ఆంధ్రా బిజెపి చీఫ్ మాధవ్ తొలి గురి తప్పిందా?
x
Vijayawada Lenin Center

ఆంధ్రా బిజెపి చీఫ్ మాధవ్ తొలి గురి తప్పిందా?

తన రాజకీయ ప్రయోజనం కోసం కవిసామ్రాట్ విశ్వనాథను మాధవ్ వాడుకుంటున్నారా?


విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ఆంధ్రా బీజేపీ కొత్త చీఫ్ పివిఎన్ మాధవ్ ఎందుకు అన్నారు? మాధవ్ కు పనీపాటా లేదా? బాధ్యతలు తీసుకోగానే జనానికి పనికొచ్చే నాలుగు మాటలు చెప్పకుండా ఇటువంటి వివాదాస్పద వాఖ్యలు చేయడం ఏమిటి అంటూ పలువురు చర్చించుకోవడం జరుగుతోంది.

లెనిన్ సెంటర్ పేరుపై వచ్చిన వివాదం పై లెనిన్ సెంటర్లో తిరిగి, బిజెపి మాధవ్ చేసిన ప్రతిపాదన మీద అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం ‘ది ఫెడరల్ ప్రతినిధి’ ప్రయత్నించారు. చాలా మంది షాపుల్లో కొనుగోలు చేయడానికి వచ్చిన వారి నుంచి వస్తున్న మాటలు వింంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పేరు మార్పిడి ఇపుడెందుకు అనడం వినిపించింది.
‘లెనిన్ విగ్రహం ఉన్న ఏరియాకు లెనిన్ సెంబర్ అని ఎవ్వరూ పేరు పెట్టలేదు. రష్యానుంచి తెప్పించిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టిన తరువాత ఈ ఏరియాను ప్రజలు లెనిన్ సెంటర్ అని పిలవడం మొదలు పెట్టారు.
ఇది ఎవరో పెట్టింది కాదు. ప్రజలందరూ పిలవడం ద్వారా వచ్చింది. అంతే,’ అని వ్యాపారాలు చేసుకుంటున్నవారిలో పెద్దవాళ్లు అనడం విశేషం.
అదే ఏరియాలో. విశ్వనాథసత్యనారాయణ విగ్ర.హం వద్ద ఫ్రూట్స్ షాప్ పెట్టుకున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ నేను 30 ఏళ్లుగా ఇక్కడే షాపు పెట్టుకుని బతుకుతున్నాను. నాకు తెలిసినప్పటి నుంచి లెనిన్ సెంటర్ అనే పిలుస్తున్నారు. ఈ పేరు మారిస్తే వచ్చ ప్రయోజనం ఏమిటి అని ఎదురు ప్రశ్నవేశాడు.
“పక్కనే అలంకార్ సెంటర్ ఉంది. దాని పేరు మార్చినా అలంకార్ సెంటర్ అంటారు కానీ కొత్తగా పెట్టిన పేరుతో పిలవరు అన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ బందర్ రోడ్డుకు మహాత్మాగాంధీ రోడ్డు అని పేరు పెట్టారు. ఎక్కవ మంది బందర్ రోడ్డు అంటారే కాని మహాత్మాగాంధీ రోడ్డు అని పిలవటం లేదన్నారు. బందర్ రోడ్డులో గతంలో కాందారీ హోటల్ ఉంది. దాని స్థానంలో మురళీ ఫార్చున్ హోటల్ వచ్చింది. అయినా బయట నుంచి విజయవాడకు వచ్చే వారు సిటీ బస్ ఎక్కి కాందారీ దగ్గర ఆపండి అంటారే తప్ప మురళీ ఫార్చ్యూన్ హోటల్ అని చెప్పటం లేదన్నారు,” అక్కడ షాపింగ్ కు వచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు.
