విప్లవవీరుడు భగత్ సింగ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా?
x

విప్లవవీరుడు భగత్ సింగ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా?

"రంగ్ దే బసంతి" సినిమా గుర్తుందిగా..ఆ సినిమా విప్లవకారుడు భగత్ సింగ్ కి సంబంధించి కొన్ని సీన్లు కట్ చేశారట. భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా అవి తెరపైకి వచ్చాయి.


"రంగ్ దే బసంతి" సినిమా గుర్తుందిగా.. రోరింగ్ సక్సెస్ అయింది. ఆ సినిమా విప్లవకారుడు భగత్ సింగ్ కి సంబంధించి కొన్ని సీన్లు కట్ చేశారట. హరియాణా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడీ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా ఈ సినిమా కట్స్ తో పాటు అనేక సంగతులు తెరపైకి వచ్చాయి. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ధైర్య సాహసాలు, ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన తీరు, అప్పటికే తాను నాస్తికుణ్ణంటూ చెప్పిన వైనం.. ఇలా ఎన్నో సుగుణాలతో భారతీయుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాయించుకున్నారు. చిరస్మరణీయుడిగా నిలిచారు.


భగత్ సింగ్ కి విప్లవ, సిద్ధాంత గ్రంథాలతో పాటు సినిమాలంటే కూడా మక్కువ చూపేవారని ఇటీవల రిడిఫ్ న్యూస్ లో ఓ కథనం వచ్చింది. భగత్ సింగ్ తరచూ తన స్నేహితులతో కొత్త సినిమాలు, నటీనటుల గురించి చర్చించేవారట. కొన్నేళ్ళ కిందట 'రంగ్ దే బసంతి చిత్రంలో తొలగించిన దృశ్యాలు' అనే శీర్షికతో యూట్యూబ్ లో ఓ వీడియో ఉండేది. అందులో భగత్ సింగ్ తన సహచరులతో ఆకలిపై జోక్స్ వేసినట్టు, తిండి కోసం ఖర్చు పెట్టడం కంటే ఏదైనా థియేటర్ లో అంకుల్ టామ్స్ క్యాబిన్ సినిమా చూద్దామని చంద్రశేఖర్ ఆజాద్‌తో వాదించినట్టున్న సీన్లు అవి. ఇప్పుడవి యూట్యూబ్ లో కనిపించడం లేదు గాని ఈ రెండు సన్నివేశాలు భగత్ సింగ్ సహచరులు తమ జ్ఞాపకాలలో రాసిన వాస్తవ సంఘటనలంటారు. తాను ఎంచుకున్న విప్లవ బాటలో ఎన్ని కష్టాలున్నా యవ్వనోత్సాహానికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అందర్నీ ఉల్లాసపరిచేవారు.

హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) సభ్యులు శివ్ వర్మ, భగవాన్ దాస్ మహౌర్, సదాశివ్ మల్కాపుర్కర్ జ్ఞాపకాల్లో భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని కళ్లకుగట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఉత్కర్ష్ మిశ్రా అనే జర్నలిస్టు రాశారు. బుందేల్‌ఖండ్‌కు చెందిన మహౌర్, మల్కాపుర్కర్ చెందిన ఆజాద్‌కు భగత్ సింగ్ సన్నిహితులు. హెచ్‌ఎస్‌ఆర్‌ఏలో భగత్ సింగ్‌తో వాళ్లు చాలా సమయం గడిపారు.
రాజ్‌గురు ధోరణి భగత్ సింగ్‌కి కోపం తెప్పించేదట. రాజ్‌గురు చాలా సీరియస్ గా, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా నిర్లిప్తంగా ఉండేవారట. మిగతా వాళ్లు కూడా అలాగే ఉండాలని భావించేవారట. మిగతా సభ్యులెవరైనా కవిత్ గురించో, శృంగారం సహా ఇతర శారీరక సుఖాల గురించో రాస్తే రాజ్ గురు ఇష్టపడేవాడు కాదని మహోర్ రాశారు.
