‘ఆరోగ్యశ్రీ’ విషయంలో ఒత్తిడి తేవొద్దు.. అధికారులకు సీఎం సూచనలు
x

‘ఆరోగ్యశ్రీ’ విషయంలో ఒత్తిడి తేవొద్దు.. అధికారులకు సీఎం సూచనలు

సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కీలక టాస్క్ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు ధీటాగా సిద్ధం చేయాలన్నారు.


వెలగపూడిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆరోగ్యశ్రీ విషయంపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా నాణ్యమైన వైద్యం కోసం ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకే ఎందుకు వెళ్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత మెరుగ్గా ఎందుకు పని చేయలేకపోతున్నాయని కూడా ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవల్లో ఎంతటి తేడా ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చేయాలని, దీనిని నిబంధనలు, షరతులతోకాకుండా మెరుగైన సేవలతో సాధించాలని కూడా చెప్పారు. ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చేయాలని ఐదు జిల్లాల కలెక్టర్లకు కృష్ణబాబు సూచించారు. దీంతో ఈ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొద్దని ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని చెప్పారు.

సీఎంకు మంత్రి తెలిపిన వివరాలు

ఈ సందర్భంగానే ఆరోగ్యశ్రీ సేవలు బీమా విధానంలోకి తీసుకురావడంలో ఉన్న పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు అడిగిన వివరాలను మంత్రి సత్యకుమార్ వివరించారు. ఆరోగ్యశ్రీ కింద రూ.2లక్షలలోపు ఉచితంగా సేవల పొందేవారు 95శాతం మంది ఉన్నారని , మిగిలిన వారికి ఆయుష్మాన్ ట్రస్ట్, బీమా విధానం వర్తింపజేస్తే బాగుంటుందని ఆయన తన అభిప్రాయం తెలిపారు. ఆయన వివరాలు, సూచనలను ఆలకించిన చంద్రబాబు.. అధ్యయనం చేయాలని.. ఈ నెల 16న నిర్వహించే సమావేశంలో పూర్తి వివరాలు అందించాలని అన్నారు.

మనమెందుకు పోటీ పడలేం

ప్రైవేటు ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు పోటీ పడలేవని, లోపాలు ఏంటని అధికారులను ప్రశ్నించారు చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించడానికి ్పరయత్నించాలని తెలిపారు. ఓపెన్ మార్గెట్‌లో పోటీపడటంతో పాటు ప్రజారోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, సామాన్యుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలని సీఎం కోరారు.

ఎందుకు చేతకావట్లేదు..

‘‘ప్రైవేటు ఆసుపత్రులు లాభాపేక్షతో అధిక బిల్లులు దండుకుంటూ మెరుగైన వైద్యం అందిస్తున్నాయి. అలాంటి అటువంటిదేమీ లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు మెరుగైన వైద్యం అందించడంలో వెనకబడి ఉంటున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. ప్రైవేటు ఆసుపత్రులతో మనం ఎందుకు పోటీ పడలేం. భవిష్యత్తులో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సేవలు అందించాలి. దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రైవేటు ఆసుపత్రులకు ఏమాత్రం తీసుపోని విధంగా మనం కూడా వైద్యం అందించాలి’’ అని సూచించారు. ఏడాదిలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మారాలని చంద్రబాబు డెడ్‌లైన్ కూడా పెట్టారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి సీఎం బాబు పెట్టిన లక్ష్యాన్ని వైద్యారోగ్య శాఖ సాధిస్తుందో లేదో చూడాలి.

Read More
Next Story