బొమ్మ ఢిల్లీ పర్యటన సస్పెన్సేనా ?
x

బొమ్మ ఢిల్లీ పర్యటన సస్పెన్సేనా ?

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా బొమ్మ బాద్యతలు తీసుకుని సుమారు నెలన్నర అవుతున్నా ఇంతవరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయారు.


రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (Telangana Pradesh Congress Committee President) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) ఢిల్లీకి వెళ్ళారు. రాంగ్ టైములో బొమ్మ ఢిల్లీ(Delhi)కి ఎందుకు వెళ్ళారనే విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ పేరుతో ఇంతకాలం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. రేవంత్(Revanth) కాస్త గ్యాప్ ఇవ్వగానే పీసీసీ అధ్యక్షుడు బొమ్మ వంతు మొదలైంది ఢిల్లీ చుట్టూ తిరగటానికి. విషయం ఏమిటంటే బొమ్మ ఢిల్లీకి వెళ్ళింది పీసీసీ కమిటి కూర్పుగురించి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా బొమ్మ బాద్యతలు తీసుకుని సుమారు నెలన్నర అవుతున్నా ఇంతవరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. కార్యవర్గం కూర్పంటే మామూలు విషయం కాదు అందులోను కాంగ్రెస్ పార్టీలో. పార్టీ ప్రతిపక్షంలో ఉంటేనే పదవుల కోసం నానా గోలచేస్తారు. అలాంటిది ఇపుడు అధికారంలో ఉన్నపుడు పార్టీ పదవులను ఎవరైనా వదిలిపెడతారా ?

పీసీసీ కార్యవర్గాన్ని(TPCC) ఏర్పాటుచేయాలంటే జిల్లాలు, కులాలు, మతాల సమతూకాన్ని పాటించాల్సిందే. మళ్ళీ ఇందులో సీనియర్లు, జూనియర్లు, మొదటినుండి పార్టీలోనే ఉన్న నేతలు, బీఆర్ఎస్ నుండి ఫిరాయించి పార్టీలో చేరిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మద్దతుదారులను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిందే. లేకపోతే దీని ఎఫెక్ట్ బొమ్మతో పాటు రేవంత్ కు కూడా తగులుతుంది. పదవులు రాని అసంతృప్తులంతా కలిసి రేవంత్ తో పాటు బొమ్మను కూడా దుమ్ము దులిపేస్తారు. దీనికి కారణం ఏమిటంటే రేవంత్, బొమ్మతో పాటు చాలామంది సీనియర్లకు పార్టీలోని అధిష్టానంతో సన్నిహిత సంబంధాలుండటమే. అధిష్టానం ఏ నేతను దగ్గరకు తీసుకుని నెత్తిన పెట్టుకోదు అలాగని దూరంగాను ఉంచదు.

జిల్లాలు, కుల, మతాల సమతూకం చేయటంలోనే పీసీసీ కార్యవర్గ ప్రకటన బాగా ఆలస్యమవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఢిల్లీకి బొమ్మ వెళ్ళిన సమయమే రాంగ్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రముఖులంతా మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jharkhand), వయనాడ్(Wayanad) తో పాటు ఉత్తరప్రదేశ్(UP) తదితర రాష్ట్రాల్లోని ఉపఎన్నికల బిజీలో ఉన్నారు. సోనియాగాంధి(Sonia Gandhi), రాహుల్(Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తో పాటు చాలామంది ప్రముఖులు వయనాడ్ ఎంపీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న ప్రియాంకగాంధి(Priyanka Gandhi) నామినేషన్ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. అలాగే మహారాష్ట్ర, జార్ఖండ్ లో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, ఉత్తరప్రదేశ్ లో 10 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకనేతలంతా చాలా బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిసేవరకు కీలకనేతలంతా ఇదే బిజీలో ఉంటారు. కాబట్టి తెలంగాణా పీసీసీ కార్యవర్గం కూర్పుగురించి అధ్యక్షుడు బొమ్మతో మాట్లాడేంత తీరిక ఎవరికుంటుంది ?

అయితే ఇవన్నీ తెలియని నేత కాదు బొమ్మ. అయినా రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళారంటే పీసీసీ కార్యవర్గ కూర్పు పేరుతో పాటు ఇంకేదో హిడెన్ అజెండా ఉంటుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ హిడెన్ అజెండా ఏమిటనే విషయంలోనే సస్పెన్స్ పెరిగిపోతోంది. రెండు రోజుల ఢిల్లీ టూర్ లోనే ఆ సస్పెన్స్ విడిపోతుందా ? లేకపోతే తిరిగి హైదరాబాద్(Hyderabad) వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందేనా ?

Read More
Next Story