“ఇలాంటి ఉనికి లేకపోయినా పేరు పడిన సెంటర్లు వూరూర ఉంటాయి. హైదరాబాద్ లో చాలా చోట్ల సినిమా హాళ్లు మాయమయ్యాయి. ఆ సర్కిల్స్ కి సినిమా ధియోటర్ల పేర్లు స్థిరపడ్డాయి. లిబర్టీ, సంగీత్, కల్పన సెంటర్లు ఏమిటి? ఇదీ అంతే. ప్రజలు పెట్టుకున్న పేరు. వాళ్లంతా కమ్యూనిస్టులు కాదు. వాళ్లలో కాంగ్రెసోళ్లున్నారు, బిజెపి వాళ్లున్నారు, కమ్యూనిస్టులున్నారు,” లని హైదరాబాద్ నుంచి ఏదో పనిమీద విజయవాడవచ్చిన మరొక వ్యక్తి చెప్పారు.
ఇది ప్రజాభిప్రాయం. మాధవ్ మరొక విషయం తెలుసుకోవాలి. కొంతమంది నాయకులు ఏదేశానికి చెందిన వాళ్లయినా విశ్వమానవులవుతారు. గాంధీజీ, నెహ్రూ, అబ్రహాం లింకన్, కెన్నడీ నెల్సన్ మండేలా, రవీంద్రనాథ్ టాగోర్, లెనిన్, మార్క్స్, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్... ఇలా కొంతమంది విశ్వమానవులతారు. వాళ్లకు ప్రజలు తమ హృదయాల్లో వాళ్లకి గుడి కడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది అజాద్ లు, బోస్ లు, లెనిన్లు లేరు? లెనిన్ అనే విగ్రహం రష్యాకే పరిమితం కాదు, భారతదేశంలో లెనిన్ పేరు తెలియని వాళ్లుండరు. కమ్యూనిస్టులు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉండవచ్చు, 40 యేళ్లుగా ఆ విగ్రహం విజయవాడ సాంఘిక జీవనంలో విడదీయరాని భాగమయింది. విజయవాడలో ఎన్నిమాల్స్ ఉన్నా, మధ్య తరగతి వాళ్లు, పుస్తకాల ప్రియలు తప్పని సరిగ్గా సందర్శించే ప్రాంతంగా లెనిన్ సెంటర్. దీనికి కమ్యూనిజానికి సంబంధం లేదు.
విశ్వనాథ ఒప్పుకునే వారా?
లెనిన్ సెంటర్‌ను విశ్వనాథ సత్యనారాయణ సెంటర్‌గా మార్చాలని మాధవ్ అనడం చిత్రంగా ఉంది. విశ్వనాథ సత్యనారాయణ, తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయనది ఉన్నతమయిన వ్యక్తిత్వం. భారతీయ సాంప్రదాయ సాహిత్యంలో గొప్ప పది పేర్లు తీయమంటే అందులోవిశ్వనాథ పేరు ఉంటుంది. ఎవరి పేరో తీసేసి, ఎవరి విగ్రహమో తీసేసి ఆయన పేరు పెట్టడానికి మహాపండితుడైన విశ్వనాథ సత్యనారాయణ కూడా అంగీకరించి ఉండే వారు కాదు. మాధవ్ విశ్వనాథ పేరు చెప్పే ముందు ఆయన వ్యక్తిత్వం తెలుసుకుని కూడా ఉండాలి.
మాకెందుకొచ్చింది సార్...
లెనిన్ సెంటర్ పేరు మార్చేందుకు ఈ సెంటర్ లో ఎవరూ సుముఖంగా లేరు. పైకి మాట్లాడేందుకు సుముఖత చూపడం లేదు. ఈ ఏరియాకు పేరు మార్చాలన్న కోరిక ఏమిటో వాళ్లకు అర్థం కావడం లేదు.ఆ ఏరియాలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు పేరు మార్చాలంటాడేమిటని చాలా మంది ఆశ్యర్చపోయారు. అయితే మైక్ ముందు ఈ విషయం మాట్లాడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కారణం. భయం. తమ పేర్లు బయటకు వస్తే ఇక్కడి నుంచి మునిసిపాలిటీ వాళ్లో, మరొకరో మా షాపులు తొలగిస్తారని భయం అందుకే తాము మాట్లాడలేమని కొందరు చెప్పటం విశేషం.
