యర్థిత్వం కోసం ఒత్తిడి తెస్తే ఆయన ఇఎంఎస్ నంబూద్రిపాద్ తర్వాత మొదటి మలయాళీ జనరల్ సెక్రటరీ కావచ్చు. పార్టీ చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై బేబీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ సీఎం పినరయి విజయన్ నిర్ణయంపై ఎంఏ బేబీకి అత్యున్నత పదవి దక్కే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. నాలుగు దశాబ్దాల క్రితం బేబీ స్థానంలో SFI జాతీయ అధ్యక్షుడిగా ఏచూరి ఎన్నికయ్యారు. ఇప్పుడు బేబీ ఏచూరి స్థానంలో ఎన్నికైతే అది యాధచ్చికం కావచ్చు.
ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన అవకాశాన్ని బీవీ రాఘవులు తోసిపుచ్చడం పట్ల ఆయన అభిమానులు పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story