గుంటూరు ఓటర్లు ఎవరిని గెలిపించారు!
x

గుంటూరు ఓటర్లు ఎవరిని గెలిపించారు!

గుంటూరు ఓటర్లు ఎవరి గెలుపునకు తీర్పు ఇచ్చారు. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే పార్టీ గెలుస్తుందా గతంలో మాదిరి రెండు పార్టీలు గెలుస్తాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.


గుంటూరు తూర్పు నియోకవర్గంలో మహమ్మద్‌ ముస్తఫా 2014, 2019లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడో సారి ఆయన కుమార్తె నూరి ఫాతిమాను వైఎస్సార్‌సీపీ పోటీకి దించింది. ఈమె విద్యావంతురాలు కావడం వల్ల జనంలోకి త్వరగా చొచ్చుకు పోగలిగారు. అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతూ యాక్టివ్‌గా కనిపించారు. రెండు సంవత్సరాలుగా నియోకవర్గంలో తిరుగుతూ అందరికీ సుపరిచితమయ్యారు. ఈమెపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్‌ నసీర్‌ పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ నసీర్‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు సార్లు విజయం సాధించగా ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. మరో రెండు సార్లు వైఎస్సార్‌సీపీ, ఒకసారి సీపీఐ విజయం సాధించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో పిఆర్‌పి అభ్యర్థిగా పోటీచేసిన షేక్‌ షౌకత్‌ రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్‌ మస్తాన్‌వలి 9,012 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే ఈ నియోజకవర్గం ఒక విధంగా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా చెప్పొచ్చు.

అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నూరి ఫాతిమా పరిస్థితి ఏమిటి? ఆమెకు గెలుపు అవకాశాలు ఉన్నాయా? లేవా అనే చర్చ జోరందుకుంది. గత ఎన్నికల్లో నసీర్‌ ఓడిపోయిన సానుభూతి ఉందని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఎక్కువగా టీడీపీకి పడిందనే ప్రచారం సాగుతోంది. ఓటర్లు అర్ధరాత్రి వరకు లైన్లో ఉండి ఓటు వేయడాన్ని ఏ విధంగా తీసుకోవాలనే ఆలోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. ఇంత ఖచ్చితంగా తమ ఓటును వినియోగించుకున్నారంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేననే అనుమానాలు అనేక మంది ఓటర్లలోనూ ఎక్కువగా ఉన్నాయి.
గుంటూరు వెస్ట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విడదల రజిని, టీడీపీ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి పోటీ చేశారు. ఇరువురూ పోటాపోటీగా ప్రచారం చేశారు. మాధవి గుంటూరు కాగా రజిని పల్నాడు జిల్లా చిలకలూరిపేట వాసి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. రాజకీయ బదిలీల్లో భాగంగా గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం వల్ల మహిళల ఓట్లు ఎక్కువ ఎవరికి పడ్డాయనేది చర్చగా మారింది. గుంటూరు వెస్ట్‌ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మద్దాల గిరి గెలిచారు. తరువాత ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసిన లేళ్ల అప్పిరెడ్డి, 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రగిరి ఏసురత్నం ఓటమి పాలయ్యారు. ఈ నియోకజవర్గం నుంచి ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. ఐదు సార్లు టీడీపీ గెలిచింది. నియోకవర్గంలో టీడీపీకి కూడా మంచి పట్టు ఉంది. వైఎస్సార్‌సీపీ వచ్చిన తరువాత పోటీ చేసిన రెండు సార్లు ఓటమి చెందటం వల్ల మూడో సారి కూడా వైఎస్సార్‌సీపీ ఓటమి చెందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటంతో పందేలు జోరందుకున్నాయి. వైఎస్సార్‌సీపీ వారు వంద రూపాయలు పందెం అంటే టీడీపీ వారు 150 ఇస్తామని చెప్పటం విశేషం. అయినా వైఎస్సార్‌సీపీ వారు వెనుకంజ వేస్తున్నారని పందెం రాయుళ్లు చెబుతున్నారు.


Read More
Next Story