పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చంద్రబాబు మౌనం ఎందుకు?
x

పవన్ కల్యాణ్ 'సనాతన ధర్మం'పై చంద్రబాబు మౌనం ఎందుకు?

పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సనాతన ధర్మంపై రగడ జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పడం లేదు. మైనారిటీల ఓట్లు పోతాయనా, లేక వేరే ప్లాన్ ఉందా?


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? అందుకే టీడీపీ నేతలు గాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గాని ఆ వ్యవహారమై నోరు విప్పడం లేదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ మతానికి ప్రచారం చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పార్టీ నేతలెవ్వరూ మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన పదవి సహా ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో వారాహి డిక్లరేషన్ విడుదల సందర్భంగా ప్రకటించారు. ఈ వ్యవహారమై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.


పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. "ఒక రాజ్యాంగబద్ద బాధ్యతలో ఉంటూ ఒక మతతత్వ ప్రతినిధిలా ఇతర మతాలను తూలనాడే విధంగా వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్దం. రాజ్యాంగ విహితమైన లౌకికతత్వాన్ని గౌరవించాల్సింది పోయి ‘‘సూడో సెక్యులరిజం’’ అంటూ చులకనగా మాట్లాడడం, మంత్రిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. న్యాయ స్థానాలకు ఉద్దేశాలు ఆపాదించి, వ్యాఖ్యలు చేయడం న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడమే.

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన రాజ్యాంగ పీఠికలో ప్రముఖమైన సెక్యులరిజాన్ని విమర్శించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. మత సామరస్యాన్ని కోరుకునే వారిని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే వారిని సూడో సెక్యులరిస్టులు అంటూ లౌకికవాదాన్ని హేళన చేయడం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ ఉచ్చులో పడి రాష్ట్రానికి హాని చేయడమే" అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం దేశవ్యాప్తంగా చట్టాన్ని తేవాలని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేయడం ఈ దేశ సెక్యులర్‌ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడమే అన్నారు ఆయన. సనాతన ధర్మమంటే నిర్వచనం ఏమిటో అది ఏ పురాణాల్లో వుందో చెప్పాలని పవన్ కల్యాణ్ ను నిలదీశారు శ్రీనివాసరావు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, అంటరానితనం, లింగ వివక్ష వంటి జాడ్యాలతో కూడి ఉన్న వ్యవస్థేనా పవన్ చెబుతున్న సనాతన ధర్మమంటే? ఇదే అయితే ఈ దేశ రాజ్యాంగం, అత్యధికమంది ప్రజలు సమానత్వ ధర్మాన్ని కోరుకుంటున్నారని ఆయన గుర్తించాలి కూడా విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సమితీ మరో అడుగు ముందుకు వేసి పవన్ కల్యాణ్ ఈ దేశ లౌకిక వ్యవస్థలో చిచ్చుపెడుతున్నారని, దీన్ని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. "న్యాయ వ్యవస్థను తూలనాడుతూ, దానికి ఉద్దేశాలు ఆపాదించడం పవన్‌కళ్యాణ్‌ గౌరవాన్నే తగ్గిస్తుంది" అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.
దేశంలో మత విద్వేష ధోరణులు పెరిగి సమైక్యత, సమగ్రతలకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి విద్వేష వ్యాఖ్యలు రాష్ట్రానికి చేటు చేస్తాయని వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండవలసింది పోయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ప్రమాదకరం. ఈ ధోరణులను నిరసించవలసిందిగా, మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు, మేధావులు, యువత, మహిళలు, వివిధ సామాజిక శక్తులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
పవన్ ఎన్నికలకు ముందు ఈ మాట ఎందుకనలేదు?
పవన్ కల్యాణ్ గాని ఆయన భాగస్వామ్య పార్టీ టీడీపీ గాని 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సనాతన ధర్మం మాటను ప్రస్తావించలేదు. ఆయా పార్టీల ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని పేర్కొనలేదు. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ "నిర్భయమైన సనాతన హిందూ ధర్మం" గురించి మాట్లాడడం వల్ల ఆయన వైఖరిలో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరునికి ధర్మపరంగా విశ్వాసం, ఆచరణ, వ్యాప్తికి స్వేచ్ఛనిచ్చింది. పవన్ కల్యాణ్ లో వచ్చిన ఈమార్పు ఇండియా లాంటి విభిన్న మతాలు, జాతులు ఉన్న దేశంలో ఏదో ఒక మతానికి వత్తాసు పలికేలా ఉంది. సెక్యులర్ సూత్రాల నుంచి పక్కకు తప్పుకున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చకు వస్తున్న ప్రశ్నలు ప్రధానంగా ఇలా ఉన్నాయి.
అవి-1. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ లేదా ఆయన పార్టీ- సనాతన ధర్మాన్ని ఇతర సమస్యల కంటే ప్రాధాన్యత కలిగిందని ఎందుకు ప్రకటించలేదు?
2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మైనార్టీల రక్షణకు హామీ ఇస్తోంది. అలాంటపుడు ఈ సనాతన ధర్మం మైనారిటీలకు ఇస్తున్న హామీ ఏమిటీ?
3. అన్ని వర్గాల సాంస్కృతిక, విద్యా హక్కులను రాజ్యాంగం హామీ ఇస్తున్నప్పుడు బాధ్యత కలిగిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై దృష్టి పెట్టడం అన్ని మతాల సమానత్వం, గౌరవాన్ని కాపాడే విస్తృత రాజ్యాంగ పరిధిలో ఇముడుతుందా?
4. వివిధ మతాలు, కులాల ప్రజల హక్కుల్ని పవన్ కల్యాణ్‌ కాపాడతారని భావిస్తూ ఓటు వేశారు. కానీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించడంపై మాత్రమే ఆయన దృష్టి పెట్టినట్టు ఆయన చేస్తున్న ప్రకటనల బట్టి అర్థమవుతోంది. అలాంటపుడు రాజ్యాంగం మైనారిటీలకు ఇచ్చిన హామీలను పవన్ పట్టించుకుంటారా లేదా?
5. భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే భారతదేశాన్ని "సార్వభౌమ, సమాజవాద, సెక్యులర్, ప్రజాస్వామ్య రిపబ్లిక్"గా పేర్కొంటుంది. ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ ఓ మతంపైన్నే దృష్టి పెట్టడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం కాదా? తాను పదవి చేపట్టబోయే ముందు చేసిన ప్రమాణానికి ఇది విరుద్ధం కాదా?
చంద్రబాబు మౌనం దేనికి సంకేతం?
ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ సభలలో ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డుకు సంబంధించి దీక్ష చేయడం దేనికి సంకేతమని సామాజిక విశ్లేషకుడు ఎం.విద్యాసాగర్ ప్రశ్నించారు. రాజకీయాలలో మతం పాత్ర గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (మతం, జాతి, కులం, లింగం, లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష నిషేధం)లో పేర్కొన్న సెక్యులర్ సూత్రాలతో పవన్ కల్యాణ్ ఎక్కడ, ఎలా సరిపోతుంది అని ఆయన ప్రశ్నించారు.
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన డెప్యూటి వ్యాఖ్యలపై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. తిరుమల తిరుపతి లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చింది చంద్రబాబే. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. వివాదం మొదట్లో భిన్న వాదనలు వినిపించిన తెలుగుదేశం టార్గెట్ అంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతం చుట్టూతే తిరిగింది తప్ప సనాతన ధర్మంపై నోరు మెదపలేదు. చివరకు టీడీపీతో జట్టు కట్టిన బీజేపీ కూడా పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ వాదనతో ఏకీభవిస్తున్నట్టు లేరు.

