
ఎవరీ కసిరెడ్డి... ఏమా కథ
ప్రస్తుతం మద్యం కుంభకోణంలో కసిరెడ్డి పేరు మారుమ్రోగి పోతోంది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. వేల కోట్ల కుంభకోణమని ప్రభుత్వం భావిస్తోంది.
నిన్న సాయంకాలం అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ (2019-2024) లో తెరవెనక కీలక పాత్ర వహించిన రాజకీయేతర శక్తుల్లో ఒకడు. జగన్ కు వ్యక్తిగా సాయం చేయడం ఆనవాళ్లు లేకుండా అన్ని పనులుచేపట్టేందుకు చాలా మంది ఎవరికీ తెలయిని కొత్త వారికి సలహా దారులుగా పెట్టుకున్నారు. ఆయన సలహ దారుల్లో చాలామందికి గతంలో వ్యాపారానుభవాలు తప్పరాజకీయ అనుభవాలు శూన్యం. ఉదాహరణకు రెండోె ముఖ్యమంత్రి లాగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారుగా ప్రభుత్వాన్ని నడిపించారు.సజ్జలను కలిస్తే ముఖ్యమంత్రిని కలిసినట్లే నని అభిప్రాయం కలిగించారు. ఇలా ఆయన ఒక వెలుగు వెలిగిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి. ఆయన పేరుకు ఐటి సలహాదారు గాని చేసిందంతా లిక్కర్ వ్యాపార పర్యవేక్షణ అని ఇపుడు విజయ సాయిరెడ్డి వంటి సీనియర్ వైసిపి (మాజీ) నేతలు చెబుతున్నదాని బట్టి అర్థమవుతుంది. ఆయన సలహాదారులంతా ఇపుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించడం జరగుతూ ఉంది. ఇపుడు రాజ్ కసిరెడ్డి ‘ఆంధ్రా లిక్కర్ స్కాం’లో అరెస్టయిన మొదటి సలహాదారు అయ్యాడు.
కసిరెడ్డి వివరాలు
రాజ్ కసిరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. తల్లిదండ్రులతో పాటు రాజ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడే వ్యాపార, రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. సాఫ్ట్ వేర్ డెవలపర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం సిట్ విచారణకు హాజరయ్యారు. వైఎస్సార్సీపీలో ఆర్థిక లావాదేవీల విషయం కసిరెడ్డి మాత్రమే చూసే వారని సమాచారం.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో పెద్ద కుంభకోణం (Liquor Scam) జరిగిందని, వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ (TDP) ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే లిక్కర్ స్కాంపై విచారణ జరిపిస్తామని అప్పట్లో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ లావాదేవీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇందులో వైసీపీ అగ్రనేతల పాత్ర ఉన్నట్టు గుర్తించింది. ఎంపీ మిథున్ రెడ్డి (P Mithun Reddy), అప్పటి ఏపీబీసీఎల్ (APDCL) ఎండీ వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy) కీలకపాత్ర పోషించినట్లు భావిస్తోంది. వీళ్లకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును విజయసాయి రెడ్డి బయటపెట్టడంతో అందరి చూపూ అటువైపు మళ్లింది. త్వరలో ఆయన బిజెపిలో చేరతాడని చెబుతున్నారు. అపుడు కూటమి రక్షణ ఉంటుంది. లిక్కర్ స్కాం లో ఎవరున్నారు, ఏమేమి చేశారు అనే విషయం వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్ కు విదేశాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయని ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయని, అందుకే ఆ విజ్ఞానంతో ఆయన ఐటి సలహాదారుగా ఉన్నా లిక్కర్ మీద దృష్టిపెట్టారు. అసలు ఆ అనుభవంతోనే జగన్ కు బాగా దగ్గరయ్యాయని కొంతమంది వైసిపి నేతలు చెబుతున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే అన్నీ తానై వ్యవహరించారని చెప్పారు.
వైఎస్సార్సీపీలో ఎప్పుడు చేరారు?
రాజ్ కసిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. అంతకుముందు ఈయన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల ముందు ఈయన పార్టీలో చురుకైన పాత్ర పోషించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బంధుత్వం?
రాజ్ కసిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరపు బంధువుగా చెబుతున్నారు. వార్తా సంస్థలు ఈయనను జగన్‌తో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా వర్ణించాయి. ఈ సంబంధం రాజకీయ, వ్యాపార సహకారంతో ముడిపడి ఉండవచ్చు.
