మడకశిర త్రిముఖ పోటీలో ఓటర్లు ఎటువైపు
x

మడకశిర త్రిముఖ పోటీలో ఓటర్లు ఎటువైపు

మడకశిర త్రిముఖ పోరు జరగనుంది. దీంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. కానీ ఓటరు ఎవరిని ఎన్నుకుంటారు అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.


శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాజకీయం రసవత్తరంగా మారింది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎం.ఎస్‌.రాజు, వైఎస్సార్‌సీపీ నుంచి ఈర లక్కప్ప, కాంగ్రెస్‌ నుంచి కరికెర సుధాకర్‌ పోటీలో ఉన్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య మనస్పర్థల కారణంగా ఈరన్న వర్గానికి చెందిన కొంతమంది తమకు సహకరిస్తున్నందున సునాయాసంగా విజయం సాధిస్తామనే ధీమాతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ బలపడినందున ఎక్కువగా వైఎస్సార్‌సీపీ ఓట్లు చీలుతాయని దీంతో టీడీపీ విజయం తథ్యం అని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయి వరకు వెళ్లినందున అన్ని వర్గాల వారు తమవైపే ఉన్నందున గెలుపు సాధించినట్లేనని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ విజయం కోసం రఘువీరారెడ్డి సుడిగాలి పర్యటన..

నియోజకవర్గంలో తన పట్టు సాధించుకునేందుకు మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మడకశిర జనరల్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎన్‌.రఘువీరారెడ్డి 1989, 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్‌కు కేటాయించడంతో రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఒకసారి పెనుకొండ, మరోసారి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన ఓటమి చెందారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌ను గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికి తోడు మడకశిర కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావడంతో అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ రోజున దాదాపు రూ. 50 లక్షల వరకు ఖర్చు చేశారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో పార్లమెంట్‌ ఎన్నికలు అయిపోగానే అక్కడి ముఖ్యనేతలు సైతం మడకశిరలో కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌ విజయం కోసం ప్రచారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

విజయంపై ధీమా ఉన్నా టీడీపీకి వర్గ పోరు..

తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. తొలుత మడకశిర అభ్యర్థిగా ఈరన్న కుమారుడు సునీల్‌ కుమార్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే సునీల్‌ కుమార్‌ అభ్యిర్థత్వాన్ని మొదటి నుంచి తిప్పేస్వామి వ్యతిరేకిస్తూ వచ్చారు. వారిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో తిప్పేస్వామి సూచించిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, శింగనమల నియోజకవర్గానికి చెందిన ఎం.ఎస్‌.రాజుకు బి–ఫాం ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఈరన్న రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే సోమవారం టీడీపీ ముఖ్యనేతలు ఈరన్నతో ఫోన్‌లో మాట్లాడి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు కుమారుడు సునీల్‌ కుమార్‌కు టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ వారిద్దరూ కలిసి పని చేసే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు. వీరిద్ధరి మధ్య సఖ్యత లేనందున ఈరన్న వర్గీయులు కొందరు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి లోలోపల కృషి చేస్తున్నట్లు సమాచారం.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైఎస్సార్‌సీపీ ధీమా..

ప్రస్తుత ఎమ్మెల్యే ఎం.తిప్పేస్వామిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో సామాన్య కార్యకర్త అయిన ఈర లక్కప్పకు వైఎస్సార్‌సీపీ తరపున సీటు ఇచ్చారు. టికెట్‌ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న తిప్పేస్వామి ప్రచారంలో కూడా పెద్దగా కన్పించడం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పుంజుకోవడంతో వైఎస్సార్‌సీపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశాలున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Read More
Next Story