ప్రాంతీయ పార్టీలకు వాళ్ల రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారమే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాలలో సుమారు 70,75 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం మైనారీటల ప్రభావం ఉంటుంది. అటువంటి ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ ప్రసంగాలు ఉంటున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. క్రిస్టియన్ మైనారిటీలు కూడా చాలా నియోజవర్గాలలో ప్రభావం చూపుతారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలవాలన్న వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలి. తాను హార్డ్ కోర్ హిందువునని, హిందూ సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమని, లౌకికవాదమంటే వన్ సైడ్ వాదన కాదని అంటున్నారు. అయినా చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. దీనివల్ల మున్ముందు మైనారిటీ వర్గాలు పార్టీకి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడం వల్ల జరిగే నష్టమేమిటో చంద్రబాబుకు తెలియంది కాదు. ఒకసారి ఎన్నికైన తరువాత రాజ్యాంగ విలువల నుంచి పక్కకు తప్పుకుంటే సరిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. రాజకీయ నాయకులను దారిలో పెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు ఆ పని చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారో, ఆయన మదిలో ఏముందో అర్థం కావడం లేదన్నారు పౌర హక్కుల కార్యకర్త ఎం.శేషగిరిరావు. పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వ భాగస్వామి. భాగస్వామ్య పక్షాలు చేసే వ్యాఖ్యలన్నింటికీ చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన సనాతన ధర్మంపై ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్ నానాటికీ ఎక్కువ అవుతోంది.


Read More
Next Story