
ఎవరా ఐదుగురు..ఎవరికి ఆ ఎమ్మెల్సీ పదవులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కడం, మంత్రి కావడం ఖాయమనే టాక్ జనసేన శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనుండగా త్వరలో మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఐదు స్థానాలు ఎవరికి దక్కనున్నాయనేది, ఆ అదృష్టవంతులు ఎవరు అనేది కూటమి వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఓ పక్క స్థానాలు తక్కువుగా ఉండటం, మరో పక్క పోటీ పడుతున్న నాయకుల జాబితా ఎక్కువుగా ఉండటంతో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలనేది కూటమి పెద్దలకు పెద్ద సవాలుగానే మారింది.
మార్చి నెలాఖరుకు పదవీ కాలం ముగియనుండటంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తిల పదవీ కాలం మార్చి నెలాఖరుకు ముగియనుంది. దీంతో వీటికి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఖాళీ కానున్న స్థానాల్లో తిరిగి వారికే మరో సారి అవకాశం కల్పిస్తారా? లేదా ? వేరే వారికి అవకాశం కల్పిస్తారా? అనేది అటు కూటమి వర్గాలు, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన యనమల ఆర్థిక మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశారు. సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. టీడీపీ కష్టకాలంలో గట్టెక్కించడంలో యనమల కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. ఎన్టీరామారావు ఎపిసోడ్‌లో యనమల కీ రోల్ పోషించారు. నాడు స్పీకర్‌గా ఉన్న యనమల ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లేడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చంద్రబాబుకు పూర్తి స్థాయిలో సహకరించారనే టాక్ కూడా ఉంది. లోకేష్ ఎంట్రీ ఇవ్వక ముందు వరకు టీడీపీలో యనమలది నంబరు టు స్థానం. 2019 వరకు కూడా ఇదే కొనసాగింది. తర్వాత ఈక్వేషన్స్ మారాయి.
అయినా ఈ సారి ఎన్నికల్లో తన కుమార్తెతో పాటు అల్లుడు, వీయ్యంకుడికి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్నారు. దశాబ్దాల తరబడి కలిసి ప్రయాణం సాగించిన సీఎం చంద్రబాబుకు, యనమలకు ఇటీవల కాస్త గ్యాప్ వచ్చిందనే చర్చ సాగింది. అత్యంత సీనియర్ నేత అయిన యనమలకు ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తిగానే ఉన్నారు. మంత్రి పదవి రాకపోయినా.. రాజ్యసభకు పంపుతారని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అదీ యనమలకు దక్క లేదు. నాటి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో యనమలకు తిరిగి అవకాశం కల్పిస్తారా? లేదా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక పరుచూరి అశోక్‌బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు మళ్లీ తమకే దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు, లోకేష్‌ల చుట్టు ప్రదక్షిణాలు చేసుకుంటున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తికి తిరిగి అవకాశం కల్పిస్తారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరో వైపు ఈ ఎమ్మెల్సీ పదవుల కోసం పలువురు టీడీపీ సీనియర్ నేతలు క్యూలో ఉన్నారు. వీరిలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించి, ∙దక్కించుకోలేక పోయిన నేతలే అధికంగా ఉన్నారు. వీరితో పాటు నామినేటెడ్ పదవులతో పాటు ప్రతిష్టాత్మకంగా భావించే టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారు కూడా ఈ పదవులను ఆశిస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రులు కేఎస్ జవహర్, దేవినేని ఉమాలతో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, రెడ్డి సుబ్రహ్మణ్యం, తిప్పేస్వామి, గన్ని వీరాంజనేయులు, నల్లపాటి రాము, ప్రభావకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీరికి అటు ఎమ్మెల్యే సీటు కానీ ఇటు నామినేటెడ్ పదవులు కానీ దక్క లేదు. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.
మరో వైపు ఇది వరకు ఎమ్మెల్సీలుగా ఉండి, 2014 నుంచి 2019 వరకు మండలిలో నాడు లోకేష్ చుట్టు రక్షణ వలయంలా ఉండి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదరించి, లోకేష్ వెంట నిలిచిన మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బుద్దా వెంకన్న, అంగర రామ్మోహన్‌లు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిందరూ అటు చంద్రబాబుకు, ఇటు లోకేష్‌కు అత్యంత సన్నిహితులే. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, డొక్క మాణిక్య వరప్రసాద్‌లు కూడా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ముస్లిం మైనారిటీ వర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత నాగూల్ మీరాతో పాటు పోతినేని శ్రీనివాసరావు, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, మద్దిపట్ల సూర్యప్రకాష్, మాజీ మంత్రి పీతల సుజాతల పేర్లు కూడా ఆశావాహుల జాబితో ఉన్నారు. ఎలాగైనా ఈ ఎమ్మెల్సీ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాజ్యసభ పదవిని వదులుకుని, రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న ఒప్పందం మేరకు మోపిదేవి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్య సభ స్థానానాకి రాజీనామా చేశారని, ఆ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని, ఆ మేరకు మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది.
మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పేరు బలంగా వినిపిస్తోంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు దక్కడం ఖాయమనే వాదన జనసేన శ్రేణుల్లో వినిపిస్తోంది. నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా టీడీపీ అధికారికంగా ఇది వరకే ప్రకటించింది. నాగబాబును ఎమ్మెల్సీగా చేసి, తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేది చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచన. దీంతో ఈ ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు దక్కడం ఖాయమనే టాక్ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే అటు ప్రభుత్వంలోను ఇటు టీడీపీలోను లోకేష్ కీలకంగా మారారనేది ఓపెన్ సీక్రెట్. ఈ సారి కూటమి మంత్రి వర్గం ఏర్పాటులో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించి తన మార్కును నిలుపుకున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి కేటాయించాలనే దానిపైన చంద్రబాబు కంటే లోకేష్ చాయిసే ఎక్కువుగా ఉంటుందని టీడీపీ వర్గల్లో చర్చ సాగుతోంది. దీంతో ఆశావాహులందరూ సీఎం చంద్రబాబు కంటే మంత్రి నారా లోకేషన్‌ను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమైనట్లు కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది.
Next Story