
దగ్గుబాటి, చంద్రబాబు ఎందుకు విడిపోయారు
స్వరీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అల్లుళ్లు ఎప్పుడు విడిపోయారు, ఎందుకు విడిపోయారు, కారణాలు ఏమిటి? ఇప్పుడు ఎందుకు కలిసారు.
ఎన్ టి రామారావు రాజకీయాల్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు, నారా చంద్రబాబు నాయుడు పేర్లు మార్మొగేవి. ఎందుకంటే వారు ఎన్టీఆర్ కు అల్లుళ్లు కావడం, పార్టీలో వారిద్దరి పెత్తనమే చెలామణి కావడం వల్ల వారికి అంత క్రేజ్ వచ్చింది. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు సౌమ్యుడని, చంద్రబాబు నాయుడు కాస్త కఠినంగా ఉండేవారనే పేరు ఉంది. ఎన్టీ రామారావును అధికారంలోకి తీసుకు రావడానికి ఈనాడు దినపత్రిక అప్పట్లో అనుకూల వార్తలు ఎన్నో రాసింది. తెలుగుదేశం పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ‘ఓటరు కో మాట’ శీర్షికతో రాసిన రాతలు ఓటర్లలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ఎలాగైతేనేం పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.
మొదట డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు ఏమి చేసే వారు
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు వైద్య విద్యను పూర్తిచేసుకున్న తరువాత వైద్యుడిగా ప్రాక్టీస్ పెట్టారు. అయితే పేద వారికి వైద్యం అదించాలనే ఉద్దేశ్యం ఆయనకు ఎక్కువగా ఉండేది. ఇదే సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాలనే ఆలోచనకు వచ్చారు. దగ్గుబాటి చెంచురామయ్యతో ఎన్టీఆర్ చర్చించారు. అనుకున్న ప్రకారం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపనలో దగ్గుబాటి వెంకటేశ్వరావు తండ్రి చెంచురామయ్య సూచన మేరకు దగ్గుబాటి వెంకటేశ్వరావు కృషి ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఆయనకు కావాల్సిన సహకారం అంతా దగ్గుబాటి చూసుకునే వారు. 1983లో జరిగిన ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరావు పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టి అడుగులు వేశారు. పార్టీకి అన్నీ తానై ముందుకు నడిచారు. ఎన్టీఆర్ చెప్పినవన్నీ చేస్తూ, చేయిస్తూ పార్టీలో ఎన్టీఆర్ తరువాత వెంకటేశ్వరావుకు అంతటి ప్రాధాన్యత ఉండేది.
చంద్రబాబు ను పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లిన దగ్గుబాటి
ఎన్టీ రామారావు పార్టీ స్థాపిస్తున్నారని, పార్టీలోకి రావాలని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు చంద్రబాబు ఇంటికి వెళ్లి 1982 ఏప్రిల్ 11న ఆహ్వానించారు. తాను పార్టీలోకి వచ్చేది లేదని, ఆయన డబ్బులు పెట్టడు. డబ్బులు లేకుండా ఓట్లు రావు. మీకు ఐదు శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా చేసి దగ్గుబాటిని వెనక్కి పంపించారు. అయినా ఓర్పుతో దగ్గుబాటి వెనుదిరిగి వచ్చారు. తిరిగి మే 29న రెండో సారి చంద్రబాబు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నేను వెళ్లిన రోజే పత్రిక చూపించారు. మామపైనే పోటీ చేస్తున్నానని ప్రకటించిన పత్రిక చూపించారు. అది చూసి ఆశ్చర్యపోవడం దగ్గుబాటి వంతైంది. మీకు పది శాతం ఓట్లు కూడా రావని అప్పుడు కూడా దగ్గుబాటిని ఆటపట్టించేలా మాట్లాడారు. దాంతో ఆయన వెనుదిరగక తప్పలేదు.
