JANASENA| చంద్రబాబే మరో 10 ఏళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ ఎందుకన్నట్టు?
x

PAWAN KALYAN & CHANDRABABU

JANASENA| చంద్రబాబే మరో 10 ఏళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ ఎందుకన్నట్టు?

రాజ్యాధికారమే లక్ష్యంగా పుట్టిన ఓ రాజకీయ పార్టీ మరోపార్టీని అధికారంలో కొనసాగమని కోరుతుందేమిటీ? పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల అర్థమేమిటీ?


"ఈ ఐదేళ్లే కాదు, వచ్చే పదేళ్లూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలి.. పాలనలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి" అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అసెంబ్లీ సాక్షిగా నవంబర్ 20న చేసిన ప్రకటన జనసేన శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టింస్తోంది. ఈ లెక్కన మొత్తం 15 ఏళ్లు తెలుగుదేశం పార్టీ జెండా మోయడమే పనిగా పెట్టుకోవాల్నా? ఇలా అయితే పార్టీ భవిష్యత్ ఏమిటీ, తమ గతేమిటనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పవన్ కల్యాణ్ సామాజిక వర్గీయులైతే తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేని బీజేపీ లాంటి పార్టీ నేతలు ఈ మాటంటే పర్వాలేదు గాని ప్రజాతీర్పునే తారుమారు చేయగల సత్తా ఉన్న జనసేన లాంటి పార్టీ అధినేతే.. పలానా వ్యక్తే పదేళ్లు ముఖ్యమంత్రి.. అంటే ఎలా అని వాపోతున్నారు జనసైనికులు.

