
రాజధాని రైతు రామారావు చావుకు కారకులెవరు?
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నివాళులర్పించేందుకు వచ్చినప్పుడు "ఇంకా ఎంతమందిని చంపుతారు?" అంటూ రైతులు నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పరిణామాలు మళ్లీ విషాదంతో కూడిన చర్చను రేపాయి. రాజధాని అమరావతిపైన కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తు తీరు, అమలు చేస్తున్న విధానాలు రాజధాని ప్రాంతపు రైతుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనేలా చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకపోవడంతో రైతులను తీవ్ర మానసిక భయాందోళనలు ఆవరించాయి. తరాల తరబడి వారసత్వ సంపదగా వస్తున్న పొలాల పట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మానసిక ఒత్తిడులకు గురవుతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యం పాలవుతుండగా మరి కొందరు ఆ మానసిక ఒత్తిడులు భరించలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాజధాని రైతు రామారావు ప్రాణాలు పోగొట్టుకోవడమే దీనికి నిదర్శనమనే చర్చ ఆ ప్రాంతపు రైతుల్లో తీవ్రంగా జరుగుతోంది.
డిసెంబర్ 26, 2025న మందడం గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నిర్వహించిన సమావేశంలో తన ఆవేదన వెళ్లబోసుకుంటూ మాట్లాడుతుండగా, మందడం గ్రామానికి చెందిన 68 ఏళ్ల రైతు దొండపాటి రామారావు (రాములు అలియాస్ రామారావు) ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. ఆయనకు వెంటనే CPR ఇచ్చి మంత్రి కాన్వాయ్ వాహనంలో ఆస్పత్రికి తరలించినా, చేరేలోపే ప్రాణం విడిచారు. ఈ ఘటన అమరావతి రైతుల ఇంకా పరిష్కారం కాని సమస్యలను, ప్రభుత్వం వారిపైన పెడుతున్న మానసిక ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది.
ఘటన నేపథ్యం, రామారావు ఆవేదన
రామారావు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS)లో భూమి ఇచ్చిన రైతుల్లో ఒకరు. రోడ్ల నిర్మాణం వల్ల ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులతో జరిగిన సమావేశంలో ఆయన మంత్రి నారాయణ ఎదుట మాట్లాడారు. "ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తున్నారు. వాగులో పడే చోట భూమి ఇచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలో మంచి ప్లాట్లు ఇవ్వండి" అంటూ డిమాండ్ చేశారు. ఈ ఉద్వేగంలోనే ఆయన కుప్పకూలారు. రామారావు కుటుంబ సభ్యులు, స్థానిక రైతులు ఈ మరణానికి ప్రభుత్వం చేస్తున్న జాప్యం, అన్యాయమే కారకమని ఆరోపించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నివాళులర్పించేందుకు వచ్చినప్పుడు కూడా రైతులు "ఇంకా ఎంతమందిని చంపుతారు?" అంటూ నిలదీశారు.
ప్రస్తుత పరిణామాలు..రైతుల అసంతృప్తి
NDA కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ (LPS 2.0) ప్రక్రియ సాగుతోంది. వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు విడుదలవుతున్నాయి. కేంద్రం చట్టసవరణలతో అమరావతికి అధికారిక హోదా ఇస్తోంది. అయినప్పటికీ, మొదటి దశలో భూమి ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సరిగా రిజిస్టర్ కాకపోవడం, మంచి లొకేషన్లలో కాకుండా వాగులు, తడి ప్రాంతాల్లో ప్లాట్లు ఇవ్వడం, యాన్యుటీలు పెండింగ్ ఉండటం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. త్రిసభ్య కమిటీ (పెమ్మసాని, నారాయణ, శ్రవణ్) సమావేశాలు జరుపుతున్నా, జాప్యం వల్ల రైతుల్లో ఆవేదన పెరిగింది. ఈ వాతావరణం రైతుల్లో రోజు రోజుకు పెరుగుతోంది.

