
పవన్ కల్యాణ్‌కు గోమాత అంటే భక్తి లేదా
టీటీడీ గోవుల మృతిపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
తిరుమల తిరుపతికి సంబంధించిన అంశాలపై తక్షణమే స్పందించే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అదే పుణ్యక్షేత్రంలో గోశాల మీద కానీ, గోవుల మృతిపైన కానీ ఎందుకు స్పందించడం లేదు? నోరు విప్పి ఎందుకు మాట్లాడటం లేదు అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే ముఖమ్యంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు ఇతర టీటీడీ పెద్దలు స్పందించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఇంత వరకు ఏమీ మాట్లాడక పోవడం, ఆయన తరపున జనసేన పార్టీ పెద్దలు కూడా ఇంత వరకు స్పందించక పోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. టీటీడీ గోవుల మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన సందర్భంలో బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందనే వివాదాన్ని తొలుత సీఎం చంద్రబాబు తెరపైకి తెస్తే.. ఆ వివాదాన్ని తన భుజస్కందాలపై వేసుకొని ప్రపంచ వ్యాపితం చేసిన ఘనత మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కే దక్కుతుంది. స్వామి వారి ప్రసాదం అపవిత్రమైందని పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ దుర్గమ్మ అమ్మ వారి మెట్లను కూడా తానే స్వయంగా కడిగి శుభ్రం చేశారు. కాలి నడకన తిరుమలకు వెళ్లి స్వామి వారి సన్నిధిలో దీక్షను విరమింప చేసుకున్నారు. తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన పలు భాషల్లో మాట్లాడారు. తెలుగు తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడి తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపైన, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన స్టాండ్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అదే తిరుమల తిరుపతి స్వామి సన్నిధిలోని గోశాలలో వందలాది గోవులు మరణిస్తుంటే వాటి మీద అదే స్థాయిలో గొంతెత్తాల్సిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మరో వైపు టీటీడీ గోవుల మరణాలు అటు టీడీపీ, ఇటు వైసీపీల మధ్య రణరంగంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వందల సంఖ్యలో గోవుల మరణాలు సంభవించాయని వారు ఆరోపిస్తున్నారు. కావాలనే వైసీపీ నేతలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గోమాత మరణాలపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాషాయ వస్త్రాలు ధరించి, ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు టీటీడీలో గోమాతల మరణాలు కనిపించడం లేదా? దీనిపై కనీసం స్పందించే తీరిక ఆయనకు లేదా? సనాతన ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకుని మైకుల ముందు మాట్లాడటమే కాదు.. ఆ ధర్మాలను పాటించాలి అంటూ నిలదీశారు. ధర్మాన్ని రక్షించేందుకు దీక్షలు చేసే పవన్ కల్యాణ్‌కు గోమాత అంటే భక్తి లేదా? తక్షణం దీనిపైన పవన్ కల్యాణ్ స్పందించాలి. హిందూ సమాజానికి సమాధానం చెప్పాలంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.
Next Story