నారా లోకేష్‌కు ఏ మంత్రి పదవి ఇస్తారు?
టీడీపీలో నంబరు టూ స్థానంలో ఉన్న లోకేష్ ప్రభుత్వంలో ఎలాంటి రోల్ పోషించనున్నారు? ఏ మంత్రి పదవి వరించనుంది.
నారా చంద్రబాబు నాయుడు కుమారుడు.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు సెంట్రల్ పాయింట్‌గా మారారు. అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను లోకేష్ ఎలాంటి పాత్ర పోషించనున్నారు అనేది ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అత్యంత దారుణంగా ఓటమిపాలు కావడం, ఊహించని స్థాయిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం, అందరి అంచనాలను తారు మారు చేస్తూ భారీ స్థాయిలో సీట్లు రావడం, మెజారిటీ లభించడం చకచక జరిగి పోయాయి. ప్రతిపక్షంలో ఉండగా యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా కలియతిరగడం, అటు ప్రజలు, ఇటు టీడీపీ శ్రేణులకు చేరువ కావడం, తెలుగుదేశం పార్టీ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు చేయడం, తండ్రి చంద్రబాబును కాపాడుకోవడం, క్షేమంగా బయటకు తీసుకొని రావడం, కష్ట కాలంలో కూడా పార్టీని ఒంటి చేత్తో నడిపించడంలో లోకేష్ సఫలీకృతమయ్యారు. 2024 ఎన్నికల్లో ఇంతటి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్‌కి ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇస్తారనేది తాజాగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో నారా లోకేష్ చాలా కీలక మంత్రి పదవులు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖతో పాటు పరిశ్రమలు, ఐటి వంటి శాఖలకు ఆయన నేతృత్వం వహించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేక పోయినా తాను చేపట్టిన అన్ని శాఖలను విజయవంతంగానే నడిపించారనే పేరు తెచ్చుకున్నారు.
అయితే లోకేష్ మంత్రిగా వ్యవహరించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవకతవకలు జరిగాయని, చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం, జైలుకు పంపడం జరిగాయి. లోకేష్ ఓవర్ లుక్, ఓవర్ కాన్‌ఫెడెన్స్ వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయనే చర్చ చంద్రబాబు అరెస్టు సమయంలో ఆ పార్టీలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సారి లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో చంద్రబాబు పడ్డట్టు కూడా టాక్ ఉంది.
అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని లోకేష్‌కు మంత్రి పదవి లేకుండా చంద్రబాబు మంత్రి వర్గం ఉండదనే చర్చ ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉంది. ఏ మంత్రిత్వ శాఖను లోకేష్‌కు ఇవ్వాలనే దానిపైన చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో ఇచ్చిన మాదిరిగానే అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, పరిశ్రమలు, ఐటీ శాఖలే ఈ సారి కూడా కేటాయిస్తారా లేక పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తారనే దానిపైన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.
అయితే లోకేష్ మాత్రం ఈ సారి హోమ్ శాఖ కావాలని పట్టుబడుతున్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను గాడిలో పెట్టాలన్నా.. పోలీసు యంత్రాంగంపై పట్టు సాధించాలన్నా హోమ్ శాఖ అయితే కీలకంగా ఉంటుందని లోకేష్ భావిస్తున్నట్లు టాక్ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోమ్ శాఖ వల్లనే అనేక ఇబ్బందులు నెలకొన్నాయని, సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారుల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని, అందుకే రెడ్ బుక్‌ను తెరపైకి తేవలసి వచ్చిందిని, దీనిలో పోలీసు అధికారుల పేర్లే ఎక్కువుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో హోమ్ శాఖ అయితే అన్నింటికి న్యాయం చేకూర్చినట్లు ఉంటుందని లోకేష్ పట్టుపడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్‌కు ఏ మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు అప్పగిస్తారనేది అటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోను, ఇటు అధికారులు, ప్రజల్లోను ఆసక్తికరంగా మారింది.
Next Story