నాగార్జునకు కొండాసురేఖ క్షమాపణలు ఎందుకు చెప్పినట్లు ?
x
Nagarjuna, Konda Surekha and KTR

నాగార్జునకు కొండాసురేఖ క్షమాపణలు ఎందుకు చెప్పినట్లు ?

కోర్టు విచారణలో తాను చేసిన ఆరోపణలకు మంత్రి సాక్ష్యాలు చూపించలేరన్న విషయం తెలిసిపోతోంది


మంత్రి కొండాసురేఖ, సినీనటుడు అక్కినేని నాగార్జున కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి నాగార్జునకు మంత్రి క్షమాపణ చెబుతు ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబంపై దాదాపు ఏడాది క్రితం కొండాసురేఖ (Konda Surekha)నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. నాగ్ కొడుకు నాగచైతన్య-సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. (Akkineni Nagarjuna)నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకూడదంటే సమంతను తన దగ్గరకు పంపాల్సిందే అని నాగార్జున కుటుంబంపై కేటీఆర్(KTR) ఒత్తిడి చేసినట్లు చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళాలని నాగార్జున కుటుంబం ఒత్తిడిచేయటంతో ఇంట్లో గొడవలైనట్లు తెలిపారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేని సమంత(Samantha Ruth Prabhu) చివరకు నాగార్జున కుటుంబంతో గొడవలుపడి ఇంట్లోనుండి వచ్చేసి చివరకు చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు మంత్రి ఆరోపించారు. పైగా ఈ విషయం సినిమాఫీల్డులోని అందరికీ తెలుసన్నారు. తనదగ్గర ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు మీడియా సమావేశంలో చెప్పారు.

మంత్రి ఆరోపణలు, వ్యాఖ్యలతో మండిపోయిన నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఆ కేసులో ఇఫ్పటికే ఇటు నాగార్జున అటు కొండాసురేఖ చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. చివరకు ఏమైందో ఏమో సడెన్ గా మంగళవారం అర్ధరాత్రి నాగార్జునకు మంత్రి ట్విట్టర్లో క్షమాపణ చెప్పుకున్నారు. నాగార్జున కుటంబంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. నాగార్జున కుటుంబం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులను నొప్పించాలనో లేకపోతే అపకీర్తి కలిగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని తెలిపారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహ కలిగితే అందుకు తాను చింతిస్తున్నట్లు స్పష్టంచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువునష్టంకేసు గురువారం విచారణకు రాబోతోంది. విచారణకు ఒక్కరోజు ముందు నాగార్జునకు క్షమాపణ చెబుతు మంత్రి ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? అన్నదే అసలైన ప్రశ్న. నటి సమంతపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఇపుడు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పినా అప్పట్లో కావాలనే మంత్రి వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో నాగార్జున కటుంబానికి బాగా డ్యామేజి జరిగింది. కేటీఆర్ మీద మంత్రికి కోపం ఉంటే దాన్ని కేటీఆర్ కు మాత్రమే పరిమితం చేయాల్సిన సురేఖ అవసరంలేకపోయినా సమంతను, నాగార్జున కుటుంబాన్ని పిక్చర్లోకి తెచ్చారు. మంత్రి వ్యాఖ్యలతో అటు నాగార్జున కుటుంబానికే కాకుండా ఇటు కేటీఆర్ ఇమేజికి కూడా బాగా డ్యామేజయ్యింది.

శిక్షభయం వెంటాడుతోందా ?