పాత పుస్తకాల షాపు నిర్వహించుకునే జగన్ మోహన్ రావు మాట్లాడుతూ పేరు మార్చాలనే మాటలు సరైనవి కాదన్నారు. నేను 30 ఏళ్లుగా ఇక్కడే షాపు నడుపుతున్నాను. ఎవ్వరూ ఈ ప్రాంతానికి రానప్పుడు సిటీ బస్ లు ఆగే ప్రదేశం లెనిన్ విగ్రహం దగ్గరే ఉన్నందున బస్ ఎక్కి వచ్చి దిగేవారు, లెనిన్ సెంటర్లో ఆపాలని కండక్టర్ ను కోరే వారు ఆ విధంగా పూర్తి స్థాయిలో పేరు స్థిరపడిందన్నారు.
ఇది విజయవాడ చరిత్ర
లెనిన్ విగ్రహం, లెనిన్ సెంటర్ అనే మాట వినక విజయవాడ చరిత్ర. విగ్రహం మార్చేస్తే చరిత్రపోదు. ఒకప్పుడు కమ్యేనిస్టులకు విజయవాడ బలమైన కేంద్రం. 1981 కమ్యూనిస్టు పార్టీకి చెందిన టీ వెంకటేశ్వరావు మొదటి మేయర్ అయ్యారు. ఆయన సిపిఐ నుంచి గెలిచారు. ఆ తరువాత చాలా కాలం తర్వాత తాడి శంకుంతల సీపీఐ నుంచి గెలిచి మేయర్ గా పనిచేశారు. స్లమ్ ఏరియాల ప్రజలు పూర్తి స్థాయిలో కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేవారు. పార్టీ నుంచి చనిపోయిన వారి విగ్రహాలు ఆ ఏరియాల్లో కమ్యూనిస్ట్ లు ఎక్కువగా ఆవిష్కరించే వారు. ఇప్పటికీ అటు వంటి విగ్రహాలు కృష్ణలంక ప్రాంతంలో వీధికొకటి కనిపిస్తాయి. ఇలా ప్రతి డివిజన్ లోనూ కమ్యూనిస్ట్ లకు కార్యాలయాలు కూడా ఉన్నాయి. సీపీఎం, సీపీఐ విడిపోయిన తరువాత కూడా రెండు పార్టీల వారు నగరంలో బలంగానే ఉన్నారు.
కమ్యూనిస్టుల ప్రభావమే...
విజయవాడలో కమ్యూనిస్ట్ ల ప్రభావం లెనిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చింది. మునిసిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాన్ని చూసి ఏర్పాటు చేశారు. ఆ తరువాత అక్కడ ప్రజా ఉద్యమ సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా లెనిన్ సెంటర్ పేరు మరింత బలపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
విజయవాడలోని లెనిన్ సెంటర్ పేరు మార్పు గురించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చను రేకెత్తించాయి. ఈ సెంటర్‌ను కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరుతో మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది రాష్ట్రంలో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ఈ చర్చ గత ప్రభుత్వాల్లో కూడా జరిగినప్పటికీ, మాధవ్ ఈ అంశాన్ని తాజాగా లేవనెత్తడం వెనుక రాజకీయ ఉద్దేశాలు, చారిత్రక నేపథ్యం, సామాజిక డైనమిక్స్ ఉన్నాయి.