ఐటీ సలహాదారుగా పాత్ర
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో (2019-2024) రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగా కీలక పాత్ర పోషించారు. ఈ పాత్రలో ఈయన ప్రభుత్వ ఐటీ విధానాలు, సాంకేతిక ప్రాజెక్టులపై సలహాలు ఇచ్చారు. అయితే ఈ పదవిని ఉపయోగించి మద్యం కుంభకోణంలో తెరవెనుక ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.
మద్యం కుంభకోణంలో అరెస్ట్
2025 ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్ కసిరెడ్డిని వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన కోట్ల మద్యం కుంభకోణంలో నిందితునిగా పేర్కొంటూ అరెస్ట్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. రాజ్ కసిరెడ్డి మద్యం షాపుల సరఫరా, బేవరేజెస్ కంపెనీలతో లంచాల నెట్‌వర్క్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ వ్యాపారంలో ఆంధ్ర ప్రదేశ్ బెవరేజెష్ కార్పొరేషన్ కొంత పుంతలు తొక్కింది. ప్రభుత్వ షాపుల్లోనే లిక్కర్ విక్రయిస్తున్నా ఇవన్నీ ప్రయివేటు షాపుల్లాగే నడిచాయనేది ఆరోపణ. దీనికి నాలుగు రకాల పద్ధతులు అవలభించింది. అవి. 1. పాపులర్ బ్రాండ్లు అమ్మకం నిలిపివేయడం. 2. వైసిపి సన్నిహితుల డిస్టిల్లరీస్ లో తయారుయ్యే కొత్త రకం బ్రాండ్లను మ ాత్రమే విక్రయించడం 3. మద్య నిషేదం అంటూ ధరలు విపరీతంగా పెంచడం 4. దేశమంతా ఆన్ లైన్ పేమెంట్ ఉంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం నగదు మాత్రమే చెల్లించాలనడం. ఇలా 93 శాతం వ్యాపారం చేశారని సిఐడి చెబుతూ ఉంది. అక్రంగా లిక్కర్ విక్రయించి కొనుగోలు ఆనవాళ్లు లేెకుండా చేసేందుకే నగదు వ్యాపారం జరిపారని ఆరోపణ. ఈ కథంతా నడిపింది రాజ్ కసిరెుడ్దేనని చెబుతున్నారు.
ఈయన నిర్ణయాల ఆధారంగా ఏ బ్రాండ్ల మద్యం ఎంత మేరకు కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు విక్రయించాలి అనే విషయాలు నిర్ణయించబడ్డాయని రాష్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం ద్వారా రూ.3000 కోట్లకు పైగా లంచాలు సేకరించి, ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరిచినట్లు ఆధారాలు సిట్ సేకరించినట్లు మీడియా ద్వారా తెలుస్తోంది.
సిట్ ఆయనకు మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పారని, హైకోర్టులో నోటీసులను సవాలు చేసినా ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఈ దందాను నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్
ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 2024 నవంబర్‌లో ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌ను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు నేతృత్వం వహిస్తున్నారు. సిట్‌లోని సభ్యుల వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 5, 2025న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (Government Order) ప్రకారం...
- ఎస్వి రాజశేఖర్ బాబు - విజయవాడ పోలీస్ కమిషనర్, సిట్ హెడ్.
- ఎల్ సుబ్బారాయుడు - తిరుపతి రెడ్ శాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)
- కొల్లి శ్రీనివాస్ - ఒంగోలు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ SP
- ఆర్ శ్రీహరి బాబు - మంగళగిరి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అడిషనల్ SP
- పి శ్రీనివాస్ - ధోన్ డిప్యూటీ SP (లా అండ్ ఆర్డర్)
- కె శివాజీ - ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
- సి నాగ శ్రీనివాస్ - ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
స్పై సినిమా నిర్మాణం
రాజ్ కసిరెడ్డి కథ అందించి, నిర్మించిన స్పై సినిమా 2023 జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. నిఖిల్ సిద్ధార్థ, ఇశ్వర్య మీనన్, అభినవ్ గోమఠం, జిషు సేన్‌గుప్తా, ఆర్యన్ రాజేష్, సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్, ఇందులో రా ఏజెంట్ జై వర్ధన్ తన సోదరుడి మరణం వెనుక ఉన్న కారణాలను కనుగొనడంతో పాటు దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు.
