‘కేంద్రం నుంచి సాయం తేవాలి.. లేకుంటే కూటమిని వీడాలి’
x

‘కేంద్రం నుంచి సాయం తేవాలి.. లేకుంటే కూటమిని వీడాలి’

ప్రధాని మోదీ టార్గెట్‌గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. ఏపీని అన్ని విధాలా మోసం చేశారంటూ మండిపడ్డారు.


ప్రధాని మోదీ టార్గెట్‌గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ.. ఏపీని అన్ని విధాలా మోసం చేశారంటూ మండిపడ్డారు. వరదలు వచ్చి విజయవాడ అతలాకుతలమైనా ప్రధాని మోదీ స్పందించలేదని, వరద బాధితుల కోసం ఇప్పటి వరకు కేంద్రం ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదని ధ్వజమెత్తారు. వరద పరిస్థితులను పరిశీలించాలని కేంద్ర మంత్రిని ఏపీ, తెలంగాణకు పంపి ప్రధాని చేతులు దులుపుకున్నారని, ఇప్పటి వరకు కనీసం స్పందించను కూడా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లైనా సాయం తీసుకురావాలని, లేకుంటే ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజేశ్వరి పేటలో ఈరోజు షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించారు.. వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు బట్టలు పంచారు. ఈ సందర్భంగానే ఏపీకి అందిన వరద సహాయంపై ఘాటుగా స్పందించారు.

‘‘కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రావడంలో ఏపీ నుంచి గెలిచిన ఎంపీల పాత్ర కీలకంగా ఉంది. అధికారం చేతికి రాగానే ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోయింది. ఇది సరైన పద్దతి కాదు. ఎక్కడెక్కడో తిరిగే ప్రధానికి.. ఇంతటి విపత్తును ఎదుర్కొన్న ఏపీని సందర్శించడానికి మాత్రం సమయం లేదు. అధికారం ఇచ్చిన ఏపీపై మోదీ చిన్న చూపు దేనికి సంకేతం? కేంద్రంలో కూడా బీజేపీతో కలిసి ఉండటం వల్ల ఏపీకి ఒరిగింది ఏమీ లేదు? ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలకు సమాధానమివ్వాలి. ఢిల్లీకి వెళ్లైనా కేంద్రం నుంచి ఏపీకి వరద సహాయం తీసుకురావాలి. లేని పక్షంలో కూటమి నుంచి వైదొలగాలి’’ అని సూచించారు షర్మిల.

తాగునీరుకు కరువు..

‘‘ఏపీలో వరద బాధితులకు గుక్కెడు నీళ్లు కూడా అందడం లేదు. ప్రజల బాధలు వింటుంటే మనసు తరుక్కుపోతోంది. వర్షాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు తారుమారయ్యాయి. బాధితులకు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇచ్చింది. రేషన్ బియ్యం ఎవరైనా తింటారా? ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?’’అని ప్రశ్నించారు. అంతేకాకుండా వరద బాధితులకు ఉచితంగా తాగునీరు అందించడానికి కేంద్రం ఎందుకు చొరవ తీసుకోలేదని నిలదీశారు. ‘‘కేంద్రానికి ఏడాదికి రూ.6వేల కోట్లు ఆదాయం విజయవాడ డివిజన్ ద్వారా వస్తుంది. మరో వైపు రైల్వే శాఖ సప్లై చేసే రైల్ నీరు ప్లాంట్ విశాఖలోనే ఉంది. మన విజయవాడ డివిజన్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంటే వరద బాధితులకు కనీసం మంచి నీరు అందించడానికి కూడా కేంద్రం ముందుకు రావడం లేదు. రైల్ నీరు వాటర్ బాటల్స్ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరుపున నేను లేఖ రాసినా కనీసం స్పందన లేదు. ఏడాదికి రూ.6వేల కోట్ల ఆదాయం ఇస్తున్న ప్రజలు ఇంతటి ఘోర విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మోదీ సర్కార్ ఇంత కఠినంగా ఎలా ఉంటుంది. కేంద్రం రాష్ట్ర ప్రజల పట్ల ఇంత దారుణ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు ఎందుకు ఇంకా మోదీకి మద్దతు ఇస్తున్నారు’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

బీజేపీని ముక్కుపిండి డబ్బులు తీసుకోవాలి

ఈ సందర్భంగానే చిన్న పిల్లలు తమ పాకెట్ మనీని సీఎం సహాయనిధి కోసం విరాళంగా ఇచ్చిన వీడియోపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేయడంపై కూడా షర్మిల స్పందించారు. మీరు డబ్బులు తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గరనుంచి కాదని హితవు పలికారు. ‘‘సీఎం చంద్రబాబు గారు చిన్న పిల్లల దగ్గర కాదు డబ్బులు తీసుకోవాల్సింది. ముక్కుపిండి బీజేపీ నుంచి డబ్బులు తీసుకోవాలి. గత 10 ఏళ్ళు నుంచి రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు మోదీకి ఊడిగం చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం మాని బీజేపీ నుంచి రూ.10వేల కోట్లు తీసుకుని రావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. మిత్రధర్మంలో ముచ్చటలు కాదు, నిధులు కావాలి’’ అని తెలిపారు.

బాధితులకు ఆర్థిక సాయం చేయాలి

‘‘వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. ప్రజలను పట్టించుకోని ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ గెలిచినట్లు చరిత్రలో లేదు. దీనిని గుర్తించి చంద్రబాబు మసలుకోవాలి. వరద బాధితులకు ప్రభుత్వం రూ.లక్ష అందించాలి. ముందస్తుగా వారికి రూ.15వేల సహాయం అందించాలి. పంట నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం అండగా నిలవాలి. మారుమూల ప్రాంతాలకు కూడా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. సహాయం పొందని బాధితుడు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది’’ అని చెప్పారామే.

Read More
Next Story