లెనిన్ సెంటర్ పేరు
లెనిన్ సెంటర్ విజయవాడలోని బీసెంట్ రోడ్ చివరిలో ఉన్న ఒక ప్రముఖ షాపింగ్, వాణిజ్య కేంద్రం. ఈ ప్రాంతం పేరు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో ఉన్న చారిత్రక నేపథ్యం నుంచి వచ్చింది. కమ్యూనిస్ట్ నాయకుల వాదన ప్రకారం ఈ ప్రాంతంలో సోవియట్ విప్లవ నాయకుడు లెనిన్ విగ్రహం స్థాపించబడిన తర్వాత, ప్రజలు కాలక్రమంలో ఈ ప్రాంతాన్ని "లెనిన్ సెంటర్"గా పిలవడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం 1970లలో స్థాపించబడినట్లు చెబుతారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న కాలంలో జరిగింది. ఈ పేరు అధికారికంగా ప్రభుత్వం ద్వారా పెట్టబడినది కాదు. కానీ సామాజికంగా, రాజకీయంగా ఈ ప్రాంతం ఈ పేరుతో స్థిరపడింది.
మాధవ్ డిమాండ్ వెనుక రాజకీయ ఉద్దేశాలు
పీవీఎన్ మాధవ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా 2025 జూలై 9న బాధ్యతలు స్వీకరించిన వెంటనే, లెనిన్ సెంటర్‌ను విశ్వనాథ సత్యనారాయణ సెంటర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పనులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజలకు పనికొచ్చే పనులు చేసి ప్రశంసలందుకుంటే ప్రజల వూర్లో ఉన్నవిగ్రహాలను, వీధుల పేర్లను మర్చిపోయి మాధవ్ పేరు గుర్తు పెట్టుకుంటారు. తెలుగుదేశం నాయకత్వంలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఉత్తరాంధ్రకు భారీ సాయం చేయించడమూ, విజయవాడనగరాన్ని ఉన్నతంగా తీర్చిదద్దడమో చేయాలి. బహుశా అలా చేయడం అంత సులభం కాదు కాబట్టి ఆయన ఈ లెనిన్ విగ్రహం మీద గన్ గురి పెట్టారేమో అనిపిస్తుంది.
మాధవ్ ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుక పాలనా సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ఉద్దేశం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) అధికారంలోకి రావడం, పాలనా సవాళ్లను ఎదుర్కొంటోంది. లెనిన్ సెంటర్ వంటి అంశాన్ని లేవనెత్తడం ద్వారా, మాధవ్ రాజకీయ చర్చను మళ్లించి, బీజేపీ జాతీయవాద ఇమేజ్‌ను బలపరచడానికి ప్రయత్నించారనే విమర్శలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ ల రాజకీయ ప్రభావం గతంలో బలంగా ఉన్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో క్షీణించింది. లెనిన్ సెంటర్ పేరు మార్పు డిమాండ్ ద్వారా మాధవ్ వామపక్ష ఉనికిని సాంకేతికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీజేపీ రాజకీయ శత్రువులను లక్ష్యంగా చేసుకునే వ్యూహంలో భాగంగా చూడవచ్చు.
కమ్యూనిస్ట్ ల వాదనలు
కమ్యూనిస్ట్ నాయకులు మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. వారి వాదన ప్రకారం లెనిన్ సెంటర్ పేరు స్థానిక చరిత్ర, వామపక్ష ఉద్యమాల గుర్తుగా నిలిచింది. లెనిన్ విగ్రహం స్థాపన తర్వాత, ప్రజలు స్వచ్ఛందంగా ఈ పేరును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇది అధికారిక నామకరణం కంటే సామాజిక ఆమోదంగా ఏర్పడింది. సీపీఎం నాయకులు లెనిన్ సంస్కరణలు, రష్యాలో ఆయన చేసిన మార్పులను గుర్తు చేస్తూ, ఈ పేరు మార్పు డిమాండ్‌ను ‘భావజాల దురుద్దేశం‘గా అభివర్ణించారు
Read More
Next Story