ఓ పౌర్ణమి రాత్రి ఈ విప్లవకారులందరూ ఆగ్రాలోని తాజ్ మహల్ చూడటానికి వెళ్లారు. అందరూ నిశ్శబ్దంగా తాజ్ మహల్ అందాల్ని వీక్షిస్తూ కవితలల్లడానకి ప్రయత్నిస్తుంటే ఒక్క రాజ్ గురు మాత్రమే తన సహజధోరణిలో మాట్లాడుతున్నారట. ఒక సహచరుడు కల్పించుకుని "రఘునాథ్ (రాజ్‌గురు మారుపేరు), మీరు ఇక్కడుంటే కంటే ఇంటికెళ్లి వ్యాయామం చేయడం మంచిదేమో" అనడంతో రాజ్ గురు ఈ లోకంలోకి వచ్చి ఏదో ఒక కవిత రాసి మర్నాడు అందరూ టీ తాగే సమయంలో చదవడం మొదలు పెట్టారట. రాజ్ గురు కవితకి "బచ్చు భయ్యా (బెజోయ్ కుమార్ సిన్హా) అరుపులు, కేకలకు లేచారట. దత్ (బటుకేశ్వర్) అయితే రాజ్‌గురు వైపు చూస్తూ ముఖం వేలాడేశారట. ఇక, భగత్ సింగ్ తన రివాల్వర్‌ని తీసి రాజ్‌గురు చేతికిచ్చి, 'నీకు మేము నిజంగా బతక్కూడదనుకుంటే ఈ రివాల్వర్ తో మమ్మల్ని కాల్చేయి. లేదంటే ఇకపై ఆ కవిత్వం జోలికి పోనని అయినా మాట ఇమ్మన్నారట. అది సుతా రాజ్ గురు కవిత్వం రాయలేదని మౌహర్ రాశారు.
లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా ఆనాటి బ్రిటీష్ పోలీసు అధికారి జేడీ శాండర్స్‌ను కాల్చిచంపిన తర్వాత భగత్ సింగ్, ఆజాద్, రాజ్‌గురు లాహోర్‌లోని వాళ్ల స్థావరానికి చేరుకున్నప్పుడు రాజ్‌గురు విచారంగా ఉన్నారట. మహౌర్- రాజ్ గురును అభినందించడానికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహౌర్ ఎందుకు అని అడిగితే రాజ్‌గురు "అతను (శాండర్స్) అందమైన యువకుడు. అతన్ని చంపినందుకు ఆయన కుటుంబం ఎంత బాధపడి ఉంటుందో కదా" అన్నారట.
ఎవర్నో చంపడం వల్ల స్వాతంత్ర్యం వస్తుందన్న నమ్మకం వీళ్లకేమీ లేదన్నది ఈ సంఘటన నిరూపిస్తుంది. బ్రిటీష్ పాలకుల రాక్షసత్వానికి వీళ్లు ప్రతినిధులు కనుకనే ప్రతికారానికి పూనుకున్నారు తప్ప వాళ్ల ప్రాణాలను తీయడం ఏమాత్రం ఇష్టం లేదు.
భోజన ఖర్చుతో సినిమా చూద్దామన్న భగత్ సింగ్..
భగత్ సింగ్ ది సంపన్న కుటుంబం. మురికి బట్టలు, నాసిరకం తిండి ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కానీ విప్లవకారులతో చేరిన తర్వాత ఆయన ఆ విలాసాన్ని మర్చిపోయాడు. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు ఆయన తన స్నేహితులతో "లక్నోలోని సంపన్న నవాబులు ఎలా తింటారో తెలుసా?" అంటూ వాళ్లెలా తింటారో ఇమిటేట్ చేసి చూపిస్తాడు. బ్రహ్మాండమైన విందు చేస్తున్నట్లు నటిస్తూ ఓ ఖాళీ ప్లేటులో నుంచి ఏదో ఒక పదార్ధాన్ని తీసి నోట్లో పెట్టుకుంటున్నట్టు, భోజనం చివర్లో తనకిచ్చిన తువాలుతో మూతి తుడుచుకూంటా చేయి కడిగి "వావ్, భోజనం ఎంత రుచికరంగా ఉందో కదా!" అనేవారట. ఇలాంటి చాలా సీన్లు భగత్ సింగ్ సహచరులకు కళ్ల నీళ్లు తెప్పించేవట. అలాంటి వాడు రోజువారీ భోజనాన్ని కేవలం నాలుగణాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేదని మహౌర్ తన జ్ఞాపకాల్లో రాశారు.
డిసెంబర్ 1928లో ఒకసారి లాహోర్‌లో "మ్యాజిక్ లాంతరు" ప్రదర్శన జోరుగా సాగుతుంటే భగత్ సింగ్- 1927లో బానిసత్వ వ్యతిరేక నవల ఆధారంగా రూపొందించిన- "అంకుల్ టామ్స్ క్యాబిన్" పోస్టర్‌లను చూసి మనం తీసుకునే నాలుగణాలతో ఆ సినిమాను చూసొద్దామా అన్నారట. నలుగురు సభ్యుల భోజనానికి ఒక రూపాయి అవుతుందని, ఆ డబ్బును సినిమా కోసం ఖర్చు చేయమని భగత్ సింగ్ కోరాడు. విప్లవ శ్రేణులకు నిధులు సేకరించడం కష్టం. ప్రతి పైసా విలువైందే. అందువల్ల డబ్బును తిండి కోసం తప్ప మరోదానికి ఉపయోగించవద్దని చంద్రశేఖర ఆజాద్ చెప్పేవారు. డబ్బు లేకపోవడంతో తరచూ తిండిలేక అవస్థలు పడాల్సి వచ్చేది.
మహౌర్‌ని ఒప్పించేందుకు భగత్ సింగ్ అన్ని ప్రయత్నాలు చేశాడు. అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఈ సినిమా వచ్చినందున విప్లవకారులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలన్నారు. ఆ తర్వాత విప్లవ ఉద్యమాల్లో కళ పాత్ర గురించి చెప్పి ఈ సినిమాకు వెళ్దామన్నారు. అయితే మహౌర్ అంగీకరించలేదు. పార్టీ క్రమశిక్షణను పాటించమన్నారు. గుడ్డిగా నియమాలను పాటించవద్దంటూ భగత్ సింగ్ "మంచి ఉపన్యాసం" ఇచ్చాడు. తర్జన భర్జన పడ్డారు. చివరకు భగత్ సింగ్ ఈ సినిమాకు డబ్బివ్వక పోతే లాక్కొనైనా పోతాననడంతో మహౌర్‌ దిగొచ్చు సినిమాకి రూపాయి ఇచ్చారట. ఆ సినిమా చూసినందుకు రెండు రోజుల పాటు భోజనం మానేయాల్సి వచ్చింది. సినిమా చూసొచ్చిన తర్వాత భగత్ సింగ్ తన మిత్రుడు మహౌర్ తో 'క్రమశిక్షణ'కు కట్టుబడి ఉన్నా, నాలుగణాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆటపట్టించారు. ఆ సినిమా చూసొచ్చిన తర్వాత భగత్ సింగ్ ఆజాద్‌ను కూడా ఒప్పించి విప్లవకారులందరూ ఈ సినిమా చూడాల్సి అవసరం ఉందని నచ్చచెప్పి అందరితో చూపించారట. ఆజాద్ తన కంటే చిన్న వాళ్లను అమితంగా ప్రేమించేవాడు. వాళ్లు ఆకలితో ఉన్నారంటే బాగా క్షోభపడేవారు. అలాంటి వాడు క్రమశిక్షణ పేరిట తన తోటి వాళ్లను ఇబ్బంది పెడతారా? ఆహారం కోసం ఎక్కువ డబ్బు ఇచ్చాడు. ఆ సమయంలో భగత్ సింగ్ మహౌర్ వైపు తిరిగి కనుసైగ చేసి నవ్విన తీరు అద్భుతం.
నాస్తికత్వంపై భగత్ సింగ్...
