నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టామనే అంశాన్ని తమ ఖాతాలోకి జమ వేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చింది తామంటే తామేనని పోటీలు పడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న కూటమి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ను ఆ పీఠాలపైన కూర్చోబెట్టింది. నాలుగో పర్యాయం సీఎంగా చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కినాక పలు మార్లు, వివిధ సందర్భాలలో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చినట్లు చెప్పొకొచ్చారు. గతంలో ఎన్నడు అలా ప్రకటించుకోని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సారి మాత్రం తానే చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ, ఆయన గౌరవార్థం కోసం ఆయన పేరు మీద శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే, తాను నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చుతూ ఆయనకు సమున్నత స్థానం కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నాలుగో సారి సీఎం అయ్యాక గత డిసెంబరులో శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. డిసెంబరు 15న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములకు సంబంధించిన ఆత్మార్పణం పుస్తకాన్ని కూడా కూటమి ప్రభుత్వ సారథులిద్దరు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గురించి పవన్ కల్యాణ్ మాట్లాడితే.. ఎన్టీఆర్ హైదరాబాద్‌లో శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పేరు ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు అయినందు వల్ల నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల పొట్టి శ్రీరాముల జయంతి కూడా జరిగింది. ఈ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
దీనిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నెల్లూరుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు తానే మార్చానని సీంఎ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ శ్రేణులు తప్పబడుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. తాను చేయని దానిని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వెనుకా ముందు కూడా ఆలోచించరని, ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచనలు కూడా చంద్రబాబుకు లేవనే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ చర్చ వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఎవరు పేరు మార్చారు, ఎప్పుడు మార్చారు అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో, నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జల్లాగా పేరు మార్చారని వైఎస్‌ఆర్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అనేక వీడియోలలో చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చించింది ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రెండు పర్యాయాలు. 2004 కంటే ముందు సీఎంగా ఉన్నారు. 1995 సెప్టెంబరు 1 నుంచి 2004 మే 14 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల్లూరు జిల్లా పేరు మార్చింది 2008లో. నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చుతూ 2008 జూన్ 4న నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెబ్ పోర్టల్‌లో కూడా కనిపిస్తుంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చరిత్ర ఇలా వివరాలు స్పష్టంగా చెబుతోంటే దీనిని తన ఖాతాలో జమ చేసేందుకు సీఎం చంద్రబాబు ఆరాట పడుతున్నారని, సీఎం చంద్రబాముకు అల్జీమర్స్ వచ్చి ఉంటుందని, అందుకే తాను చేయనని దానిని కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. పడమటిపల్లె ఆయన సొంతూరు. 1901 మార్చి 16న ఆయన జన్మించారు. గురవయ్య, మహాలక్షమ్మలు ఆయన తల్లిదండ్రులు. అప్పట్లోనే ఆయన శానిటరీ ఇంజనీరింగును చదివారు. నాలుగేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. తర్వాత 25 ఏళ్లకే ఆయన కొడుకు, భార్య చనిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉన్న ఆస్తి పాస్తులను తన తల్లి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటారు. ఈ క్రమంలో930లో ఉప్పు సత్యాగ్రహంలో జైలు కెళ్లారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు మార్లు జైలు జీవితాన్ని గడిపారు. అనేక సామాజిక పోరాటాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటాలు సాగించారు. నాడు మద్రాసు ప్రెసెడిన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్రను సాధించడం కోసం నిరహార దీక్షకు దిగారు. 1952 అక్టోబరు 19న బలుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్షను ప్రారంభించారు. నాటి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఈ నిరాహార దీక్షకు పట్టించుకోక పోయినా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున మద్దతు పలికారు. రోజు రోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. అయినా లెక్క చేయని శ్రీరాములు తన నిరాహార దీక్షను కొనసాగించారు. చివరకు ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అలా ఆయన త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. నాటి నుంచి ఆయన అమరజీవిగా ప్రసిద్ది గాంచారు.