
పంట ధరల్లోనూ నార్త్, సౌత్ తేడాలెందుకు?
గోధుమ పాటి చేయదా వరి? ధరల్లో ఇంత తేడాలెందుకు?
(ఎం.వి.ఎస్.నాగిరెడ్డి)
హేతుబద్ధత (రేషనలైజేషన్) లేకుండా నిర్ణయిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దత్తు ధరలతో రైతులు ప్రత్యేకించి వరి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
దేశంలో వరి, గోధుమలు దేశానికి ఆహార భద్రతనిస్తున్న ప్రధాన పంటలు. వరి ప్రధానంగా ఖరీఫ్ పంట. పూర్తి యాంత్రీకరణ సాధ్యం గాక ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండే పంటల్లో ఇదొకటి.
గోధుమ రబీ పంట. అన్నీ అనుకూలతలు ఉన్న పంట. సహజం గానే సరాసరి దిగుబడి ఎక్కువ. ఉత్పత్తి వ్యయం ఖరీఫ్ లో పండే వరి తో పోల్చితే తక్కువ అవుతుంది.
ప్రభుత్వ అధికారిక లెక్కలు కూడా అదే చూపిస్తున్నాయి.
ఏ పంట కైనా కనీస మద్దత్తు ధరల నిర్ణయానికి వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తి వ్యయం లో హెచ్చు తగ్గులు ఉంటాయి, అందుకోసం అన్ని రాష్ట్రాల ఉత్పత్తి వ్యాయాలను కలపి సంచిత సగటు (Cumulative Average) ను లెక్క కట్టి దాన్ని ప్రధానంగా తీసుకుంటారు.
దీని మూలంగా ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు, తక్కువ ఉన్న రాష్ట్రాలకు ఓకే కనీస మద్దతు ధర వస్తుంది.. తద్వారా ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు రైతులు నష్ట పోతున్నారు.
వరి విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి వ్యయం ఎక్కువ.. అందువలన ఆంధ్రప్రదేశ్ వరి రైతులు ఈ కనీస మద్దతు ధర మూలంగా నష్ట పోతున్నారు. గోధుమకు, వరి ధాన్యానికి ప్రకటించిన మద్దత్తు ధర లను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది..
2024-25 లో దేశం మొత్తం బియ్యం ఉత్పత్తి 149 మిలియన్ మెట్రిక్ టన్నులు (డి ఇ యస్ మూడవ ముందస్తు అంచనాల ప్రకారం), ఇందులో ఎగుమతులు 19.36 మిలియన్ మెట్రిక్ టన్నులు.. ఇంటర్నేషనల్ గ్రయిన్ కౌన్సిల్ (IGC) అంచనాల ప్రకారం 2025-26 సీజన్ లో ఈ ఎగుమతులు 23.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా.. బియ్యం దేశ అవసరాలకు మించి ఉండటం మూలంగా కనీస మద్దత్తు ధర గత సంవత్సరం కంటే కేవలం 69 రూ 3 శాతం పెంచి, ఉత్పత్తి వ్యయం A2 కంటే (C3 కాదు) 50% ఉండేలా గ్రేడ్ రకానికి క్వింటాలకు 2389 రూ మాత్రమే నిర్ణయించారు.
అదే గోధుమలు దేశ ఆహార అవసరాలకే సరిపడా లేవు అని దేశ ఆహార భధ్రత దేశ ఆహార ఇన్లేషన్ ను నియంత్రించటానికి 2022 మే నెల నుండి ఎగుమతులు బాన్ చేశారు.. అందువలన గోధుమకు కనీస మద్దత్తు ధర గత సంవత్సరం కంటే 160 రూ (6.6%) పెంచి, ఉత్పత్తి వ్యయం కంటే 109 శాతం ఉండేలా 2585 రూ నిర్ణయించారు..
ఇది ఒక ఎత్తు అయితే ఒకప్పుడు వరి, గోధుమ కనీస మద్దత్తు ధరలు సమానంగా ఉండేయి లేదా వరి కనీస మద్దత్తు ధరే కొంచెం ఎక్కువ ఉండేది..
ఇప్పటికీ ఉత్పత్తి వ్యయం గోధుమ కంటే వరికే ఎక్కువ ఉన్నప్పటికీ క్రమేణా గోధుమ మద్దత్తు ధర ను వరి మద్దత్తు ధర కంటే ఎక్కువ చేశారు..
2025లో గోధుమ క్వింటాల్ ఉత్పత్తి వ్యయం రూ.1239. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2585. అదే గ్రేడ్- A రకం వరి ఉత్పత్తి వ్యయం క్వింటాల్ కి రూ.1578. కానీ ఇస్తున్న కనీస మద్దతు ధర మాత్రం గోధుమ కన్నా తక్కువగా రూ.2389.
ఉత్పత్తి వ్యయం రూ 1239/క్వింటాలు ఉన్న గోధుమ కు ఈ సంవత్సరం 160 రూ పెంచి 2585 రూ కనీస మద్దత్తు ధర, ఉత్పత్తి వ్యయం కంటే 109% ఎక్కువ గా నిర్ణయించారు.
వరి విషయం లో ఉత్పత్తి వ్యయం 1579 రూ/క్వింటాలు ఉంటే ఈ సంవత్సరం కేవలం 69 రూ పెంచి 2389 రూ కనీస మద్దత్తు ధర, ఉత్పత్తి వ్యయం కంటే 50% ఎక్కువగా మాత్రమే నిర్ణయించారు. అంటే కనీస మద్దత్తు ధర నిర్ణయించడంలో వరి రైతులకు అన్యాయం జరుగుతున్నది.
ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తున్నదేమంటే.. దేశ అవసరాలకు మించి ఉత్పత్తి జరిగితే ఎగుమతుల మూలంగా ఎగుమతి పన్ను, విదేశీ కరెన్సీ వస్తున్నప్పటికి కనీస మద్దత్తు ధరల పెంపు కంటి తుడుపు చర్యగా ఉంటుంది.
సి.ఎ.సి.పి. లెక్కల ప్రకారం వేసిన ఉత్పత్తి వ్యయమే క్షేత్ర స్థాయిలో వాస్తవంగా అవుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా లేదు. గోధుమ రైతులకు ఎక్కువ ఇచ్చారని మేము అనటం లేదు. దేశ వ్యాప్తంగా అన్ని పంటలకు పెరుగుతున్న ఖర్చుల కనుగుణంగా కనీస మద్దత్తు ధరలు పెరగక రైతాంగం సంక్షోభం లోనికి వెళుతున్నారని రైతు సంఘాలన్నీ ఆందోళన చేస్తున్న పరిస్థితిలో వరి రైతులకు కూడా న్యాయం జరగాలని మా కోరిక..
ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పంటల సాగు 1/10/2025 వరకు 68.57 లక్షల ఎకరాలు జరిగితే ఇందులో 37.21 లక్షల ఎకరాలు 54% వరి సాగు జరిగినది.. దేశవ్యాప్తంగా కూడా అన్ని పంటలలో 39.64% వరి సాగు జరిగినది..
1950 లో మన దేశ జనాభా 35 కోట్లు..ఆహార ధాన్యాల ఉత్పత్తి 35 మిలియన్ మెట్రిక్ టన్నులు..ఒక కోటి జనాభా కి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులు..దేశ ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేక రష్యా నుండి గోధుమలు దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితి..
2024-25 లో దేశ జనాభా 146 కోట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి 332 మిలియన్ మెట్రిక్ టన్నులు.. ఒక కోటి జనాభా కి 2.27 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఇందులో బియ్యం ఉత్పత్తి 149 మిలియన్ మెట్రిక్ టన్నులు (44.87%).. అంటే దేశానికి ఆహార భద్రత నందించటం లో ప్రధాన పాత్ర వరి రైతులది..
రైతు కు ఆదాయం తాను పండించిన పంటకు ఉత్పత్తి వ్యయానికి.. అమ్మకం ధర కు మధ్య నున్న వ్యత్యాసం మాత్రమే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ సి ఎ సి పి కి సమర్పించిన ఉత్పత్తి వ్యయం అంచనాలు Grade A రకానికి 2024-25 ఖరీఫ్ ఖర్చుల ప్రకారం 2025-26 ఖరీఫ్ లో కనీస మద్దత్తు ధరల నిర్ణయం కోసం..
హెక్టారు నెట్ ఖర్చు C3 ప్రకారం *1,37,451*రూ..
హెక్టారు సరాసరి దిగుబడి 54 క్విన్టాళ్ల చొప్పున ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం 2,545 రూ..దీనిపై స్వామినాధన్ కమిటీ రికమండేషన్ ల ప్రకారం ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా కలిపి *3818 రూ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సి ఎ సి పి కి ప్రతి పాదించినది..
హెక్టారు నెట్ ఖర్చు గ్రేడ్ A రకానికి A2 ప్రకారం అయినా 1,00,710 రూ..ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం 1,865 రూ..
దేనికి గాను ఆంధ్రప్రదేశ్ రైతులకు వచ్చిన కనీస మద్దత్తు ధర 2389 రూ..A2 మీద కేవలం 27 శాతం మాత్రమే..
ఈ వ్యత్యాసం తక్కువగా ఉండటం మూలంగా ఖరీఫ్ లో వరి పంట ప్రధాన మైన రాష్ట్రం గా, ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కువ నష్ట పోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వరి పంట సాగు చేసేది 80% కౌలు రైతులు.. ఇప్పటికే ఈ వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని కవులు డిమాండ్ తగ్గి పోతున్నది.
కృష్ణ, గోదావరి, పెన్నా డెల్టాలలో KC కెనాల్, నాగార్జున సాగర్ కాలువ లలో నీరు పారుతున్నంత వరకు ఖరీఫ్ లో వరి పంట కు ప్రత్యామ్నాయం లేదు..
అత్యంత సారవంత మైన, అత్యంత సాగునీటి వనరులు గలిగిన గోదావరి డెల్టా లో దేశ చరిత్ర లోనే మొట్టమొదటిగా లక్ష ఎకరాలలో 2011 ఖరీఫ్ లో ఈ పంట మాకు గిట్టుబాటు గావటం లేదు అని వరి రైతులు సాగు సమ్మె చేసిన విషయం మనకు తెలిసినదే..
అందువలన కనీసం గోధుమతో సమానంగా నైనా వరి కనీస మద్దత్తు ధర ను కూడా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 2025-26 ఖరీఫ్ కు కనీస మద్దత్తు ధరలు ప్రకటించేసినందున ధాన్యానికి క్వింటాలుకు 200 రూ బోనస్ ఈ సంవత్సరానికి ప్రకటించవలసినదిగా కోరుచున్నాను..
పెరుగుతున్న కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు, పురుగుమందుల ఖర్చు, రవాణా ఖర్చు ల కనుగుణం గా కనీస మద్దత్తు ధరలు పెరగక పోతే, ప్రకటించిన మద్దత్తు ధరలకు కొనుగోలు జరగక పోతే వ్యవసాయ రంగం మనుగడే ప్రశ్నార్ధకం కానున్నది. ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం.
(రచయిత- వ్యవసాయ శాస్త్రవేత్త, YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, రైతుబంధు మాజీ సభ్యులు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యులు
Next Story