నాస్తికత్వం విషయంలో పార్టీ సీనియర్ సభ్యుడు ఫణీంద్ర నాథ్ ఘోష్‌తో భగత్ సింగ్ తీవ్ర వాగ్వాదానికి దిగినప్పుడు జరిగిన ఒక సంఘటనను శివ వర్మ వివరించాడు. చర్చలు, వాగ్వాదాలసమయంలో చిన్నవాళ్లు తమ సీనియర్లని సవాల్ చేయడాన్ని నివారించాలన్నది వర్మ ఉద్దేశం. అయితే, భగత్ సింగ్ ఇందుకు భిన్నంగా ఉన్నారు. సీనియర్లతో కూడా విభేదించినప్పుడు ఎన్నడూ వెనక్కుతగ్గలేదు. తన వాదన చెప్పడం ఆపలేదు.
భగత్ సింగ్ నాస్తికుడు. ఇతర సభ్యులకు నాస్తికత్వాన్ని బోధించాడు. 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో విప్లవకారులను ఉద్దేశించి భగత్ సింగ్ ప్రసంగించిన తర్వాత వర్మ అమృత్‌సర్ వెళ్లి అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఫణీంద్రనాథ్ ఘోష్ అతనితో ఉన్నాడు. ఒక రోజు భగత్ సింగ్ కూడా లాహోర్ నుండి వచ్చాడు.
అక్కడ చర్చ మొదలైంది. ఘోష్ భగత్ సింగ్‌తో, "ఇండియా మరికొంత కాలం విదేశీ పాలనలో ఉండాలని దేవుడు కోరుకుంటే మనమేమీ చేయలేం" అన్నాడు. ధర్మాన్ని మరచిపోయిన భారతీయులకు వలస పాలన దైవ శిక్ష అని కూడా అన్నారు. ఆమాటకి భగత్ సింగ్ కోపం వచ్చింది. "ఇక మీరు ఆపితే మంచిది. మీది నిష్క్రియాత్మక మార్గం. మీరు మౌనంగా కూర్చోండి. ప్రతిదీ దేవునికి వదిలివేస్తారు, నిస్వార్థం, దేశభక్తి ముసుగులో మీరు ఈ దేశ యువతకు బోధించాల్సింది ఇదేనా? నేను మీ మార్గాన్ని ఎప్పటికీ అనుసరించలేను. ఈ దేశం గురించి నిజాయితీగా ఆలోచించే వారు, ఈ దేశ సంక్షేమాన్ని కోరుకునే వారు ఇన్ని భ్రమల్లో బతక్కూడదు. ఇప్పటికైనా నిజాయితీగా పోరాడండి అన్నారు.
"నాకు ఈ భూమి ఒక్కటే స్వర్గం. మరే ఇతర ప్రపంచాన్ని నమ్మను. అన్యాయం, అణచివేత, ఆకలి, పేదరికం, దోపిడీ, అసమానత, బానిసత్వం, అంటువ్యాధులు, హింస, యుద్ధాన్ని అంతం చేయడానికి మీ దేవుడు ఏమీ చేయడు ఎందుకు?" అని భగత్ సింగ్ ప్రశ్నించడంతో ఖిన్నుడైన ఫణీంద్ఱ ఘోష్, " ఈ ప్రపంచం మీలాంటి దూతలు అనేకమందిని చూసింది. మీ ధైర్యం ఎంతకాలం ఉంటుందో మేము చూస్తాం" అని బదులిచ్చాడు.
ఇలా భగత్ సింగ్ తో తమకున్న అనుభవాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. యువతకు మార్గనిర్దేశం చేసే ఇటువంటి ప్రసంగాలు, చర్చలు కొన్ని సందర్భాలలో ఇవి వివాదాస్పదం కూడా అవుతున్నాయి. భగత్ సింగ్ మాటల్ని ఇటీవల హరియాణా ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కోట్ చేసినపుడు ఆయన నీకు చెవులో చెప్పారా అంటూ ఫ్రాంక్ వీడియోలు కూడా రావడం గమనార్హం.


Read More
Next Story