సినిమా సుభాష్ చంద్రబోస్ జీవితంతో ముడిపడిన రహస్య ఫైళ్ల చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తిగత నష్టం, జాతీయ భద్రతను కాపాడే కథను మేళవించడానికి ప్రయత్నించినప్పటికీ, సినిమా విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమై, నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. నిఖిల్ స్వయంగా సినిమా నిరాశపరిచిందని, 10 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే పోస్ట్-ప్రొడక్షన్ ప్రారంభించడం వల్ల నాణ్యత దెబ్బతిన్నదని అక్టోబర్ 2023లో సిద్దార్థ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో నివాసం
రాజ్ కసిరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు పోలీసులు రాజ్ తండ్రి ఫోన్ పై నిఘా పెట్టారు. తండ్రికి ఫోన్లో వచ్చే మెసేజ్ ల ఆధారంగా గోవాలో ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. దీని ఆధారంగా షంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈయన తల్లి, తండ్రి హైదరాబాద్‌లో ఉంటారని, సిట్ నోటీసులను ఆమెకు అందజేసినట్లు కూడా సమాచారం ఉంది.
ఎన్ఆర్ఐ విభాగంలో కన్వీనర్ గా...
రాజ్ కసిరెడ్డి వైఎస్సార్సీపీలో చురుకైన సభ్యుడిగా, ముఖ్యంగా ఎన్ఆర్ఐ విభాగంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ గా పనిచేశారు. ఈయన జగన్‌కు సన్నిహితుడిగా ఉండటం వల్ల పార్టీలో గణనీయమైన ప్రభావం చూపారు. అయితే మద్యం కుంభకోణం ఆరోపణలు ఈయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్రను చెప్పడం ద్వారా ఈ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది.
విజయసాయి ద్వారానే పార్టీలోకి...
వైఎస్సార్ సీపీలోకి రాజ్ రావడానికి ప్రధాన కారణం రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి అని విశ్వసనీయ సమాచారం. అమెరికాలో సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలు నడుపుతూ ముందుకు సాగుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీలో చేరడానికి విజయసాయిరెడ్డి సహకరించారని పార్టీ వారు చెబుతున్నారు. తనకు రాజ్ ఎవరో తెలియదని, పార్టీలోని కొందరు ముఖ్యులు పరిచయం చేస్తే తెలిసిందని విజయసాయిరెడ్డి ఇటీవల మీడియా ముందు చెప్పారు.
అరబిందోకు ఏమిటి సంబంధం
అరబిందో కంపెనీ నుంచి ఈ మధ్యం కుంభ కోణ నిందితులకు రూ. 100 కోట్లు అందాయి. ఇవి రెండు కంపెనీల వారు అప్పుగా తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు. అప్పులు కావాలంటే కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకుంటాయని, అంతే కాని ఒక కంపెనీ నుంచి పెట్టుబడి కోసం తీసుకోవడం ఏమిటనే ప్రశ్న కూడా ఇక్కడ చర్చనియాంశమైంది. లావాదేవీల పరంగా జరిగిన అంశాలేనని, ఈ డబ్బుల విషయంలోనే వివాదాలు వచ్చి పార్టీకి విజయసాయి దూరమయ్యరనే ప్రచారం కూడా ఉంది.
అరబిందో వారు విజయసాయిరెడ్డికి బంధువులు కావడం వల్ల విజయసాయిరెడ్డి చెప్పినట్లు చేశారని, ఇప్పుడు వారికి కూడా చెడ్డపేరు రావడంతో వారు విజయసాయిరెడ్డిని దూరంగా పెట్టారనే ప్రచారం ఉంది. ఫార్మా, కనస్ట్రక్ఛన్స్ రంగంలో అరబిందో ఎంతో నమ్మకంతో పనిచేస్తుంది. అయితే ఈ కుంభకోణంలో అరబిందో పేరు బయటకు రావడం, అలాగే కాకినాడ ఓడరేవు ఆస్తుల విషయంలో కూడా అరబిందో కంపెనీ నిందితుల జాబితాలో ఉండటం వల్ల వారికి సమస్యలు వచ్చాయి. విజయసాయి వల్లే తాము అనవసరంగా వార్తలకు ఎక్కాల్సి వచ్చిందనే ఆవేదన వారిలో ఉంది.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారు. ఐటీ సలహాదారుగా, సినీ నిర్మాతగా, వైఎస్సార్సీపీ నాయకుడిగా ఈయన ప్రస్థానం ఎన్నో మలుపులతో నిండి ఉంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం ఈయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. సిట్ దర్యాప్తు ఫలితాలు ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.