బీహార్ ఎన్నికల్లో ఈ మాస్క్ గర్ల్ ఎవరు?ఎందుకు ధరించారు?
x

బీహార్ ఎన్నికల్లో ఈ మాస్క్ గర్ల్ ఎవరు?ఎందుకు ధరించారు?

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ససెక్స్ యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్ మాస్టర్స్ పూర్తి చేసి ఎన్నికల్లో దిగారు.


బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ప్రకటించారు. NDA కూటమి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి పరాజం పాలైంది. మరో వైపు ఈ ఎన్నికలు చిన్న పార్టీలకు మరోసారి నిరాశ మిగిలింది. వాటిల్లో యువ నాయకురాలు పుష్పమ్ ప్రియా చౌదరి స్థాపించిన 'ద ప్లూరల్స్ పార్టీ' (TPP) ఒకటి. మొత్తం 243 స్థానాలకు పోటీ చేసినా, ఒక్క సీటు కూడా ఖాతా తెరవలేదు. దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్పమ్ ప్రియా, BJP అభ్యర్థి సంజయ్ సారాగి చేతిలో 96,000కి పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఫలితాలు పార్టీకి, ప్రియా చౌదరికి మరో షాక్‌గా మారాయి. ముఖ్యంగా 2020లో 148 సీట్లకు పోటీ చేసి ఖాతా తెరవకపోయినా ఈ సారి గెలుస్తామనే గంపెడాశలతో రంగంలోకి దిగారు. కానీ ఈ సారి కూడా నిరాశే మిగిలింది. ఎన్నికల కమిషన్ (ECI) డేటా ప్రకారం, TPP మొత్తం ఓటు షేర్ 1% కంటే తక్కువే ఉంది. ఇది పార్టీ యువత-సామాజిక మార్పు అజెండాకు మరింత సవాలుగా మారింది.


పుష్పమ్ ప్రియా చౌదరి: యువ నాయకురాలి రాజకీయ ప్రయాణం

పుష్పమ్ ప్రియా చౌదరి సరిగ్గా 33 ఏళ్లు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వారిలో ప్రియా చౌదరి కూడా ఒకరు. ఈమె బీహార్ రాజకీయాల్లో 'మాస్క్ గర్ల్'గా ప్రసిద్ధి చెందారు. 1992లో దర్భంగాలో జన్మించిన ఆమె, మాజీ JD(U) ఎమ్మెల్యే వినోద్ కుమార్ చౌదరి కూతురు. తాత ఉమాకాంత్ చౌదరి సమతా పార్టీ స్థాపక సభ్యుడు, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సన్నిహితుడు. చెల్లెలు వినయ్ కుమార్ చౌదరి (JD(U) నేత) బెనిపూర్ నుంచి 2020లో గెలిచారు. యూకేలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ససెక్స్ యూనివర్సిటీ నుంచి డెవలప్‌మెంట్ స్టడీస్ మాస్టర్స్ పూర్తి చేసిన ఆమె, బీహార్ ప్రభుత్వంలో టూరిజం, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2020 మార్చి 8న 'ద ప్లూరల్స్ పార్టీ'ను స్థాపించారు. కులం, మతాల ఆధారంగా నడుస్తున్న రాజకీయాలకు వ్యతిరేకంగా 'ప్లూరలిజం' (బహుళత్వం) పేరుతో పార్టీ స్థాపించింది. బీహార్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, 8 దిశా 8 పహర్'లో ఉపాధి, విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, పారిశ్రామికీకరణపై దృష్టి సారించారు. ఆ మేరకు మ్యానిఫెస్టోని రూపొందించారు. యువతను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రచారంలో 'లెట్స్ ఓపెన్ బీహార్', '30 ఇయర్స్ లాక్‌డౌన్' స్లోగన్‌లు ఉపయోగించారు.


పుష్పమ్ ప్రియా ఎల్లప్పుడూ నలుపు దుస్తులు, మాస్క్ ధరించి కనిపించే వారు. బీహార్ లో మార్పు కోసం దీనిని పాటిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో గెలిచేంత వరకు వీటిని ధరిస్తానని, తర్వాత మాస్క్ తీసేస్తాను అని 2020లో ప్రతిజ్ఞ చేసిన ఆమె, దీనిని 'సింబాలిక్ ప్రాటెస్ట్'గా చెబుతారు. బీహార్‌లో మహిళలు, యువత మౌనంగా బాధపడుతున్నారని సూచిస్తూ. సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్) లక్షల మంది ఫాలోవర్లు, 'విజిల్' (ఈల) చిహ్నంతో పార్టీ ప్రచారం చేశారు.


2025 ఎన్నికల్లో TPP

TPP మొత్తం 243 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపారు. 'విసిల్' చిహ్నంతో పుష్పమ్ ప్రియా దర్భంగా (జనరల్) నుంచి పోటీ చేశారు, ప్రత్యర్థులు BJP సంజయ్ సారాగి (సీటింగ్ MLA, క్యాబినెట్ మంత్రి), VIP ఉమేష్ సహాని, JSP రాకేష్ మిశ్రా మొదలైనవారు పోటీ చేశారు. మొదటి రౌండ్‌లలో కొంచెం లీడ్ చేసినా, తర్వాత భారీగా వెనుక పడ్డారు. 7వ రౌండ్ తర్వాత సారాగికి 26,000+ ఓట్ల ఆధిక్యం, మొత్తం మెజారిటీ 96,000+ ఓట్లతో గెలుపొందారు. సందేశ్ (హజారీపూర్)లో TPP అభ్యర్థి సత్య ప్రకాశ్ మొదటి రౌండ్‌లలో లీడ్ చేశారు, కానీ చివరికి ఓడిపోయారు. మిగిలిన స్థానాల్లో కూడా ఖాతా తెరవలేదు. ఓటు షేర్ మొత్తం 2% కంటే తక్కువ లభించింది. 2020లో 148 సీట్లలో 2.09 లక్షల ఓట్లు (0.5%) కంటే కొంచెం పెరిగినా.. విజయానికి చేరువ కాలేకపోయారు.


EVM పై ఆరోపణలు

ఫలితాలు తెలిసిన వెంటనే EVM రిగ్గింగ్ అని ప్రియా చౌదరి ఆరోపించారు. "ఈసారి EVMలలో మా తల్లి, ఇల్లు, పొరుగువారి ఓట్లు BJP అభ్యర్థికి షిఫ్ట్ అయ్యాయి. ప్రతి బూత్‌లో వందల ఓట్ల మానిప్యులేషన్ ఆధారాలు ఉన్నాయి" అని X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. మాస్క్ ప్రతిజ్ఞపై "ఇంకా కొనసాగుతుంది, బీహార్ మార్పు కోసం పోరాటం ఆగదు" అని చెప్పారు. TPP నేతలు "ప్రజల మద్దతు ఉంది, కానీ సిస్టమ్ వ్యతిరేకం" అని విమర్శించారు. యువత, మహిళల నుంచి మద్దతు వచ్చినా, కుల రాజకీయాలు (NDA మహిళా ఓట్లు 71%) TPPకు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు. అయితే పుష్పమ్ ప్రియా తన లింక్డిన్ ప్రొఫైల్‌లో "బీహార్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం" అని పేర్కొన్నారు. ఓటమి పార్టీకు ఆటంకం కాకుండా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీహార్ రాజకీయాల్లో ఆమె 'ఎమర్జింగ్ లీడర్'గా గుర్తింపు పొందినా, విజయానికి దూరంగానే ఉండిపోయారనే విశ్లేషకులు చెబుతున్నారు.

Read More
Next Story