150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై అసెంబ్లీలో నవంబర్ 20న చర్చ జరిగింది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ నేతలే ఎక్కువగా మాట్లాడారు. చంద్రబాబు పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు పోటాపోటీగా ప్రశంసలతో ముంచెత్తారు. మరో పదేళ్లు చంద్రబాబు పాలన కావాలని పవన్, కలకాలం కొనసాగాలని విష్ణుకుమార్ రాజు ఆకాంక్షించారు.
పవన్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటీ?
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "అనుభవంతో కూడిన ఆయన (చంద్రబాబు) 150 రోజుల పాలన చూశాక.. రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసం కలిగింది" అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటీ? అన్నది ఇప్పుడు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
పవన్ కల్యాణ్ ప్రకటన తమను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందని అన్నారు గుంటూరు జిల్లాకు చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త ఇక్కుర్తి నరేష్ అన్నారు. రాజ్యాధికారంతోనే ఏ వర్గమైనా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత తరుణంలో రాజకీయ ప్రాధాన్యత ఉంటేనే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబే వచ్చే 15ఏళ్లు ముఖ్యమంత్రి అంటే పవన్ ను నమ్ముకున్న బీసీ, ఎస్సీ వర్గాలు ఏమి కావాలని ప్రశ్నించారు. రాజ్యాధికారం చేపట్టాల్సిన వ్యక్తి ఇంకెవరికో పని చేస్తానన్నట్టుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
"తనను తాను తగ్గించుకుంటున్నారా?"
‘ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా.. అందులో తెలుగువారు సగానికి పైగా ఉండటానికి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణం’ అని ప్రశంసిస్తున్న పవన్ కల్యాణ్ "తనను తాను తగ్గించుకోవాలనుకున్న" బైబిల్ సూక్తినే పాటిస్తున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా ఉండాలన్న దానికి చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తారు.. విజయవాడ వరదల సమయంలో.. ఆయన స్వయంగా ప్రజలకు భరోసా ఇవ్వడంతోపాటు, అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు అభినందనీయం’ అన్నారు పవన్‌ కల్యాణ్‌. చంద్రబాబు అలాంటి వ్యక్తే అయితే తాను ఉంటున్న తాడేపల్లి కరకట్ట నివాసం మునిగిందో లేదో ఎందుకు చెప్పలేదన్న చిటపటలూ వినిపించాయి. ‘150 రోజుల పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం’ జరిగితే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన వారూ లేకపోలేదు.
సీఎం పీఠంపై ఆశలు వదిలేశారా?
అధికారంలో వాటా కోరాల్సిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నేత జి. రామారావు తప్పుబట్టారు. జనసేన శ్రేణుల మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నది వాస్తవం కాదా? పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిన పార్టీ నేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన ఆ మాటల అర్థమేమిటీ అని పీఆర్పీలో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్ నాయకుడు ప్రశ్నించారు. మంచి పాలన అందించినపుడు ఎవర్నైనా కీర్తించడంలో తప్పు లేదని, అయితే ఓ రాజకీయ పార్టీకి సాక్షాత్తు అధినేతగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో "ఈ ఐదేళ్లే కాదు, వచ్చే పదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలి" అంటే తన రాజకీయ పార్టీని తోకపార్టీగానే ఉంచుతారా? అన్నారు.
కాపుల అస్థిత్వం ఏమవుతుందీ?
పవన్ కల్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా ఆవేళ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పీఆర్పీ అయినా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టిన జనసేనకైనా పునాది కాపులే. రాష్ట్రంలో సుమారు 22 శాతంగా ఉన్న కాపులు తమ అస్థిత్వ పోరాటంలో భాగంగానే వీళ్లు పెట్టిన పార్టీలకు మద్దతు ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడానికైనా 2024 ఎన్నికల్లో గెలవడానికైనా కాపులు ప్రధాన పాత్ర పోషించారన్నది వాస్తవం అన్నారు విజయవాడకు చెందిన కటకంశెట్టి శ్రీనివాసరావు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను కూడా ఖాతరు చేయకుండా కోస్తాంధ్ర కాపులు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వైపు నిలిచారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబును భేషరతుగా మరో 15 ఏళ్లు 'మీరే ముఖ్యమంత్రి' అనడమంటే ఓ విధంగా 'భావదాస్యం' అన్నారు కాపునాడు రాష్ట్ర నేత సీహెచ్ ప్రవీణ్.
టీడీపీలో హవా తగ్గిందా?
పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మూడు సందర్భాలలో స్వతంత్రంగా వ్యవహరించడం, తనంతట తానే సనాతన ధర్మ సంరక్షణకు పూనుకుంటున్నానని ప్రకటించడం, హోంమంత్రిని అవుతానని చెప్పడం బహిరంగ ప్రకటనలతో చంద్రబాబు దేశవ్యాప్తంగా ఇరుకున పడే పరిస్థితి వచ్చిందని, ఎన్డీఏ కూటమిలో తానే కింగ్ మేకర్ని అనే అభిప్రాయం కలిగేలా వ్యవహరించడం వంటి కారణాలతో పవన్ కల్యాణ్ ను కట్టడి చేయాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కొంతకాలంగా పవన్ కల్యాణ్ తో టీడీపీ సీనియర్లు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తాను చంద్రబాబుకు విశ్వాసపాత్రుణ్ణే అని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో ఈ ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాన్ని ఓ కాపు నాయకుడు వ్యక్తం చేశారు.
డెప్యూటీ హోదాతో సరిపెట్టుకుంటారా?
2024 ఎన్నికల తర్వాత కనీసం చివరి రెండేళ్లయినా పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్న జనసైనికులకు ప్రస్తుత వ్యాఖ్యలు ఏమాత్రం మింగుడుపడడం లేదు. డెప్యూటీ ముఖ్యమంత్రితోనే సరి పెట్టుకోవాలనుకుంటున్నారా? అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు గొప్ప దార్శనికత, పారదర్శకతను ఎవ్వరూ ప్రశ్నించడం లేదని, ప్రస్తుతం నడుస్తున్నది సంకీర్ణ రాజకీయాల యుగమని, ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా గుర్తించి తన పార్టీ గుర్తింపును కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు.

మహారాష్ట్రలో శివసేన చీఫ్ బాల్ థాక్రే మాదిరే కింగ్ మేకర్ గా ఉండదలచుకున్నప్పుడు పవన్ కల్యాణ్ అసలు ప్రభుత్వంలోనే చేరకుండా ఉంటే బాగుండేదన్న సైటెర్లు వేస్తున్నారు కొందరు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ ఆ మాటలు ఎందుకు చెప్పారో, వాటి వెనకున్న ఉద్దేశమేమిటీ ఆయన చెబితేనే సామాన్యులకు అర్థమవుతుంది.
అప్పటికి బాబుకి 90, పవన్ కి 70...
జనసేన పార్టీ పెట్టి ఇప్పటికి 12 ఏళ్లు పూర్తయింది. మరో 15 ఏళ్లు కూడా అధికార పీఠానికి దూరంగా ఉండాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అంటే అప్పటికి చంద్రబాబుకు 90 ఏళ్లు వస్తాయి. అప్పటికి పవన్ కల్యాణ్ కి 70 ఏళ్లు వస్తాయి. అప్పుడు పవన్ కల్యాణ్ కి ఛాన్స్ వచ్చినా- వరుసగా మూడు సార్లు అధికారంలో ఉండే పార్టీలకు అనివార్యంగానే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఎవరు గెలుస్తారో, అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఊహించలేం. అందువల్ల పవన్ కల్యాణ్ పునరాలోచన చేయాలని జనసైనికులు కోరుతున్నారు.
Read More
Next Story