అందుకనే నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ సురేఖ మీద వేర్వేరుగా పరువునష్టందావా దాఖలుచేశారు. మంత్రి తాజా ట్వీట్ చూసిన తర్వాత అర్ధమవుతున్నది ఏమిటంటే ఆమె దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని. మొహంమీద గుడ్డకాల్చి వేసేస్తే తన మొహానికి అంటిన మసిని కేటీఆర్ తుడుచుకుంటు ఉంటుడాని మంత్రి నిరాధార ఆరోపణలు చేశారు. అయితే కేటీఆర్ మీద ఆరోపణలతో ఆగకుండా సంబంధంలేని నాగార్జున కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగటంతోనే మంత్రికి సమస్యలు మొదలయ్యాయి. కోర్టు విచారణలో తాను చేసిన ఆరోపణలకు మంత్రి సాక్ష్యాలు చూపించలేరన్న విషయం తెలిసిపోతోంది. సాక్ష్యాలు లేకుండానే నిరాధార ఆరోపణలు చేసినందుకు కచ్చితంగా మంత్రికి శిక్షపడుతుంది.

శిక్షపడితే ఏమవుతుంది ? పై కోర్టులో అప్పీలు చేసుకుంటారు కదా అని అనుకోవచ్చు. పై కోర్టులో అయినా మంత్రి తానుచేసిన ఆరోపణలకు సాక్ష్యాలను చూపించాలి కదా. అక్కడ విచారణలో కూడా చూపించలేకపోతే అప్పుడు ఏంటి పరిస్ధితి. నాంపల్లి స్పెషల్ కోర్టులో శిక్షపడితే వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిరావచ్చు. పదవి లేకపోతే సురేఖ అస్సులు ఉండలేరు. ఎన్నివివాదాలు చుట్టుముడుతున్నా పదవిని మాత్రం వదులుకోవటానికి మంత్రి ఇష్టపడరు. కోర్టులో శిక్షపడి మంత్రిపదవికి రాజీనామాచేస్తే దాని ప్రభావం కొండా కుటుంబంపై రాజకీయంగా చాలా తీవ్రంగా ఉంటుంది.

అందుకనే ఇవన్నీ అంచనాలు వేసుకున్న తర్వాతే నాగార్జునకు సురేఖ ఇంత అర్జంటుగా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పుకున్నది. మంత్రి క్షమాపణలు చెబితే ఏమవుతుంది ? దాన్ని నాగార్జున అంగీకరించాలి కదా. మంత్రి క్షమాపణలు చెప్పినంతమాత్రాన నాగార్జున కటుంబానికి పోయిన పరువు తిరిగొస్తుందా ? సురేఖకు శిక్షపడితేనే నాగార్జున కుటుంబానికి కాస్త స్వాంతన కలిగినట్లు లెక్క. భవిష్యత్తులో ఇంకెవరూ ఎవరిపైనా నిరాధార ఆరోపణలు చేయకుండా ఈ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

కేటీఆర్ ఏమిచేస్తారు ?

మంత్రి నాగార్జునకు క్షమాపణలు చెప్పారు బాగానే ఉంది మరి కేటీఆర్ కు ఎందుకు చెప్పలేదు ? నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలన్న ఉద్దేశ్యం తనకు లేదని అన్నారే కాని తాను తప్పుడు ఆరోపణలు చేసినట్లు ఎక్కడా అంగీకరించలేదు. ఆధారంలేకుండా చేసిన ఆరోపణలకు కోర్టులో శిక్షపడకుండా తప్పించుకునేందుకు, మంత్రిపదవిని కాపాడుకునేందుకు మాత్రమే సురేఖ క్షమాపణ చెప్పినట్లు అర్ధమవుతోంది. నాగార్జున అంగీకరిస్తారో లేదో తెలీదు కాని కేటీఆర్ కూడా మంత్రిపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసు కూడా విచారణలోనే ఉంది. కేటీఆర్ వేసిన కేసు నుండి మంత్రి ఎలాగ తప్పించుకుంటారు ? కేటీఆర్ కు కూడా క్షమాపణ చెప్పి రాజీకి ప్రయత్నం చేసుకుంటారా ? మంత్రి క్షమాపణకు, రాజీ ప్రయత్నాలకు నాగార్జున, కేటీఆర్ అంగీకరిస్తారా ? చూడాల్సిందే ఏమి జరుగుతుందో.

Read More
Next Story