ఇక 1983లో దగ్గుబాటి చెంచు రామయ్య, వెంకటేశ్వరరావు లను ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్టీ రామారావు అడుగుతాడు. దానికి చెంచురామయ్య గాని, వెంకటేశ్వరావు గాని ఇష్టపడరు. ఓ దశలో ఎన్టీఆర్ కూడా పోటీ చేయడానికి ఇష్టపడ లేదని అప్పటి వారు కొందరు చెబుతుంటారు. వెంకటేశ్వరరావు మాత్రం పార్టీకి పనిచేస్తాను తప్ప పోటీ చేయను అంటారు. ఓడిపోతామేమో అనే భయంతో వెంకటేశ్వరరావు పోటీ చేయలేదని నాదెండ్ల భాస్కర్ రావు కథనం. అప్పటికే దగ్గుబాటి చెంచు రామయ్య ఎన్టీ రామారావు పార్టీని.. ఇది బొమ్మలాట పార్టీ అని, తైతక్కలాడే వాళ్ళ పార్టీ అని అన్నాడనేది కూడా నాదెండ్ల మాట.
ఎన్నికలైన నెలకే చంద్రబాబు నాయుడు ఎంటర్
ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టగా మామ ఎన్టీఆర్ వద్దకు వచ్చి పార్టీలో చేర్చుకోవాలని నేరుగా అడిగితే ఆయన ఆగ్రహించే అవకాశం ఉందని భావించిన బాబు భార్య భువనేశ్వరిని ఆయుధంగా ఎంచుకుని ఆమె ద్వారా పావులు కదిపారు. చంద్రబాబును చేర్చుకునేందుకు ఎన్టీ రామారావు ఒప్పుకున్నారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరావు మాత్రం వ్యతిరేకించారు. ఎన్టీఆర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దగ్గుబాటి పై ఎన్టీఆర్ కోపగించుకవడంతో కాస్త వెనుకడుగు వేశారు. అప్పట్లో ఎవరెన్ని చెప్పినా ఇరువురు అల్లుళ్లూ ఎన్టీఆర్ ను చూస్తే భయంతోనే ఉండే వారు. వీరు చెప్పేదానికంటే ఎన్టీఆర్ చెప్పినవి చేయక తప్పేది కాదు. తరువాత మూడు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి ముగ్గురు సభ్యులతో కలిపి కమిటీ వేసి, ఆ తరువాత చంద్రబాబును తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత పార్టీలో ఉండేది.
దగ్గుబాటి ది ముక్కుసూటి తనం... చంద్రబాబుది లౌక్యం ..
పార్టీలో ఇరువురికి వర్గాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు కొందరిని ప్రతిపాదిస్తే, మరి కొందరిని వెంకటేశ్వరరావు ప్రతిపాదించే వారు. ఇద్దరు చెప్పిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఉండేది. అంతే కాకుండా ఎన్నికల్లోనూ వీరు చెప్పిన వారికి టిక్కెట్లు ఎన్టీఆర్ ఇచ్చారు. ఎవరికి వారు గ్రూపులు మెయింటెయిన్ చేస్తూ వచ్చారు. పార్టీ వ్యవహారాల్లో కలిసి కట్టుగానే చర్చలు జరిపేవారు. ఆ తరువాత ఎవరి గ్రూపుకు వారు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఎవరి గ్రూపులను వారు పెట్టుకుని పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారో ఇరువురి మధ్య దూరం బాగా పెరుగుతూ వచ్చింది.
లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ఎన్టీఆర్
ఎన్టీ రామారావు ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా 100 డేస్ ఫంక్షన్ తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడుతూ చివర్లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటానని, ఆమె అంగీకరిస్తే తాను తన భార్యను చేసుకుంటానని చెప్పారు. తనకు ఆమె చాలా సేవలు చేసినందున పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్య పోయారు. ప్రధానంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన అల్లుళ్లలో ఎన్టీఆర్ మాటలు పెద్ద చర్చకు దారి తీసాయి. పెళ్లయిన తరువాత లక్ష్మీ పార్వతి పార్టీలో పెత్తనం చెలాయించడం మొదలు పెట్టారు. తన వారసురాలుగా లక్ష్మీ పార్వతిని ప్రకటించే స్థాయికి ఎన్టీఆర్ వచ్చారని భావించిన చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే పనిలో పడిపోయారు.
