అసలు ఎవరు ఈ హేమ.. ఆమె కథేంటి..
బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రముఖులు, సినిమా నటీనటులు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో..
బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రముఖులు, సినిమా నటీనటులు కూడా ఉండటం మరింత సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారణ అయిన 86 మందిలో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని చూపించుకోవడానికి హేమ అనేక ప్రయత్నాలు చేయడం. అంత ట్రై చేసినా ఆమె పార్టీకి వెళ్లిందని పోలీసులు ఖరారు చేయడం.. ఇప్పుడు ఆమె డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు తేటతెల్లం కావడంతో అందరూ ఆమెను ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ హేమ ఎవరు? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. మరి ఆమె ఎవరు? ఏంటి అనేది తెలుసుకుందాం..
హేమ నేపథ్యం
ఆమె.. తెలుగు సినిమా నటి, రాజకీయ నాయకురాలు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. 1989లో ఆమె బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘భలేదొంగ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తనదైన నటన, డైలాగ్స్‌తో మంచి అవకాశాలు అందుకుంది. 500కుపైగా సినిమాలు, పలు టీవీ సీరియల్లలో కూడా మెరిసింది. ఇండస్ట్రీలో హేమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. వరుస సినిమాలతో దూసుకెళ్లిన హేమకు కొంతకాలంగా ఆశించినన్ని అవకాశాలు రావట్లేదు. కానీ కొన్ని ప్రత్యేక పాత్రలకు మాత్రం హేమానే పర్ఫెక్స్ అని నిర్మాతలు అందరూ భావిస్తుంటారు.
అసలు పేరు హేమ కాదు
అందరికీ హేమగా సుపరిచితమైన ఆమె అసలు పేరు కృష్ణవేణి. బెంగళూరు రేవ్ పార్టీ రిజిస్టర్‌లో కూడా ఈ పేరే ఉంది. బెంగళూరు పోలీసులకు కూడా ఆమె ఈ పేరే చెప్పింది. హేమ అసలు పేరు కృష్ణవేణి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాంతో ఒకవేళ పేర్లు బయటకు వచ్చినా తనను ఎవరు గుర్తు పట్టరని అనుకుందేమో ఏమో కానీ ఇప్పుడు అందరికీ హేమ.. డ్రగ్స్ తీసుకుందని అర్థమైపోయింది. హేమ అలియాజ్ కృష్ణవేణి.. 12 నవంబర్ 1975లో తూర్పుగోదావరి జిల్లాల రాజోలులో జన్మించింది. కోళ్ల కృష్ణ, కోళ్ల లక్ష్మీ దంపతుల కుమార్తె ఈమె. ఆమె 7వ తరగతి వరకు చదువుకున్నట్లు చెప్తుంటారు. కానీ ఆమె విద్యాభ్యాసానికి సంబంధించి పెద్దగా సమాచారం లేదు. ఆమె సయ్యద్ జాన్ అహ్మద్‌ను వివాహమాడింది. వారికి ఒక పాప కూడా ఉంది.
రాజకీయ జీవితం
హేమ.. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్‌లో కార్యవర్గ సభ్యురాలిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించింది. జాయింట్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్‌గానే పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఆమె జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో పోటీ పడ్డారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. 2019లో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2021లో మళ్లీ పార్టీ మారి ఈసారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
పోలీసులను బెదిరించిన హేమ
రేవ్ పార్టీ అంశంలో అందరి రక్త నమూనాలను సేకరించే సమయంలో హేమ.. పోలీసులను కూడా బెదిరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన పేరు బయటకు వస్తే సూసైడ్ చేసుకుంటానని ఆమె పోలీసులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కానీ పోలీసులు చట్టం తన పని తాను చేసుకు పోతుంది అన్న తరహాలో పాజిటివ్ వచ్చిన అందరి వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే తాను రేవ్ పార్టీకి రాలేదని నమ్మించడానికి హేమ శతవిధాలా ప్రయత్నం చేసింది. తొలుత తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ వీడియోను విడుదల చేసిన హేమ.. దాన్ని మరింత బలోపేతం చేయడానికి బిర్యానీ చేసే వీడియోను కూడా విడుదల చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి.
రేవ్ పార్టీ విషయం పోలీసులకు ఎలా తెలిసింది
‘సన్ సెట్ టు సన్ రైజ్’ పేరుతో బర్త్ డే పార్టీ చేసుకోనున్నట్లు రేవ్ పార్టీ నిర్వాహకులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు స్టేషన్‌లో అనుమతులు తీసుకున్నారు. అనుమతి అందిన తర్వాత తీరా పార్టీ స్టార్ట్ అయింది. చెవులు చిల్లులు పడే సౌండ్‌తో డీజే సౌండ్స్ హోరెత్తితున్నాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఇదే పరిస్థితి. దీంతో అసలు ఏం జరుగుతుందన్న అనుమానంతో రౌండ్స్‌లో ఉన్న పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. అప్పుడు ఈ రేప్ పార్టీ బండారం బయటపడింది. చూసిన వెంటనే అక్కడ ఉన్నవారిలో పలువురు ప్రముఖులతో పాటు హేమను కూడా పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఆమె వీడియోను రిలీజ్ చేసి విషయాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చుకుంది. అయితే రేవ్ పార్టీలో దొరికిన హేమ వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు.