
తన ప్రేయసి అరుణతో జీవితఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్
ఎవరీ పేరుమోసిన నేరగాడు శ్రీకాంత్? ఆ ప్రేయసికి అంత పలుకుబడి ఎక్కడిది!
ఎస్సీలు కుదరదన్నా ప్రియుడికి పెరోల్ ఇప్పించిన ప్రేయసి, దుమ్మెత్తిపోసుకుంటున్న వైసీపీ, టీడీపీ
నెల్లూరు జిల్లా జైలు నుంచి పెరోల్ పై వచ్చిన ఓ హైప్రొఫైల్ ఓ నేరగాడు ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడీ వ్యక్తి పెరోల్ పై విడుదల కావడానికి మీరు కారణమంటే మీరేనంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఆ నేరస్తుడి పేరు అవిలేలి శ్రీకాంత్. ఓ హత్య కేసులో శిక్ష పడి నెల్లూరు జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈమధ్య ఈ వ్యక్తికి పెరోల్ వచ్చింది. నెల రోజుల పాటు బయట తిరిగేందుకు అవకాశం వచ్చింది. ఈ కాలంలో ఈ శ్రీకాంత్ తన ప్రేమికురాలు ఎలియాస్ సన్నిహితురాలిగా చెబుతున్న నిడిగుంట అరుణతో విందులు, వినోదాలతో గడిపారని వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడవి వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం తక్షణమే అతనికి ఇచ్చిన పెరోల్ ను రద్దు చేసి మళ్లీ జైల్లో పెట్టారు.
శ్రీకాంత్ కి పెరోల్ రావడం వెనుక రాష్ట్ర హోంమంత్రి మొదలు చాలామంది హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తే వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడి హవా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడీ విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు వైసీపీ ఆరోపించింది. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాన్ని వైసీపీకి అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే...
అవిలేలి శ్రీకాంత్ సొంతూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు. కొంతకాలం వైసీపీలో ఆతర్వాత టీడీపీలో పని చేశారు. ఇతనో గ్యాంగ్ ను నడిపేవారని, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడం వంటివి చేసేవాడన్న నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసు రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓ హత్య కేసులో దోషిగా తేలారు. 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు.
ఇదిలాఉంటే ఈ శ్రీకాంత్ కి ఓ ప్రేమికురాలు ఉంది. ఆమె పేరు నిడిగుంట అరుణ. ఈమె కూడా సాదాసీదా వ్యక్తేమీ కాదు. ఆమెకు 2002 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. అది జైళ్లలోని ఖైదీల కోసం పని చేస్తుంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్, అరుణ మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. ఈమెది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అని తెలిసింది. ఈమె గత ఎన్నికల్లో సూళ్లూరుపేట నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు ఈమె పలుకుబడి, డబ్బు ఉపయోగించి తన భర్త అని చెబుతున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించినట్టు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 12 లక్షల రూపాయల డబ్బును ఖర్చు చేసినట్టు ఆమె స్వయంగా చెప్పారు.
మరి ఏమిటి వివాదం...
శ్రీకాంత్ పెరోల్ రావడం వెనుక ఎవరున్నారనే దానిపై ఓ పక్క చర్చసాగుతుండగా ఈ వ్యక్తి తన ప్రేమికురాలు ఎలియాస్ భర్త శ్రీకాంత్ తో కలిసి జల్సాలు చేస్తున్నారని, ఎవరెవరికో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వార్తలు మీడియాలో వచ్చాయి. దీంతో పోలీసు, జైళ్ల విభాగం అధికారులు రంగంలోకి దర్యాప్తు మొదలు పెట్టారు. తీగలాగితే డొంక బయటపడిన చందాన ఈ పెరోల్ వెనుక పెద్ద తతంగమే నడిచిందని, వివిధ రాజకీయ పార్టీల నాయకుల పైరవీలు, డబ్బు చేతులు మారిందని గుర్తించారు. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో పెరోల్ రద్దు చేశారు.
దుమ్మెత్తి పోసుకుంటున్న రాజకీయ పార్టీలు..
శ్రీకాంత్ జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్‌మెంట్లు చేయించేవాడని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడని చెబుతున్నారు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెల్యేతో శ్రీకాంత్
శ్రీకాంత్ తరఫున అరుణ దాఖలు చేసిన పెరోల్ దరఖాస్తు ఆమోదం పొందేలా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సాయం చేశారని వైసీపీ ఆరోపించింది. పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది.
దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి శాఖ నుంచి ఉత్తర్వులు లేకుండా ఓ జీవితఖైదీ విడుదల కావడం సాధ్యం కాదు. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్‌ని రద్దు చేసింది.
నాకు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనకు కొందరితో ఆపద పొంచి ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్య కథనాలు ప్రచురించిన ఓ చానల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. పెరోల్ అర్జీని హోం మంత్రికి పంపారు. ఆమె నుంచి వచ్చిన ఫైలే సర్క్యులేట్ అయి పెరోల్ మంజూరైంది అని అరుణ చెబుతున్నారు.
పెరోల్ రద్దు జీవోలో ఏముందంటే..
పెరోల్ జీవోను రద్దు చేయడం హోంశాఖ చరిత్రలోనే ఫస్ట్ కేసు. 'నాపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదు. శ్రీకాంత్ అంటే నాకు ఇష్టం. మేం పెళ్లిచేసుకోబోతున్నాం. శ్రీకాంత్ పెరోల్‌పై ఆయన తండ్రి పెట్టుకున్న వినతిపత్రాన్ని ప్రభుత్వం ఆమోదించిందే తప్ప దీనివెనుక నేను చక్రం తిప్పిందేమిలేదు' అని అరుణ చెప్పారు.
తెర వెనుక ఏం జరిగిందీ?
తిరుపతి జిల్లా ఎస్పీ, నెల్లూరు కారాగారం సూపరింటెండెంట్ తిరస్కరించినా శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వాల్సిందేనంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇద్దరు సిఫార్సు చేశారు. ఓ మంత్రి వాటిని ఎండార్స్ చేస్తూ ‘ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్’ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలోని ఓ అధికారి అండదండలు ఉండటంతో.. ఆఘమేఘాలపై శ్రీకాంత్‌కు పెరోల్ జారీ అయిపోయింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ జీవోను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో పెట్టలేదు.
2019 నుంచే శ్రీకాంత్ బయటకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో ఆ పార్టీలో ఉన్న ఓ నాయకుడు.. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాలో అతడిని క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆ నాయకుడే అతడిని అన్నీ తానై కాపాడుతున్నారు. గత ఐదేళ్లలో నెల్లూరు నగరంలో జరిగిన పలు హత్యల్లో శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి.
అతడు జైల్లో ఉంటూనే దాదాపు 60కి పైగా తీవ్ర హింసాత్మక నేరాలు చేయించాడనే అభియోగాలున్నాయి. గతేడాది ఎన్నికల ముందు తెలుగుదేశం నాయకుడు ఒకరిపై జరిగిన హత్యాయత్నంలోనూ శ్రీకాంత్ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తికి పెరోల్ మంజూరు చేయాలంటూ నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ రాశారు. తిరుపతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధితోనూ లేఖ రాయించారు. గతంలో జైలు నుంచి పారిపోయిన నేరానికి అతడికి ఏడాది శిక్ష పడింది. ఈ కారణంగా క్షమాభిక్ష అవకాశం లేకుండా అతడి పేరు రెమిషన్ రోల్స్ నుంచి తొలగించారు. అయితే వైసీపీ హయాంలో 2024 జనవరిలో ఒకసారి, కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టులో ఒకసారి పెరోల్‌పై శ్రీకాంత్ బయటికొచ్చాడు.

శ్రీకాంత్ జైల్లో ఉంటూనే తన ప్రియురాలు అరుణ, సహచరులు జగదీశ్, భూపతి, సురేడ, రాజాలతో బయట సెటిల్‌మెంట్లు, నేరాలు చేయిస్తున్నాడని తిరుపతి ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నారు.
ఐఎఎస్, ఐపీఎస్, ఎస్పీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడగలిగిన పరపతి ఉన్న అరుణ మొత్తం మీద చక్రం తిప్పి తన ప్రియుడికి పెరోల్ ఇప్పిస్తే అది దారి తప్పి మళ్లీ జైలు పాలయ్యేలా చేసింది.
Next Story