వైశ్రాయ్ హోటల్ లో క్యాంపు ఏర్పాటు
చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని వైశ్రాయ్ హోటల్ లో తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. ఢిల్లీలో ఉండి ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందరితోనూ మాట్లాడారు. దగ్గుబాటి పార్లమెంట్ సభ్యునిగా ఉండటం వల్ల తన వర్గం ఎమ్మెల్యేలతో నిత్య సంబంధాలు తగ్గాయి. అయితే చీరాలకు చెందిన పాలేటి రామారావు (అప్పట్లో పశు వంవర్థక శాఖ మంత్రి), ఒంగోలు ఎమ్మెల్యే ఈదర హరిబాబు, నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి వారు దగ్గుబాటి వర్గంలోనే ఉన్నారు. దగ్గుబాటి ఆధ్వర్యంలో మరో క్యాంపు నిర్వహించాలని కొందరు దగ్గుబాటి అనుచరులు సూచించారు. అందుకు దగ్గుబాటి అంగీకరించలేదు.
ఢిల్లీ నుంచి దగ్గుబాటి నేరుగా వైశ్రాయ్ హోటల్ కు..
ఢిల్లీ నుంచి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంపీ హోదాలో హైదరాబాద్ లో దిగారు. విమానాశ్రయం నుంచి నేరుగా వైశ్రాయ్ హోటల్ కు చేరుకున్నారు. హోటల్ కు రాగానే దగ్గుబాటి అనుచరులు కూడా ఆయనతో అడుగులు వేశారు. కొందరు దగ్గుబాటిని సహితం వ్యతిరేకించి చంద్రబాబు అనుచరుల చేతుల్లో తన్నులు తిన్నారు. దగ్గుబాటి మాత్రం హోటల్ కు చేరుకోగానే చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వద్దకు వచ్చి నేరుగా కౌగలించుకున్నారు. స్పర్థలు పక్కన బెట్టి ఇప్పుడు జరగాల్సిన పరిణామాలు చూద్దామని మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ను పార్టీ నుంచి తొలగిస్తున్నామని, ఆయనను పార్టీలో మెజారిటీ శాసన సభ్యులు వ్యతిరేకిస్తున్నందున పార్టీ నుంచి తొలగిస్తున్నామని, తమ నాయకత్వంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు గవర్నర్ కు లేఖ ఇచ్చారు. గవర్నర్ చంద్రబాబును పిలిచి బలం నిరూపించుకోవాలని చెప్పే లోపులో పార్టీలో పదవులు ఎవరెవరికి ఏమేమి ఉండాలో చంద్రబాబు, వెంకటేశ్వరావు, హరికృష్ణలు డిసైడ్ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ కూడా వారితోనే ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ వెంకటేశ్వరావుకు ఆఫర్
తాను ముఖ్యమంత్రిగా, డాక్టర్ వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రిగా, నందమూరి హరికృష్ణ పార్టీ నాయకత్వ బాధ్యతలు చూసే విధంగా నిర్ణయం జరిగింది. అందుకు వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారు. సచివాలయానికి వెళ్లే సమయంలో మీ ఇంటి ముందు నుంచే నేను వెళతానని, మీరు రెడీ అయి ఉంటే ఇద్దరం కలిసి ఒకే కారులో సచివాలయానికి వెళదామని దగ్గుబాటికి చంద్రబాబు అప్పట్లో చెప్పారు. అన్ని ఒప్పందాలు పూర్తయిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మినిస్టర్ గా హరికృష్ణ
చంద్రబాబు మంత్రివర్గంలో హరికృష్ణకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత గుడివాడ నుంచి ఆరు నెలల లోపు పోటీ చేసి హరికృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తరువాత హరికృష్ణ ను మంత్రి పదవి నుంచి చంద్రబాబు తొలగించారు. హరికృష్ణ కు పార్టీలో ప్రాధాన్యత పెరిగితే ఆయన వైపు ఎమ్మెల్యేలు, మిగిలిన నాయకులు మొగ్గు చూపే అవకాశం ఉందని, అప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని కొందరు చేసిన సూచనలతో హరికృష్ణ ను మంత్రి పదవి నుంచి తొలగించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కారణాలు బయటకు రాలేదు కాని మంత్రి వర్గం నుంచి హరికృష్ణ తప్పుకోవాల్సి వచ్చింది.
దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ వెంకటేశ్వరావు ను తీసుకుంటానన్న హామీని పక్కన బెట్టారు. హరికృష్ణకు ప్రయారిటీ లేకుండా చేశారు. నాడు ఈనాడు దిన పత్రికలో వెంకటేశ్వరరావు చీటికీ మాటికీ అలుగు తున్నాడని పతాక శీర్షకల్లో ప్రతి రోజూ వార్తలు రావడం మొదలయ్యాయి. మొదట్లో వెంకటేశ్వరావు సౌమ్యుడని పొగిడి రాసిని ఈనాడు రానురాను డాక్టర్ వెంకటేశ్వరావు తీరు బాగో లేదని రాయడం మొదలు పెట్టింది. ఒక రోజు దగ్గుబాటికి, చంద్రబాబుకు కటీఫ్ అంటూ పతాక శీర్షికన వార్త ప్రచురించింది. అప్పటి నుంచి ఇరువురూ పూర్తిగా విడిపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం ఆవిర్భావం
నెల రోజుల్లోనే చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించిన వెంకటేశ్వరావు, హరికృష్ణ, లక్ష్మీ పార్వతితో కలిసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తిరిగి ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ తరపున లక్ష్మీ పార్వతి ఒక్కరు మాత్రమే నాటి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఎన్నికల్లో హరికృష్ణ సొంతంగా ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. పలకపై అన్న తెలుగుదేశం అక్షరాలు రాసి హైదరాబాద్ లోనే పార్టీ ప్రకటన చేశారు. అందుకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు కూడా సహకరించారు. అయితే ఆ పార్టీ కూడా ఎన్నికల్లో ఓడి పోవడంతో పార్టీని హరికృష్ణ మూసి వేశారు.
రాజ్యసభలో దగ్గుబాటి
వెంకటేశ్వరరావు 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభలో అడుగు పెట్టగలిగారు. అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న వాజ్ పాయ్ దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరుదామనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు అడ్డుపడి బీజేపీలో చేర్చుకోకుండా చేశారు. కొంతకాలం బీజేపీకి కాస్త దగ్గరగా ఉన్న దగ్గుబాటి క్రమంగా దూరమై ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు.
దగ్గుబాటి కాంగ్రెస్ లో చేరిక
దగ్గుబాటి 2004లో వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లు ఖాళీగా ఉన్నారు. 2019లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా రచనలు చేస్తూ వచ్చారు.
విద్యాసంస్థల ఏర్పాటు
తెలుగుదేశం పార్టీ నుంచి డిఫర్ అయిన తరువాత ఇంకొల్లులో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. నివేదిత పేరుతో హైస్కూలు వరకు విద్యా సంస్థను నెలకొల్పారు. దగ్గుబాటి చెంచురామయ్య నీలమోహన్ విద్యాసంస్థల పేరుతో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యను అందిస్తున్నారు. (నీల మోహన్ దగ్గుబాటి సోదరుడు)
పుస్తకం ఆ ఇద్దరినీ మళ్లీ కలిపింది
ఒక చరిత్ర.. కొన్ని నిజాలు, ప్రపంచ తత్వం.. నాయకత్వం, ప్రపంచ దేశాలు.. పాలనా వ్యవస్థలు, తెలుగు వారి చరిత్ర ఏర్పాటు వాదం అనే పుస్తకాలు ఇప్పటికే రచించారు. ప్రస్తుతం రచించిన ప్రపంచ చరిత్ర.. ఆది నుంచి నేటి వరకు.. అనే పుస్తకాన్ని ఈనెల 6న విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. 30 ఏళ్ల తరువాత అన్ని స్పర్థలు మరిచిపోయి దగ్గుబాటి ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు నాయుడు కలిసారు. ఇద్దరూ వాటేసుకొన్నారు. నాడు వైశ్రాయి హోటల్ లో కౌగలించుకున్న తర్వాత తిరిగి విశాఖ వేదికపై కౌగలించుకున్నారు. నాకు బాబుతో స్పర్థలు ఉన్నాయని, అవన్నీ వదిలేసి కుటుంబ సభ్యలు, పిల్లలు, స్నేహితులతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు దగ్గుబాటి ప్రకటించారు. ఎంతో జీవితం గడిచి పోయింది. అందరితో కలిసి ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకే కుటుంబాలు కలిసాయని చెప్పటం విశేషం.