
ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర పన్నిందెవరు?
ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వీళ్లందరూ నిడిగుంట అరుణ మనుషులేనని ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు రౌడీ షీటర్లు ప్లాన్ చేశారా? కుట్ర పన్నిన వాళ్లు నెల్లూరు లేడీడాన్ నిడిగుంట అరుణ అనుచరులా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే 'డబ్బే డబ్బు' అంటూ వీడియోలో మాటలు వినపడుతున్నాయి. కోటంరెడ్డిని చంపాలని ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వీళ్లందరూ నిడిగుంట అరుణ మనుషులేనని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం లేడీడాన్ నిడిగుంట అరుణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ వీడియో బయటకు రావడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.
లేడీ డాన్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్ తదితరులు పథకం రచించినట్టు కోటంరెడ్డి వర్గీయులు ఆరోపించారు. వీడియోతో సహా సాక్ష్యాలు సేకరించారు. వెంటనే స్పందించడంతో కోటంరెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగిందని చెబుతున్నారు. ఇటీవల ఆయనపై వైకాపా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కోటంరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని అరుణకు వైసీపీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. డబ్బుతో ప్రలోభపెట్టి కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
రౌడీషీటర్ల వీడియో రిలీజ్ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడుతామని, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, జీవితఖైదీ, రౌడీ షీటర్ అవిలేల శ్రీకాంత్ ప్రియురాలు, లేడీ డాన్ నిడిగుంట అరుణను నెల్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అరుణను విచారించేందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేరుగా రంగంలోకి దిగారు. శ్రీకాంత్, అరుణ కార్యకలాపాలపై ఇప్పటికే ప్రాథమికంగా దర్యాప్తు పూర్తి చేసిన నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసు అధికారులు నివేదికలను డీజీపీకి అందించారు. ఆమె ఫోన్లలో పలువురు కీలక అధికారులు, రాజకీయ నాయకులు, చోటా మూటా రౌడీలు, కానిస్టేబుళ్లతో ఆమె చేసిన సంభాషణలు, దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడీ విచారణలో అవి బయటపడితే ఏ రాజకీయ నాయకుడి బాగోతం బయటపడుతుందోనని భయపడుతున్నారు.
Next Story