సింహపురిలో గర్జించేది ఎవరు?
x

సింహపురిలో గర్జించేది ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఓటర్లు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీని ఎంత వరకు ఆదరిస్తారు. గత ఎన్నికల్లో ఆదరించిన పార్టీని ఈ సారి ఏమాత్రం అక్కున చేర్చుకుంటారనేది పెద్ద చర్చగా మారింది.


రాష్ట్రంలోని ఏ జిల్లాలోను జరగని రాజకీయ చర్చ నెల్లూరులో జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే తిరుగుబాటు చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏక చత్రాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ పార్టీలు మారిన వారిని ఇక్కడ చూశాం. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు నియోజక వర్గం నెల్లూరు జిల్లాలో కలిసింది. మొత్తం 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే. వారిలో నెల్లూరు రూరల్, వెంకటగిరి, ఉదయగిరి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పోకడను ప్రశ్నించారు. అయితే వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలవగా కందుకూరు నెల్లూరు జిల్లాలో వచ్చి చేరింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా ఒక విధంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక విధంగా తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన వారే. తన నియోజక నియోజక వర్గంలో సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని ఒకటికి నాలుగు సార్లు ధర్నాలు కూడా చేశారు మహీధర్‌రెడ్డి.

అనిల్‌ను నరసరావుపేటకు మార్చిన సీఎం
నెలూర్లు సిటీ నుంచి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. మంత్రిగా పని చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి వీర విధేయుడు. అయినా ఆయనకు సిటీ టికెట్‌ దక్క లేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఏకంగా నరసరావుపేట పార్లమెంట్‌ స్థానంలో పోటీకి దించారు. మంత్రిగా పని చేసిన అనిల్‌ ఎందుకు నెల్లూరు సిటీలో పనికి రాకుండా పోయారో ఇప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న నాయకులకు కానీ ఆ నియోజక వర్గంలోని నాయకులకు కానీ అంతు చిక్కడం లేదు. నియోజక వర్గంలో 1,16,230 మంది పురుష ఓటర్లున్నారు. ఇక 1,22, 168 మంది మహిళా ఓటర్లున్నారు. అంటే సుమారు 6వేలకుపైగా మహిళా ఓటర్లే ఎక్కువ. థర్డ్‌ జండర్‌ ఓటర్లు 67 మంది ఉన్నారు.
సిటీ నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి స్థాయిలో పట్టుందని చెబుతున్నా అభ్యర్థిని మార్చుకోక తప్ప లేదు. నగర డిప్యూటీ మేయర్‌ ఎండి ఖలీల్‌ అహ్మద్‌ను వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి నారాయణ రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్, కమ్యునిస్టుల కూటమి నుంచి సీపీఎం అభ్యర్థిగా మూలం రమేష్‌ను ప్రకటించారు. ఒకరు ముస్లిం మైనారిటీ కాగా మరొకరు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇంకొకరు గౌడ్‌ సామాజిక వర్గానికి చెందిన వారు. భిన్న కులాలకు చెందిన వ్యక్తులు ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఓటర్లదే తుది నిర్ణయం.
నెల్లూరు రూరల్‌ నియోజక వర్గం
ఇక్కడ నుంచి కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి గెలుపొందారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని సీఎం వైఎస్‌ జగన్‌తో విభేదించిన శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ శ్రీధర్‌రెడ్డిని రూరల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా షేక్‌ ఫయాజ్‌ పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్‌లో శ్రీధర్‌రెడ్డి పార్టీ మారాడే కానీ మూడు నెలల క్రితం వరకు ఇద్దరూ ఒక పార్టీ వారే. శ్రీధర్‌రెడ్డి, ప్రభాకరరెడ్డిలో ఎవరిని ఓటర్లు ఆదరిస్తారు. ఈ సారి కాంగ్రెస్‌కు కనీస డిపాజిట్లు వస్తాయనేది రాజకీయ పార్టీలో జరుగుతున్న చర్చ. నెల్లూరు రూరల్‌లో పురుష ఓటర్లు 1,35,677 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,43, 192 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే ఎక్కువ. ఇక థర్డ్‌ జండర్‌ ఓటర్లు 20 మంది ఉన్నారు.
కోవూరులో ఓటర్లు కోరుకునేది ఎవరిని
కోవూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రెండో సారి గెలుపొందారు. తిరిగి ఆయనకే టికెట్‌ కేటాయించారు. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీ పడుతున్నారు. ఈమె నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య. ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పోకడలు భరించలేక పోతున్నామంటూ టీడీపీలో చేరారు. ఇక్కడ ఎవరిని ఓటర్లు ఆదరిస్తారనేది పెద్దచర్చగా మారింది. నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి హయాం నుంచి కూడా వారి కుటుంబం వారే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభాకరరెడ్డి కుటుంబం కొత్తగా ఈ నియోజక వర్గంలోకి అడుగుపెట్టింది. ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ నియోజక వర్గంలోను మహిళా ఓటర్లే అధికం. 1,37,911 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,28,614 మంది పురుష ఓటర్లు ఉన్నారు. థర్డ్‌ జండర్‌ ఓటర్లు 25 మంది ఉన్నారు.
సర్వేపల్లిలో పట్టు ఎవరిదో
సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోవర్థన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రెండో సారి గెలిచి మంత్రి పదవిని సాధించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కూడా ఆయనే. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు. కాకాని గోవర్థన్‌రెడ్డిపై ఇటీవల పలు ఆరోపణలు సోమిరెడ్డి లేవనెత్తారు. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇసుక, గ్రావెల్, వైట్‌ క్వార్ట్‌›్జ వంటి మైనింగ్‌ల దోపిడీకి పాల్పడ్డారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సారి గోవర్థన్‌రెడ్డి విజయం సాధిస్తారా లేదా చంద్రమోహన్‌రెడ్డిని ఓటర్లు ఆదరిస్తారనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ నియోజక వర్గంలోను మహిళలే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 1,18, 896 మంది మహిళా ఓటర్లు కాగా, 1,12,536 మంది పురుష ఓటర్లున్నారు. ఇక «థర్డ్‌ జండర్ల ఓట్లు 26 ఉన్నాయి.
ఆత్మకూరులో పోటా పోటీ
ఆత్మకూరు నియోజక వర్గం నుంచి వెంకటగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన జగన్‌ను విభేదించి టీడీపీలో చేరారు. ఆత్మకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇద్దరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఆనం సీనియర్‌ కాగా మేకపాటి జూనియర్‌. సీనియరిటీ విజయం సాధిస్తుందా, దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సోదరుడైన విక్రమ్‌రెడ్డి గౌతం రెడ్డి సానుభూతిని తిరిగి సంపాదిస్తారా అనేది చర్చగా మారింది. ఆనంకి కూడా ఈ ఎన్నికలు సవాలు లాంటివే. ఎందుకంటే వారి కుటుంబానికి కూడా ఈ నియోజక వర్గంలో మొదటి నుంచి పట్టుంది. తిరిగి ఆ పట్టును నిలుపుకుంటారా లేదా అనేది స్థానికుల్లో చర్చగా మారింది. ఈ నియోజక వర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. 1,9,164 మంది మహిళా ఓటర్లు, 1,05,482 మంది పురుష ఓటర్లు, థర్డ్‌ జండర్‌ ఓటర్లు 8 మంది ఉన్నారు.
కావలి నియోజక వర్గంలో ఎవరిది పై చేయి
కావలిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రెండు సార్లు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుపొందారు. తిరిగి మూడో సారి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి రంగంలోకి దింపారు. ఈయన మొదటి సారిగా టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్‌రావు, 2019లో కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి టీడీపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం విశేషం. ఇక్కడ స్త్రీల ఓట్లు 1,21,036 ఉన్నాయి. పురుషుల ఓట్లు 1,16,745 ఉన్నాయి. థర్డ్‌ జండర్‌ ఓట్లు 28 ఉన్నాయి.
ఉదయగిరి ఎవరి గిరి
గత ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓటిపోయినప్పటికీ 2019లో గెలిచి నియోజక వర్గంలో తన పట్టును నిలబెట్టుకున్నారు. 2014 మినహా 2004, 2009, తర్వాత జరిగిన 2012 ఉప ఎన్నికల్లోను చంద్రశేఖరరెడ్డి విజయం సాధించారు. అయితే సీఎం జగన్‌తో వచ్చిన విబేధాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్‌ సాధించి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే చంద్రశేఖరరెడ్డి కాకుండా కాకర్ల సురేష్‌ అనే ఎన్‌ఆర్‌ఐకి టీడీపీ టికెట్‌ కేటాయించింది. వైఎస్‌ఆర్‌సీపీ మాత్రం మేకపాటి చంద్రశేఖరరెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ కేటాయించడం విశేషం. ఇక్కడ మేకపాటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇదే సందర్భంలో టీడీపీకి కూడా మంచి ఆదరణ ఉంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బలమైన నేత. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బొల్లినేని రామారావులు కలిసి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్‌కు సహకరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో మహిళా ఓటర్లు 1,21,190, పురుషుల ఓటర్లు 1,19,458, థర్డ్‌ జండర్‌ ఓటర్లు 10 మంది ఉన్నారు.
కందుకూరు కోటపై ఎగిరేది ఎవరి జెండా
సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి ఈ సారి వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌ ఇవ్వలేదు. మహిధర్‌రెడ్డి కందుకూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కనిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుర్రామధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. మొదటి సారి బీసీ వ్యక్తి కందుకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన వారిలో కమ్మ,రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఈయన మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్‌ అనుచరుడు. ఇక్కడ ఈ సారి పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుందని అంచనా వేస్తున్నారు. వీరకంటూ ప్రత్యేక బలం ఏమీ లేదు. పార్టీ బలాలే వీరి బలాలుగా అంచనా వేస్తున్నారు. పోటీ కూడా హోరా హోరీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 1,15,387 మంది మహిళా ఓటర్లు, 1,12,921 మంది పురుషు ఓటర్లు, 26 ధర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు.
Read More
Next Story