ఆంధ్రాలో జిల్లాల విభజన ఎవరికి లాభం?
x
ఆంధ్రప్రదేశ్ మ్యాప్

ఆంధ్రాలో జిల్లాల విభజన ఎవరికి లాభం?

గతంలో సగటున ప్రతి జిల్లాకు 38 లక్షల జనాభా ఉంటే ఇప్పుడది 17 లక్షలకు తగ్గిందని అంచనా..


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా పెద్ద చర్చకు దారి తీసింది. పరిపాలన ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశమా? లేక రాజకీయ లెక్కలతో చేసిన వ్యూహమా? అనే ప్రశ్నలు సహజంగానే ముందుకొస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం 2022లో రాష్ట్రాన్ని 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా విభజిస్తూ పరిపాలనలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ‘ప్రజలకు పరిపాలన చేరువ కావాలి’ అన్న లక్ష్యంతో జిల్లాల సంఖ్యను రెట్టింపు చేసినట్టు జగన్ సర్కారు ఆవేళ చెప్పింది. అయితే మౌలిక వసతులు, సిబ్బంది, ఆర్థిక వనరుల సన్నాహకాలు తగిన స్థాయిలో లేకపోవడంతో కొన్ని జిల్లాలు కేవలం పేరుకే పరిమితమయ్యాయనే విమర్శలు ఎదురయ్యాయి.

2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరోసారి సమీక్ష చేపట్టింది. ప్రజాభిప్రాయాలు, పరిపాలనా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ జిల్లాల సంఖ్యను 28కి పెంచింది.
గతంలో 13 జిల్లాలు ఉన్నప్పుడు సగటున ప్రతి జిల్లాకు 38 లక్షల జనాభా ఉండేది. ఇప్పుడు అది 17.7 లక్షలకు తగ్గింది. దీనివల్ల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రజల సమస్యలపై పర్యవేక్షణ సులభం అవుతుంది.
పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపనుంది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అవుతాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్ని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో కలవనున్నాయి.
ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్‌లో మార్పులు, చేర్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్‌ను నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఈ డివిజన్‌లో మిగిలే మండలాల్లో.. వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్‌లో, బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్‌లో కలుపుతారు. కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు.
2026 జనవరి 1 నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభం అవుతుంది. మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.
ప్రభుత్వం చెబుతున్న కారణమేమిటంటే..
ప్రభుత్వ వాదన ప్రకారం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రజలకు సేవలు అందడం కష్టంగా మారింది. రెవెన్యూ, పోలీస్, సంక్షేమ శాఖల పనితీరు మెరుగుపడాలంటే చిన్న పరిపాలనా యూనిట్లు అవసరం. అభివృద్ధి ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించడమే లక్ష్యమని చెబుతోంది. ఇది వినడానికి సరైన వాదనగానే కనిపిస్తోంది. నిజమే, కొన్ని జిల్లాలు భౌగోళికంగా పెద్దవిగా ఉండటంతో ప్రజలు పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
అయితే అనుమానాలు ఎందుకు?
కానీ జిల్లాల విభజనపై విమర్శకుల సందేహాలు కూడా తక్కువేమీ కావు. రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకునే ప్రయత్నమా? అనే అనుమానాలను వామపక్ష పార్టీలు, వైసీపీ నాయకులు వ్యక్తం చేశారు.
చిన్న జిల్లాలు అంటే జిల్లా స్థాయి నాయకత్వం పెరుగుతుంది. జిల్లా అధ్యక్షులు, బోర్డులు, కమిటీలు వంటివన్నీ రాజకీయంగా ప్రభావం పెంచుకునే అవకాశాలే.
సరిహద్దుల ఎంపికలో రాజకీయ ఒత్తిడులు..
ఏ మండలం ఏ జిల్లాలో ఉండాలి అన్న విషయంలో ప్రజాభిప్రాయాలకన్నా రాజకీయ ఒత్తిడులే ఎక్కువగా పని చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల లెక్కలు కారణమే...
కొత్త జిల్లాలు అంటే కొత్త అధికార వ్యవస్థలు. అధికార యంత్రాంగం పునర్వ్యవస్థీకరణ ఎన్నికల సమయంలో ప్రభావం చూపుతుందనే అనుమానం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
చిన్న జిల్లాల వల్ల లాభాలు ఏమిటి?
నిజంగా అమలైతే చిన్న జిల్లాల వల్ల కొన్ని స్పష్టమైన లాభాలు ఉండే అవకాశముంది. జిల్లా కేంద్రాలు ప్రజలకు దగ్గరవుతాయి. అధికారులతో ప్రత్యక్ష సంబంధం పెరుగుతుంది. ఫిర్యాదుల పరిష్కారం వేగవంతమయ్యే అవకాశం ఉంది. స్థానిక అభివృద్ధి అవసరాలపై ఫోకస్ పెరుగుతుంది. సరిగా అమలు చేస్తే ఇది పరిపాలనా వికేంద్రీకరణకు దోహదపడుతుంది.
మరి నష్టాలు ఏమిటీ?
ఇదే సమయంలో కొన్ని కీలక ప్రమాదాలూ ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అంటే భారీ పరిపాలనా ఖర్చు, భవనాలు, సిబ్బంది, వాహనాలు, మౌలిక వసతులపై అదనపు భారం. చిన్న జిల్లాలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబడగలవా అన్న సందేహం కలుగుతుంది. జిల్లాల మధ్య వనరుల అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అప్పుల భారం ఉన్న రాష్ట్రానికి ఇది దీర్ఘకాలికంగా భారంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది.
ప్రజా ప్రయోజనమా, రాజకీయ ప్రయోజనమా?
జిల్లాల విభజన చెడ్డ నిర్ణయమేమీ కాకపోయినా దాని ఉద్దేశం, అమలు తీరుపైనే అసలు ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రజల సౌలభ్యం, సేవల నాణ్యతే లక్ష్యమైతే ఇది సమర్థించదగిన సంస్కరణ.
అదే రాజకీయ సమీకరణలు, అధికార బలపాటమే లక్ష్యమైతే ఇది మరో పరిపాలనా భారంగా మారే ప్రమాదం ఉంది.
Read More
Next Story